త్వరలో హైదరాబాద్‌కు ఆర్టీసీ సర్వీసులు

ABN , First Publish Date - 2020-06-06T09:01:54+05:30 IST

జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సు సర్వీసులు ఎప్పుడనే దానిపై ఉత్కంఠ వీడలేదు.

త్వరలో హైదరాబాద్‌కు ఆర్టీసీ సర్వీసులు

తెలంగాణ ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ కోసం ఎదురుచూపులు

భద్రాచలం సర్వీసులు ఇప్పట్లో లేనట్టే 

హైదరాబాద్‌ బస్సులు తిప్పడానికి సిద్ధంగా ఉన్నాం : ఆర్‌ఎం నాగేశ్వరరావు


రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 5: జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సు సర్వీసులు ఎప్పుడనే దానిపై ఉత్కంఠ వీడలేదు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే విషయంపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో ఈనెల 8వ తేదీ తర్వాత నుంచి ఎప్పు డైనా బస్సులు నడిపేందుకు గ్రీన్‌సిగ్నల్‌ రావచ్చనే అంచనాతో జిల్లా ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు వరకూ రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజూ ఐదు బస్సులు హైదరాబాద్‌కు నడిపేవారు. జిల్లా నుంచి సుమారు 100కు పైగా సర్వీసులు అప్‌/ డౌన్‌లో తిరిగేవి. తెలంగాణ ప్రభుత్వం నుంచి అను మతి రాగానే పూర్తిస్థాయిలో కాకపోయినా డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. కానీ రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడిపేందుకు ఇప్పటివరకూ తెలం గాణ ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదు.


ఇదిలా ఉంటే తెలంగాణలోని భద్రాచలం, కూనవరం, పరిసర ప్రాంతాలకు జిల్లా నుంచి రోజూ 25 వరకూ సర్వీసులు నడిచేవి. అయితే ప్రస్తుతం భద్రాచలం సర్వీసులపై అనిశ్చితి కొనసాగుతోంది. అంతరాష్ట్ర సర్వీసులు నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చినా తొలిదశలో హైదరాబాద్‌కు మాత్రమే బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. భద్రాచలం రూ టులో డిమాండ్‌ను బట్టి రెండవ దశలో బస్సులు నడిపే అవకాశాలున్నాయి. ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ నాగేశ్వరరావు దీనిపై మాట్లాడుతూ హైదరాబాద్‌కు బస్సులు నడిపే విషయంలో ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే హైదరాబాద్‌ సర్వీసులు పునఃప్రారంభిస్తామని తెలిపారు.

Updated Date - 2020-06-06T09:01:54+05:30 IST