ఆర్‌‘ఢీ’సీ

ABN , First Publish Date - 2021-09-16T05:29:02+05:30 IST

ఆర్‌‘ఢీ’సీ

ఆర్‌‘ఢీ’సీ
కొణిజర్ల వద్ద జరిగిన ప్రమాదం (ఫైల్‌)

ప్రమాదాలకు గురవుతున్న ఆర్టీసీ బస్సులు

ఏటికేడు పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య

నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, అతివేగమే కారణాలు

అద్దెబస్సులకు అనుభవం లేని డ్రైవర్లను నియమిస్తున్నారని ఆరోపణలు

గడిచిన పదిహేను రోజుల్లో ఐదు ఘటనలు

బస్సులెక్కాలంటేనే జంకుతున్న ప్రయాణికులు

ఖమ్మం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘అతివేగం ప్రమాద కరం.. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం.. ఆర్టీసీ బస్సుల్లో సౌకర్య వంతంగా ప్రయాణించి.. సుఖమయంగా, సురక్షితంగా జీవిం చండి’ ఇదీ ప్రతీ ఆర్టీసీ బస్సుపై రాసే నినాదం. అంతేకాదు ఉన్న తాధికారులు చెప్పే మాట. కానీ ఇందుకు భిన్నంగా ఉంది ఆర్టీసీ బస్సుల పరిస్థితి. సౌకర్యం, సుఖం, సురక్షితం ఏమో కానీ బస్సులు ఎక్కితే ఎక్కడ ప్రాణాలు పోతాయోనన్న భయం ప్రయాణికుల్లో కనిపిస్తోంది. అందుకు ఇటీవల ఆర్టీసీ బస్సులు తరచూ ప్రమా దాలకు గురవడమే కారణం. ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాలు పూర్తయిన తర్వాత రోజుల వ్యవధిలోనే ఉమ్మడి జిల్లాలో వరుసగా జరుగుతున్న ఆర్టీసీ బస్సుల ప్రమాదాలతో ప్రజలు బెంబేలెత్తుతు న్నారు. బస్సులు ఎక్కాలంటేనే జంకుతున్నారు. అయితే ఆయా ప్రమాదాలకు నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, అతివేగంతో పాటు కాలం చెల్లిన బస్సులను కూడా  నడుపుతుండటమూ కారణమన్న అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అద్దె బస్సులతోనే ఎక్కువ ప్రమాదాలు..

రాష్ట్ల్రంలో ఆర్టీసీ నష్టాల్లో ఉండటంతో కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు. దీంతో బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవడంతో వాటి వాడకం పెరుగుతోంది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాల్లోనూ సుమారు 200 వరకు అద్దె బస్సులను నడిపిస్తున్నారు. వీటిలో అత్యధిక బస్సుల డ్రైవర్లు అతివేగంగా నడుపుతున్నారని, అందువల్లే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అద్దె బస్సుల యాజమాన్యాలు వారికి సమయానికి డ్రైవర్లు దొరకకపోవడంతో అనుభవం లేని వారిని విధుల్లోకి తీసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ సమయానికి ఎవరు అందుబాటులో ఉంటే వారే డ్రైవర్‌ అన్నట్టుగా బస్సు ఎక్కించి రూటుకు పంపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అద్దె బస్సులకు నియమించే డ్రైవర్ల విషయంలో ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఏటికేడు బస్సు ప్రమాదాల సంఖ్య పెరు గుతోంది. ఏడాదికి సుమారు 100 ప్రమాదాలు జరుగుతుండగా.. సగటున 30 నుంచి 40వరకు మృతుల సంఖ్య ఉంటుంది. 

అధికారుల కమీషన్ల కక్కుర్తితోనేనా?

