ఆర్టీసీ వారి డ్రైవింగ్‌ స్కూళ్లు

ABN , First Publish Date - 2020-07-14T08:57:26+05:30 IST

త్వరలో ఆర్టీసీ వారి డ్రైవింగ్‌ స్కూళ్లు అందుబాటులోకి రానున్నాయి. తేలికపాటి వాహనాలైన కా

ఆర్టీసీ వారి డ్రైవింగ్‌ స్కూళ్లు

  •  కార్లు, భారీ వాహనాల్లో డ్రైవింగ్‌ తర్ఫీదు
  • హైదరాబాద్‌, వరంగల్‌లో శిక్షణ కేంద్రాలు
  • ఒకే బ్యాచ్‌లో 20 వేల మందికి శిక్షణ!
  • ఆదాయం కోసం యాజమాన్యం కసరత్తు

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): త్వరలో ఆర్టీసీ వారి డ్రైవింగ్‌ స్కూళ్లు అందుబాటులోకి రానున్నాయి. తేలికపాటి వాహనాలైన కార్లు మొదలు.. భారీ వాహనాల దాకా.. ప్రైవేటు వ్యక్తులకు శిక్షణనిచ్చేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. నానాటికి నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్న సంస్థ.. కొత్త ఆదాయమార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సొంతంగా కార్గో, పార్శిల్‌ సేవలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఒకే బ్యాచ్‌లో ఏకంగా 20 వేల మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యంతో హైదరాబాద్‌లో రెండు, వరంగల్‌లో ఒకటి చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. దీనిపై ఆర్టీసీలోని పరిపాలన విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. నిజానికి ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు కరోనా లాక్‌డౌన్‌ మరింత దెబ్బ తీసింది. 50 రోజులకుపైగా బస్సులను మూలకు పెట్టాల్సి రావడంతో రూ.700 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోయింది. ప్రస్తుతం నడుస్తున్న బస్సులతో రూ.5 కోట్ల ఆదాయం అంచనా కాగా.. రూ.3 కోట్ల వరకే వస్తోంది. దీంతో ఆర్టీసీకి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించక తప్పడం లేదు. కొత్తగా మూడు డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలను ప్రారంభించి, ప్రైవేటు వ్యక్తులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ శిక్షణకు ఇంకా ఫీజును ఖరారు చేయాల్సి ఉంది. ఇతర జిల్లాల నుంచి వచ్చి శిక్షణ తీసుకునేవారికి హైదరాబాద్‌లో బోర్డింగ్‌ సౌకర్యం కూడా కల్పించే అవకాశాలున్నాయి. దీనికి అదనపు ఫీజు వసూలు చేస్తారు. 40 రోజుల శిక్షణలో 10 రోజులు థియరీ క్లాసులు, 30 రోజులు ప్రాక్టికల్‌(డ్రైవింగ్‌) క్లాసులుంటాయని అధికారులు వివరించారు.

Updated Date - 2020-07-14T08:57:26+05:30 IST