రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2020-05-22T09:45:27+05:30 IST

సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ బస్సు రోడ్డెక్కింది. రెడ్‌జోన్‌లో ఉన్న హిం దూపురం మినహా జిల్లాలో మిగిలిన

రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సు

తొలిరోజు 111కుగాను 94 బస్సుల్లోనే రాకపోకలు

పలు ప్రాంతాల్లో  స్టార్టింగ్‌ ట్రబుల్‌

డిపోల్లో కానరాని పరీక్ష యంత్రాలు 

కొన్ని చోట్ల మార్గదర్శకాల ఉల్లంఘన

కలెక్షన్‌ మొత్తం రూ. 3 లక్షలే


అనంతపురం టౌన్‌, మే 21 : సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ బస్సు రోడ్డెక్కింది.  రెడ్‌జోన్‌లో ఉన్న  హిందూపురం మినహా జిల్లాలో మిగిలిన అన్ని డిపోల పరిధిలోనూ బస్సులు రోడ్డెక్కాయి. సుదీర్ఘ కాలం డిపోలకే పరిమితమైన బస్సులు  పలు ప్రాంతాల్లో  స్టార్ట్‌ అవ్వకుండా మొండికేశాయి. లాక్‌డౌన్‌ సడలింపుతో గురువారం పరిమిత బస్సుల్లో పరిమిత సీట్లతో ప్రజారవాణా పునఃప్రారంభమైంది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా గురువారం ఉదయం నుంచి  12 డిపోల్లోనూ ప్రజారవాణా కోసం 111 బస్సులను  ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. అయితే   ప్రయాణికులు ఎక్కువగా రాకపోవడంతో 94 బస్సులను మాత్రమే వినియోగించారు. కడప, కర్నూలు, మదనపల్లి, ఆదోని రూట్లకూ బస్సు సర్వీసులను నడిపారు. శానిటైజేషన్‌ చేయించిన తర్వాతనే బస్సులను ప్లాట్‌ఫాం వద్దకు తీసుకువచ్చారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆయా రూట్ల వారీగా బస్సుల రాకపోకలు సాగించాయి. బస్సుల్లోనూ ప్రయాణికులు భౌతికదూరం పాటించారు.  లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలలుగా బస్సులను వినియోగించలేదు. దీంతో పలు ప్రాంతాల్లో బస్సులు స్టార్ట్‌ కావడానికి మొరాయించాయి.  దీంతో సిబ్బంది ఆ బస్సులను తోస్తూ ఇంజన్‌ స్టార్ట్‌ చేయాల్సి వచ్చింది.


కానరాని థర్మల్‌ స్ర్కీనింగ్‌ యంత్రాలు

కరోనా వ్యాప్తి నివారణ దృష్ట్యా డిపోలకు వచ్చిపోయే డ్రైవర్లు, కండెక్టర్లతోపాటు బస్టాండుకు వచ్చే ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ యంత్రాలతో పరీక్షించాల్సి ఉంది. అయితే గురువారం బస్సు సర్వీసులు పునఃప్రారంభించినప్పటికీ రీజియన్‌లో డిపోలతోపాటు బస్టాండుల్లోనూ థర్మల్‌ స్ర్కీనింగ్‌ యంత్రాలు కనిపించలేదు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆర్టీసీ డ్రైవర్లు ఎలాంటి ప్రాంతాల్లో ఉంటున్నారో వచ్చి పోయే మార్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియని పరిస్థితి. ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్‌ ఉన్నా వారినుంచి బస్సులో  ప్రయాణికులందరికీ వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఈ ప్రమాదం జరగకూడదంటే డ్రైవర్లు డిపోకు చేరుకున్న వెంటనే థర్మల్‌ స్ర్కీనింగ్‌తో పరీక్షించాల్సి ఉంది. అయితే అధికారులు థర్మల్‌ స్ర్కీనింగ్‌ యంత్రాలను ఏ డిపోలోనూ ఏర్పాటు చేయలేదని ఆ శాఖ వర్గాలనుంచే వినిపిస్తోంది. గురువారం జిల్లాకేంద్రంలోనూ థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయకుండానే డ్రైవర్లు డ్యూటీ ఎక్కారు. జిల్లాలో చాలాప్రాంతాల్లో టికెట్‌ ఇచ్చే సమయంలో ప్రయాణికులు, కండెక్టర్లు ఎవరూ గ్లౌజులు ధరించకుండానే నగదు చేతులమార్చుకోవడం కనిపించింది.


చిన్నపిల్లలు, వృద్ధులను బస్సులోకి అనుమతించిన వైనం..

అత్యవసరం అయితే తప్ప 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు, 10 సంవత్సరాల్లోపు చిన్నారులను బస్సుల్లో ప్ర యాణానికి అనుమతించకూడదన్న ప్రభుత్వ మార్గదర్శకా లను జిల్లాలో పాటించలేదు. సాధారణ రోజుల తరహాలోనే వృద్ధులు, చిన్నపిల్లలను బస్సుల్లోకి అనుమతించారు. గుత్తికి చెందిన గురుస్వామి అనే 80 సంవత్సరాల వృద్ధుడు జిల్లాకేంద్రం నుంచి గుత్తి బస్సు ఎక్కి ప్రయా ణం చేయగా... 75 సంవత్సరాల మరో వృద్ధుడు కదిరి బస్సు ఎక్కి వెళ్లాడు. ఇలా దాదాపు అన్ని రూట్లలోనూ ముసలివారు, చిన్నారులను సైతం ప్రయాణానికి సాధారణ రోజులతరహాలోనే అనుమతించారు. 


