మీటరు మాయ!

ABN , First Publish Date - 2021-09-17T06:09:02+05:30 IST

మీటరు మాయ!

మీటరు మాయ!

రీడింగ్‌ మార్చి.. అధికారులను ఏమార్చి

ఫిట్‌‘లెస్‌’తోనే అత్యధిక ప్రమాదాలు

పాత బస్సులను అద్దెకి పెడుతున్న వైనం

కాలంచెల్లిన వాహనాలతో ప్రజల అవస్థలు

ఆర్టీసీ బస్సుల తనిఖీలపై ఆర్టీఏ అధికారుల నిర్లిప్తత

ఖమ్మం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): బస్సు పాతదే.. అయినా కొత్త వాహనంగా చూపిస్తారు. దాని కండీషన్‌ చాలా బాగుందనిపిస్తారు. కాసింత రంగు వేసి మెరుగులు దిద్దుతారు. స్కారప్‌కు వెళ్లాల్సిన బస్సును రోడ్లపైకి తీసుకొస్తున్నారు. ఇది ప్రస్తుతం జిల్లాలో కొన్ని అద్దె బస్సుల పరిస్థితి. కొందరు అద్దె బస్సుల యజమానులు లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులకు మీటరు రీడింగు మార్చి మాయ చేస్తున్నారన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులను రూట్‌ మీదకు పంపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పాత బస్సులకు మీటర్ల మాయాజాలం ప్రదర్శించి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలూ లేకపోవు. సాధారణంగా ఆర్టీసీలో 12 ఏళ్లు సర్వీసుగా ఉంచి 12,500 కి.మీ ప్రయాణం చేశాక స్ర్కాప్‌గా చేస్తారు. ఆర్టీసీకి చెందిన బస్సులను అయితే అధికారులు వెంటనే అనుకున్న పనిచేసేస్తారు. కానీ అవి అద్దెకి తీసుకున్న వాహనాలు కావడంతో ఆయా బస్సుల యజమానులు కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి బస్సులు రోడ్లపై తిరగడం వెనుక కొందరు అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రీడింగులో మాయ..

ఆర్టీసీలో అద్దె బస్సుల నిర్వహణ ఏళ్లుగా సాగుతోంది. అద్దెకు బస్సులను తీసుకునేటప్పుడు మొదట ఐదేళ్లకు ఒప్పందం చేసుకుంటారు. ఆ గడువు ముగిసిన తర్వాత మరో రెండేళ్ల పొడగింపు ఇస్తారు. ఇలా ఏడేళ్ల పాటు మాత్రమే ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నడిపేందుకు అనుమతి ఉంటుంది. అప్పటి వరకు అద్దె బస్సు నడిపిన యజమాని మళ్లీ కొత్త బస్సు కొనుగోలు చేస్తే ఆర్టీసీ అద్దెకు తీసుకుంటుంది. కానీ అది పూర్తయిన తర్వా త కూడా పాత బస్సులనే అద్దెకు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షల కిలోమీటర్లు తిరిగినా ఆయా బస్సుల మీటర్ల రీడింగులను మారుస్తున్న కొందరు యజమానులు తక్కువ కిలోమీటర్లు తిరిగినట్టుగా మాయాజాలం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ఎక్స్‌ప్రెస్‌ బస్సులను నాలుగేళ్లకోసారి, పల్లెవెలుగు బస్సులను ఆరేళ్లకు ఒకసారి కండీషన్‌లో ఉన్నాయా లేవా అన్న అంశాలను పరీక్షి స్తారు. అయితే ఆయా సమయాల్లో అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి మమ అనిపించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా వాహనాల కాలం చెల్లిపోయినా స్ర్కాప్‌కు పంపకుండా రీడింగులో మాయ చేసి రూట్‌కు పంపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

నెలకు రూ.5కోట్ల చెల్లింపులు..

ఖమ్మం, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాల్లో మొత్తం ఆర్టీసీ బస్సులు 647 నడుస్తున్నాయి. వాటిలో మొత్తం అద్దె బస్సులు సుమారు 200 వరకు ఉండగా.. అందులో పల్లె వెలుగు 86, ఎక్స్‌ప్రెస్‌ 98 ఉన్నాయి. ఆయా బస్సుల్లో ఖమ్మం 58, కొత్తగూడెం 23, మధిర 21, భద్రాచలం 25, సత్తుపల్లి 36, మణుగూరు 21 ఉన్నాయి. నిత్యం ఆర్టీసీ బస్సుల్లో లక్షా 30 వేల మంది ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. ఇరు జిల్లాల నుంచి ప్రతిరోజూ సుమారు రూ.70లక్షల ఆదాయం వస్తుంది. కాగా ఇరు జిల్లాల్లో నడిచే అద్దె బస్సులకు రూ.5కోట్లను ఆర్టీసీ అద్దె చెల్లిస్తోంది. అయితే ఆయా బస్సుల్లో సుమారు 100బస్సుల వరకు కండీషన్‌ సరిగా లేనివి, స్ర్కాప్‌కు తరలించే దశలో ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. 

