రూ.1000 అందలేదు...

ABN , First Publish Date - 2020-04-09T12:32:58+05:30 IST

రూ.1000 అందలేదు...

రూ.1000 అందలేదు...

  •  కరోనా నగదు సాయం తమకు ఇవ్వలేదంటూ  కాల్‌సెంటర్‌కు ఫిర్యాదుల వెల్లువ  తెల్లకార్డులదారులందరికీ పంపిణీ చేస్తామని అధికారుల వెల్లడి 
  • జిల్లా మొత్తం మీద 10,46,980 మందికి నగదు పంపిణీ చేసినట్టు వెల్లడి

విశాఖపట్నం: ప్రభుత్వం ఇస్తున్న రూ.1000 ‘కరోనా సాయం’ తమకు అందలేదంటూ కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కాల్‌ సెంటర్‌కు వస్తున్న ఫోన్‌ కాల్స్‌లో అత్యధికంగా ఇవే ఉంటున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం లాక్‌డౌక్‌ విధించడంతో రోజువారీ కూలీలకు, పేదలకు పనులు లేకుండాపోయాయి. వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇస్తున్నది. ఇంకా బియ్యం కార్డుదారులకు రూ.1000 చొప్పున నగదు సాయం కూడా చేయాలని నిర్ణయించింది. నాలుగు రోజుల క్రితం నగదు పంపిణీని ప్రారంభించింది. తెల్లకార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు ఇచ్చి, రూ.1000ను కొత్తగా జారీచేసిన బియ్యం కార్డుదారులకే మంజూరుచేసింది.    దీంతో సాయం అందని వారంతా ఆందోళన వ్యక్తంచేస్తూ తొలుత స్థానిక వలంటీరును, తరువాత రేషన్‌ డీలరును సంప్రతిస్తున్నారు. తమకెటువంటి సమాచారం లేదని చెప్పడంతో కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తున్నారు. కాల్‌ సెంటర్లకు అందుతున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ నేతృత్వంలో అధికారులు ఆయా ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. జేసీ స్వయంగా కొంతమంది ఫిర్యాదుదారులకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో తెల్లరేషన్‌కార్డులందరికీ కరోనా నగదు సాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నాటికి జిల్లా మొత్తం మీద 10,46,980 మందికి నగదు పంపిణీ చేశారు. మిగిలిన వారికి కూడా అందజేస్తామని అధికారులు తెలిపారు

Updated Date - 2020-04-09T12:32:58+05:30 IST