అద్దె బస్సులు యజమానులు ఇచ్చే జీతాలు అరకొరగా ఉంటాయి. ఆర్టీసీకి చెందిన డ్రైవర్లకు ఉండే లబ్ధి.. అద్దె బస్సు డ్రైవర్‌కు విధులు నిర్వహించేవారికి ఉండవు. దీంతో అద్దె బస్సులకు పనిచేసేందుకు అనుభవం ఉన్న డ్రైవర్లు ముందుకురాని పరిస్థితి ఉంది. దీంతో ఆయా యజమానులు అరకొర నైపుణ్యం ఉన్న లారీలు, డీసీఎంలు, మినీ బస్సులు నడిపినవారిని విధుల్లోకి తీసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారులు కమీషన్లు దండుకుంటున్నారని, అందువల్లే అద్దెబస్సుల యజమానులపై చర్యలకు ఉపక్రమించే పరిస్థితులు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అద్దె బస్సులకు వచ్చే డ్రైవర్ల విషయంలో కేవలం లైసెన్సు ఉందన్న సాకుతో వైద్య పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారణంగా ఎందరో అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అంతేకాదు డిపోస్థాయిలో ఉన్న అధికారులు నిత్యం అద్దె బస్సు డ్రైవర్లపై నిఘా ఉంచడంతోపాటుగా  డ్రైవర్లంతా నిబంధనలు పాటిస్తున్నారా అనేది నిత్యం పరీక్షిస్తుండాలి. కానీ అధికారులు వాటినేమీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేయాలంటే కనీసం 18 నెలల అనుభవంతో కూడిన భారీవాహనం నడిపేందుకు లైసెన్సు కలిగి ఉండాలి. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి జోనల్‌ శిక్షణా కేంద్రానికి పంపి కనీసం 40 నుంచి 90 రోజులపాటు శిక్షణ అందిస్తారు. ఆ తర్వాత వాహనం నడపడంలో నైపుణ్యాన్ని అధికారులు పరీక్షించి అన్నీ సక్రమంగా ఉంటేనే విధుల్లోకి తీసుకుంటారు. అద్దె బస్సుల్లో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించాలంటే ఇవేమీ పట్టించుకోకుండానే వైద్య పరీక్షలు చేయించుకుని భారీ వాహనాలు నడిపే లైసెన్సు తీసుకుని 18 నెలలు దాటితే చాలు వారిని విధుల్లోకి తీసుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోవు. అయితే అద్దె బస్సుల డ్రైవర్లపై అధికారుల నిఘా కొరవడటంతో వారు ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతున్నారని తెలుస్తోంది. ఏకాగ్రతతో బస్సు నడిపాల్సిన సమయంలో దర్జాగా ఫోన్లు మాట్లాడుతూ నడుపుతున్నారు. దీనిపై కొన్నిచోట్ల ప్రయాణికులు ప్రశ్నిస్తుంటే.. డ్రైవర్లు దురుసుగా మాట్లాడుతున్నారన్న విమర్శలు లేకపోవు. 

ఇటీవల జరిగిన ప్రమాదాలు ఇలా...

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం కాలనీలో ఎదురుగా వస్తున్న అద్దె బస్సు ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గ్రాయాలయ్యాయి. 

ఖమ్మం నుంచి కోదాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు నేలకొండపల్లి సత్యసాయి మందిరం సమీపంలో మలుపు వద్ద అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. బస్సులో దాదాపు 40 మంది ప్రయా ణికులు ఉండగా.. ముందు సీట్లో కూర్చున్న ఓ చిన్నారికి గాయాలయ్యాయి. 

కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్‌రోడ్‌ వద్ద హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కంటెయినర్‌ను వెనుకనుంచి ఢీకొట్టడంతో బస్సులోని నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. 

ఖమ్మంరూరల్‌ మండలం గొల్లగూడెం వద్ద ద్విచక్రవాహనం పై వస్తున్న కానిస్టేబుల్‌ వీరబాబును వెనుకనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో .. ఆయనకు బ్రెయిన్‌ డెడ్‌ అయింది.

కొణిజర్ల మండల పరిధిలోని తనికెళ్ల వద్ద హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని తప్పించబోయి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. బస్సులో 30 ప్రయాణికులు ఉండగా.. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలవలేదు. 

Updated Date - 2021-09-16T05:29:02+05:30 IST