ఆర్టీఏ తనిఖీలు శూన్యం..

ఫిట్‌నెస్‌ కోసం కొత్త బస్సుకైతే రవాణాశాఖ వారు రెండేళ్లు, పాత బస్సుకైతే ప్రతీ ఏడాదికి ఫిట్‌నెస్‌ అందిస్తారు. అంతేకాదు ప్రైవేటు వాహనాల మాదిరిగా ప్రభుత్వ వాహనాలను కూడా వారు తనిఖీ చేయాల్సి ఉంటుంది. వాహన సామర్థ్యం, పటిష్ఠం, ఓవర్‌లోడ్‌, సిబ్బంది నైపుణ్యత లాంటి అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఆర్టీఏ అధికారులు ఏదో నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకొంటున్నా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆర్టీసీలో నిర్వహించే అద్దె బస్సులకు సంబంధించి ఏదైనాధ్వంసమైనా మరమ్మతులు కూడా చేయించడం లేదన్న వాదన వినిపిస్తోంది. కారణంగా కిటికీల నుంచి విపరీత మైన శబ్ధం, సస్పెన్స్‌ లేక ఎత్తివేస్తూ వెళ్లడం, బస్సుఎక్కే ద్వారం వద్ద మెట్లు ధ్వంసమై ఉండటం, రేకులతో ప్రత్యామ్నాయ మరమ్మతులు చేయడం లాంటివి ఉంటున్నాయని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

డిపోల్లో మూలుగుతున్న కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు..

12లక్షల కిలో మీటర్ల మైలేజ్‌ 12ఏళ్ల కాలవ్యవధి దాటిన ఆర్టీసీ బస్సు లను కరీంనగర్‌లలోని స్ర్కాప్‌ యార్డ్‌కు తరలించాల్సి ఉంది. కానీ ఇరు జిల్లాల వ్యాప్తంగా ఆరు డిపోల్లో కాలం చెల్లిన బస్సులు పదుల సంఖ్య లోనే ఉన్నాయి. అలా కేవలం ఖమ్మం డిపోలోనే సుమారు 35బస్సులు ఉన్నాయి. ప్రతీ ఆర్టీసీ బస్సు 15వేల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత షెడ్యూల్డ్‌ మూడు ప్రకారం స్టీరింగ్‌ బాక్స్‌, ఇంజన్‌ కండీషన్‌, బ్రేక్స్‌, జాయింట్స్‌, హబ్బుల సర్వీసింగ్‌, టైర్లు, బాడీ కండీషన్‌, ఎలక్ట్రికల్‌ సిస్టమ్స్‌ సిట్టింగ్‌, పెయింటింగ్‌, నాలుగో షెడ్యూల్‌లో 45వేల కిలోమీటర్లు ప్రయాణించిన బస్సులకు గేర్‌ బాక్స్‌, క్లబ్‌ ప్లేట్స్‌, స్పింగర్‌, డీజిల్‌ ట్యాంక్‌, రేడియేటర్‌ క్లీనింగ్‌, గ్రీజ్‌ అప్‌ క్లీనింగ్‌ లాంటివి చెక్‌ చేయాల్సి ఉండగా.. గ్యారేజీల్లో మెకానిక్‌లపై పనిభారం పడుతోందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో మెకానిక్‌కు ఒక్కో హెల్పర్‌ ఇవ్వాల్సి ఉండగా.. అధికారులు అలాంటి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే కండీషన్‌లో ఉన్న బస్సులను మాత్రమే సర్వీసులకు అనుమతిస్తామని, ఆర్టీసీ, ప్రభుత్వ, ప్రైవేట్‌ బస్సుల వల్ల ఇబ్బందులు లేవని, ప్రయాణికుల ప్రయాణానికి పూర్తి భరోసా కల్పిస్తున్నామని డిపోస్థాయి అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2021-09-17T06:09:02+05:30 IST