మాస్కు, శానిటైజేషన్‌ ఉంటేనే ప్రయాణం

సుదీర్ఘ కాలంతర్వాత బస్సు సర్వీసులు పునఃప్రారంభం నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణానికి అధికారులు ఆంక్షలు విధించారు. మాస్కులు ధరించడంతోపాటు చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేసుకునేలా చర్యలు చేపట్టారు. వైరస్‌ వ్యాప్తి నివారణ దృష్ట్యా  కండెక్టర్లు లేకుండానే బస్సుల రాకపోకలను సాగించారు. బస్సు ఎక్కే ప్రతి ప్రయాణికుడు మాస్కు ధరించి ఉండేలా జాగ్రత్తలు చేపట్టారు. బస్సు ఎక్కే ముందే కండెక్టరు వద్ద గల శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాకే వారికి టికెట్లను కేటాయించారు. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్నవారిని సైతం కండెక్టరు వద్దకు వచ్చి శానిటైజర్‌తో చేతులు శుభ్రపరుచుకున్నాకే బస్సుల్లోకి అనుమతించారు.


ఆంక్షలు మంచికోసమే : వీరా, హోటల్‌ మేనేజర్‌, గుత్తి

బస్సుల్లో ప్రయాణం అందరికీ నిత్య అవసరమైన విషయమే. లాక్‌డౌన్‌ కారణంగా రెండునెలలపాటు బస్సు సర్వీసులు లేకపోవడంతో మా నాన్నను గుత్తి నుంచి అనంతపురం తెచ్చి వైద్య చికిత్సలు చేయించడం కష్టతరమైంది. ఎట్టకేలకు బస్సులైతే ప్రారంభమయ్యాయి. అవసరమైనపుడు అనంతపురం వచ్చి మా నాన్నకు వైద్య చికిత్సలు చేయించుకునే వెసులుబాటు దక్కింది. బస్సుల్లో భౌతికదూరంకోసం సీట్ల ఏర్పాటు, మాస్కులు ధరించడం, శానిటైజర్‌ వినియోగం వంటి ఆంక్షలు ప్రజలందరి మంచికోసమే.


చిరువ్యాపారులకు ఊరట : రంగయ్య, చిరువ్యాపారి

ఊరూరికీ బస్సుల్లో వెళ్తూ చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే మాలాంటి చిరువ్యాపారులకు కొంత ఊరటనిచ్చే విషయం. లాక్‌డౌన్‌తో చాలారోజులనుంచి బస్సుల రాకపోకలు లేక చేతిలో ఉన్న కొంత డబ్బు కూడా ఇంటిఖర్చులకు చాలక ఇతరులవద్ద వడ్డీకి అప్పులు తెచ్చుకుని పొట్టపోసుకున్నాం. ఇంతకాలానికి బస్సులు తిరగడంతో ఊపిరి పీల్చుకున్నట్లయింది.


కూతురుని చూడ్డానికి వచ్చి ఇక్కడే నిలిచిపోయా : మారెక్క, గృహిణి, కుర్లపల్లి (కళ్యాణదుర్గం)

నా కూతురు అనంతపురంలో ఉంది. ఆమెను చూసి వెళ్దామని అనంతపురం వచ్చా. ఆ మరుసటిరోజే లాక్‌డౌన్‌తో బస్సులు ఆగిపోయాయి. ఊరికి వెళ్లే ఆస్కారం లేక ఇన్నిరోజులూ నా కూతురింట్లోనే ఉన్నా. ఏనాడూ మా ఊరిని విడిచి ఇన్నిరోజులు బయటి ప్రాంతాల్లో ఉండ లేదు. లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడే నిలిచిపోయా. మొత్తానికి బస్సులు ప్రారంభమవడంతో ఇన్నిరోజులతర్వాత మా ఊరికి వెళ్లే అవకాశం కలిగింది.

తొలిరోజు కలెక్షన్‌ రూ.3 లక్షలే

సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ బస్సులు పునఃప్రా  రంభమైనా వివిధ కారణాలతో వాటికి తగిన కలెక్షన్‌ లభించలేదు. మామూలు రోజుల్లో రోజుకు రూ.కోటి కలె క్షన్‌ అవుతుండగా గురువారం అది కేవలం రూ.3 లక్షలకే పరిమితమైంది. సాధారణ రోజుల్లో రోజుకు దాదాపు 900 బస్సులు 3.61లక్షల కి.మీ.లు రాకపోకలు సాగిస్తుండగా వాటిద్వారా రోజుకు రూ.1.10కోట్ల నుంచి రూ.1.25 కోట్ల మధ్య టికెట్ల రూపంలో కలెక్షన్‌ అయ్యేది.   గురువారం  94 బస్సులు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12వేల కిలోమీటర్లు మాత్రమే తిరగ్గా వాటిద్వారా  రూ.3లక్షలు కలెక్షన్‌ వచ్చింది.

Updated Date - 2020-05-22T09:45:27+05:30 IST