రెండు రోజుల్లో ఆర్టీసీ బాదుడు!

ABN , First Publish Date - 2021-12-02T07:55:33+05:30 IST

చార్జీల బాదుడుకు టీఎ్‌సఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. మరో రెండు రోజుల్లోనే బస్సు చార్జీలు పెరగనున్నాయి.

రెండు రోజుల్లో ఆర్టీసీ బాదుడు!

  • పల్లె వెలుగులో కిలోమీటరుకు 25పైసలు
  • ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 30పైసల దాకా పెంపు
  • ప్రయాణికులపై ఏడాదికి 680 కోట్ల భారం
  • ప్రత్యామ్నాయం లేకే చార్జీల పెంపు: పువ్వాడ


హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): చార్జీల బాదుడుకు టీఎ్‌సఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. మరో రెండు రోజుల్లోనే బస్సు చార్జీలు పెరగనున్నాయి. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటరుకు 25పైసలు, ఇతర ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కిలోమీటరకు 30పైసల చొప్పున వడ్డించనుంది. వాస్తవానికి టికెట్‌ చార్జీల పెంపుపై గత నెలలోనే టీఎస్‌ఆర్టీసీ ప్రతిపాదనలు సిద్ధం చేసి, అనుమతి కోసం సీఎం కేసీఆర్‌కు పంపించింది. అయితే, హుజురాబాద్‌ ఉప ఎన్నిక, ఆ వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో చార్జీల పెంపునకు బ్రేక్‌ పడింది. తాజాగా ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణా శాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌తో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ బుధవారం సమీక్ష నిర్వహించడంతో ఈ అంశం మరో సారి తెరపైకి వచ్చింది.


సమావేశం అనంతరం మంత్రి పువ్వాడ విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే చార్జీలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. వాస్తవానికి గత మూడేళ్లలో ఏకంగా రూ.4,260కోట్ల మేర నష్టాలను ఆర్టీసీ మూటగట్టుకుంది. ప్రతిపాదిత చార్జీలను ప్రభుత్వం ఆమోదిస్తే కొంత వరకైనా నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. టికెట్ల విక్రయం ద్వారా ప్రస్తుతం రోజూ రూ.11.50కోట్లు వస్తుండగా.. పెరగనున్న చార్జీలతో అదనంగా మరో రూ.2కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. తద్వారా ఆర్టీసీకి ఏటా సుమారు రూ.680కోట్లకు పైగా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది.


నష్టాల నుంచి గట్టెక్కించేందుకే...

తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కొంత వరకైనా గట్టెక్కించేందుకే చార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ చెప్పారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు సమర్పించారని, అనుమతి రాగానే కొత్త చార్జీలు అమలు చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ స్థితిగతులపై సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొన్ని నెలల్లోనే డీజిల్‌ ధర 27శాతానికిపైగా పెరగడంతో ప్రతి రోజూ 6.8లక్షల లీటర్లను వినియోగిస్తున్న ఆర్టీసీపై తీవ్ర భారం పడుతోందని తెలిపారు. దీనికి తోడు బస్సు యంత్ర విడిభాగాల ధరలు పెరగడంతోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గడిచిన మూడేళ్లలో ఆర్టీసీకి రూ.4,260కోట్ల మేర నష్టాలు వచ్చినట్టు వివరించారు. ఖర్చులు పెరిగినప్పటికీ ఉద్యోగులను కాపాడుకుంటూ బస్సులను విజయవంతంగా నడుపుతున్నట్టు తెలిపారు. చార్జీలపెంపుతో నష్టాలను పూర్తిగా భర్తీ చేయలేకపోయినా కొంత మేరకు తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నారు. టిక్కెట్‌యేతర ఆదాయాన్ని పెంచుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు  చెప్పారు. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు రాష్ట్రప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో రూ.1500కోట్లు విడుదల చేస్తోందన్నారు. అలాగే బడ్జెట్‌యేతర నిధులు మరో రూ.1500కోట్లు సమకూర్చుతోందని వివరించారు. 

Updated Date - 2021-12-02T07:55:33+05:30 IST