హద్దులు దాటి..

ABN , First Publish Date - 2020-10-25T09:50:59+05:30 IST

ఆర్టీసీ షటిల్‌ బస్సుల నిర్ణయమేమో గానీ.. ప్రయాణికులు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారు. తెలంగాణ సరిహద్దు ..

హద్దులు దాటి..

జగ్గయ్యపేట, అక్టోబరు 24 : ఆర్టీసీ షటిల్‌ బస్సుల నిర్ణయమేమో గానీ.. ప్రయాణికులు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారు. తెలంగాణ సరిహద్దు వరకేనంటూ జగ్గయ్యపేట వరకు బస్సులు నడుపుతున్న ఆర్టీసీ ఆనక ప్రయాణికులు పడే పాట్ల గురించి మరిచిపోయింది. ఫలితంగా జగ్గయ్యపేట నుంచి తెలంగాణలోని కోదాడ వెళ్లి బస్సులు ఎక్కడానికి ప్రయాణికులు ఆటోలకు భారీగా ముట్టజెప్పాల్సి వస్తోంది. 20 కిలోమీటర్ల దూరానికి మనిషికి రూ.100 వరకు వసూలు చేస్తుండటంతో సరిహద్దు దాటడం తలకుమించిన భారంగా మారింది. 


రెండు తెలుగు  రాష్ట్రాలకు జగ్గయ్యపేట సరిహద్దు. ఇక్కడి నుంచి 15 కిలోమీటర్లు వెళ్తే.. తెలం గాణలోని సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్‌రోడ్డు వస్తుంది. దసరా పండగే కాదు.. నిత్యం రెండు రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. తాజాగా.. ఆర్టీసీ షటిల్‌ సర్వీసుల్లో భాగంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు జగ్గయ్యపేటలో దిగి కోదాడ వరకు ఆటోలో వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ మళ్లీ బస్సెక్కి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. అయితే, రెండు రాష్ట్రాల రవాణా సంస్థలు అటు కోదాడ వరకు, ఇటు జగ్గయ్యపేట వరకు బస్సులు ఇబ్బడి ముబ్బడిగా నడుపుతున్నాయి. కానీ, కోదాడ- జగ్గయ్య పేట మధ్య ఉన్న 20 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి సర్వీసులు నడవట్లేదు.  దీంతో ప్రయాణికులు అటు కోదాడ దిగి, ఇటు జగ్గయ్యపేట దిగి ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. 


గరికపాడు వరకు బస్సులు నడిపితే బెటర్‌

జగ్గయ్యపేట డిపోతో పాటు విజయవాడలోని పలు డిపోల నుంచి జగ్గయ్యపేట-విజయవాడ మధ్య 90కి పైగా బస్సులు నడుపుతున్నారు. ఈ బస్సులను రాష్ట్ర సరిహద్దు గరికపాడు వరకు తిరిగేందుకు అవకాశం ఉన్నా జగ్గయ్యపేట వద్దే ఆపేస్తున్నారు. ప్రయాణికులు లగేజీతో బస్సులు మారి అటు హైదరాబాద్‌ వెళ్లటం, ఇటు విజయవాడ రావటం ఇబ్బందిగా మారింది. విజయవాడ నుంచి జగ్గయ్యపేటకు 80 కిలోమీటర్ల దూరానికి పల్లె వెలుగు బస్సుచార్జి రూ.80 కాగా, జగ్గయ్యపేట నుంచి కోదాడ 20 కిలోమీటర్ల దూరానికి ఆటోవాలాలు మనిషికి రూ.80, రాత్రివేళ రూ.100 వసూలు చేస్తున్నారు. 


ఆటోలకు భారీగా డిమాండ్‌

కరోనా కారణంగా ఆటోలో ఇద్దరినే ఎక్కించుకోమని, మనిషికి రూ.50 వసూలు చేసుకునేందుకు అధికారులు అనుమతినిచ్చారు. దీంతో ప్రస్తుతం బస్సులు కూడా లేకపోవడంతో ఆటోలకు గిరాకీ పెరిగింది. రోజూ వందకు పైగా ఆటోలు కోదాడ-  జగ్గయ్యపేట మధ్య తిరుగుతున్నాయి. ఈ 20 కిలోమీటర్ల దూరానికి ఆటోవాలాలు మనిషికి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. పైగా  ఆటోలో 5 నుంచి 12 మంది వరకు కుక్కేస్తున్నారు.  భౌతిక దూరం సంగతి సరే.. లగేజీతో గాలి కూడా ఆడక అవస్థలు పడుతున్నారు.

Updated Date - 2020-10-25T09:50:59+05:30 IST