రూ.1,667 కోట్ల మద్యం అమ్మకాలు

ABN , First Publish Date - 2021-12-01T04:49:46+05:30 IST

మద్యం అమ్మకాల్లో సిద్దిపేట జిల్లా అగ్రస్థానానికి దూసుకెళ్తున్నది. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే ప్రకారం తెలంగాణలో జిల్లా ఐదోస్థానంలో ఉన్నది. ఇక్కడ జనాభాలో 50.3 శాతం మంది మద్యం ప్రియులు ఉన్నట్టు వెల్లడించింది. దీనిని బలపరుస్తూ గడిచిన రెండేళ్లలో జిల్లా వ్యాప్తంగా రూ.1667 కోట్ల మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. 2017–19 లైసెన్సు కాలంతో పోల్చితే ఇది రూ. 300 కోట్లు ఎక్కువ.

రూ.1,667 కోట్ల మద్యం అమ్మకాలు
సిద్దిపేటలో మద్యం నిల్వలను తీసుకువస్తున్న షాపు కొత్త యాజమాన్యం

గడిచిన రెండేళ్లలో సిద్దిపేటలో రికార్డుస్థాయిలో విక్రయాలు

మద్యం అమ్మకాల్లో రాష్ట్రంలోనే ఐదోస్థానం

నేటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, నవంబరు 30: మద్యం అమ్మకాల్లో సిద్దిపేట జిల్లా అగ్రస్థానానికి దూసుకెళ్తున్నది. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే ప్రకారం తెలంగాణలో జిల్లా ఐదోస్థానంలో ఉన్నది. ఇక్కడ జనాభాలో 50.3 శాతం మంది మద్యం ప్రియులు ఉన్నట్టు వెల్లడించింది. దీనిని బలపరుస్తూ గడిచిన రెండేళ్లలో జిల్లా వ్యాప్తంగా రూ.1667 కోట్ల మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. 2017–19 లైసెన్సు కాలంతో పోల్చితే ఇది రూ. 300 కోట్లు ఎక్కువ. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, ఐదు పట్టణాల్లో మున్సిపల్‌ ఎన్నికల కారణంగా కూడా కొంత మద్యం అమ్మకాలు పెరిగాయి. గడిచిన రెండేళ్లలో కరోనా, లాక్‌డౌన్‌ ప్రభావం ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలు మాత్రం తగ్గలేదు. మొదటి లాక్‌డౌన్‌లో వైన్‌షాపులను పూర్తిగా మూసివేసినా రెండో లాక్‌డౌన్‌లో మాత్రం దుకాణాలు తెరిచారు. లాక్‌డౌన్‌లో నష్టపోయిన కాలానికి అదనంగా ఒకనెల లైసెన్సు గడువు పొడిగించారు. మద్యం ఉత్పత్తుల్లో బీర్లు, ఖరీదైన స్కాచ్‌ అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్లలో 20.38 లక్షల పెట్టెల లిక్కర్‌, 21.51 లక్షల పెట్టెల బీర్లు అమ్ముడుపోయాయి. ఈ లెక్కన 2.58 కోట్ల బీరు సీసాలు అమ్ముడుపోయాయి. లిక్కర్‌ విక్రయాల్లోనూ ఖరీదైన స్కాచ్‌ విస్కీ వాటా 60 నుంచి 70 శాతం వరకు ఉండటం విశేషం. వచ్చే రెండేళ్లలో జిల్లాలో మద్యం అమ్మకాలు రూ. 2వేల కోట్లను దాటే అవకాశం ఉన్నది. అందుకే మూడో దశ కరోనా సంకేతాలు ఉన్నప్పటికీ ఏ మాత్రం వెనక్కుతగ్గకుండా ఆశావహులు వైన్‌షాపుల కోసం పోటీపడ్డారు. 


నేటి నుంచి కొత్త మద్యం పాలసీ

నేటి నుంచి 2023 నవంబరు నెలాఖరు వరకు కొత్త మద్యం పాలసీ అమలులో ఉండనున్నది. జిల్లాలో పాత మద్యం పాలసీలో భాగంగా రెండేళ్ల 70 మద్యం దుకాణాలు, 12 బార్లు ఉన్నాయి. తాజాగా 23 కొత్త దుకాణాలను జిల్లాకు కేటాయించారు. రెండు బార్లకు కూడా అనుతులు ఇవ్వడంతో ప్రస్తుతం 93 మద్యం షాపులు, 14 బార్లు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ప్రకారం వైన్‌షాపులను దక్కించుకోవడానికి వచ్చిన దరఖాస్తులతోనే ఆబ్కారీశాఖకు భారీగా ఆదాయం వచ్చింది. 93 మద్యం దుకాణాలకు 1,755 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రుసుము రూ.2లక్షల చొప్పున రూ.35.10 కోట్ల ఆదాయం వచ్చింది. ఎలాంటి మార్కెటింగ్‌ అవసరం లేకుండా వ్యాపారం కొనసాగడం, లాభాలు పుష్కలంగా ఉండడంతో ఆశావహులు మద్యం వ్యాపారంపై దృష్టిపెట్టారు. వచ్చే రెండేళ్లలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ఉండడంతో మద్యం అమ్మకాలు పెరుగుతాయనే అంచనాలు కూడా పోటీ పెరగడానికి కారణమయ్యాయి. మరోవైపు లాటరీలో షాపులు దక్కించుకున్న కొందరు రూ.50 లక్షల గుడ్‌విల్‌ తీసుకొని ఇతరులకు లైసెన్సులు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. 

నేటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి రానున్నది. జిల్లాలోని 93 మద్యం దుకాణాలు కొత్త యజమానుల చేతుల్లో కొనసాగనున్నాయి. పాతవారికే లైసెన్సు దక్కినచోట యథావిధిగా మద్యం అమ్మకాలు జరగనున్నాయి. పాత స్టాకు నిల్వల లెక్కలు అప్పజెప్పి, కొత్తగా నిల్వలు తెప్పించుకున్నారు. కొత్తగా షాపులు దక్కించుకున్నవారు మంచి ముహూర్తం కోసం చూస్తున్నారు. ప్రముఖ సెంటర్లలో అద్దె భవనాలు, పర్మిట్‌రూంలు అనుకూలంగా ఉండేలా చూసుకుంటున్నారు. అట్టహాసంగా కొత్త షాపుల ప్రారంభోత్సవాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.

Updated Date - 2021-12-01T04:49:46+05:30 IST