‘సజ్జల బెదిరించి ఉంటారు.. అందుకే ఆగిపోయారు!’

ABN , First Publish Date - 2021-08-23T06:13:14+05:30 IST

‘సజ్జల బెదిరించి ఉంటారు.. అందుకే ఆగిపోయారు!’

‘సజ్జల బెదిరించి ఉంటారు.. అందుకే ఆగిపోయారు!’

పెదవి విప్పరేం?

విలీనానంతర సమస్యలపై విఫలమైన ఐక్య కార్యాచరణ 

సజ్జల జోక్యంతో ఉద్యోగ సంఘాల్లో మౌనం 

ప్రభుత్వ ఉన్నతాధికారుల హామీలపై అస్పష్టత 

ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ప్రజా రవాణా సంస్థలో విలీనానంతర సమస్యలపై ఉద్యమ శంఖం పూరించేందుకు ఐక్యంగా కదిలిన ఉద్యోగ సంఘాలు మౌనం దాల్చాయెందుకు? ఉన్నతాధికారులు నిర్వహించిన సమావేశం వివరాలను వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారెందుకు? కలిసి పోరుబాటలో సాగాల్సిన ఉద్యోగ సంఘాలు తిరిగి వేరు కుంపట్లు పెట్టడం వెనక ఉన్న కారణాలేమిటి? విజయవాడ జోన్‌లోని ఆర్టీసీ ఉద్యోగులను కలవరపెడుతున్న సందేహాలివి. 


విలీనానంతర సమస్యలపై ఐక్య పోరాటాలకు సిద్ధమైన ఉద్యోగ సంఘాలు ఎవరి దారి వారు చూసుకోవడంతో విజయవాడ జోన్‌లోని ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర అయోమయం నెలకొంటోంది. విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో రహస్యంగా సమావేశమైన ఆయా సంఘాల నేతలు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరించటం, ఇటీవల ప్రభుత్వ అధికారులు జరిపిన చర్చల్లో హామీలపై ఎవరూ పెదవి విప్పకపోవటం ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆర్టీసీ ఈయూ, ఎన్‌ఎంయూ వంటి సంఘాలు తాము ఆధికారులను కలిసిన విషయాన్ని బహిర్గత పరిచారే తప్ప.. ఉన్నతాధికారుల హామీలపై స్పష్టతనివ్వడం లేదు. ఇది కూడా ఉద్యోగుల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 


సజ్జల ఏమన్నారు?

రహస్య సమావేశం అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈయూ, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజులను పిలిచి మాట్లాడారు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలు ఉద్యోగుల్లో అనేక సందేహాలకు తావిచ్చాయి. సజ్జల బెదిరించి ఉంటారని, అందుకే ఉద్యమం ఆగిపోయిందన్న చర్చ కూడా నడుస్తోంది. ఏమి జరిగిందన్న దానిపై ఈ రెండు సంఘాలూ స్పష్టతనివ్వాల్సి ఉంది. 


అపరిష్కృత సమస్యలెన్నో

ఆర్టీసీలో పని చేస్తున్నా, ప్రజా రవాణా సంస్థ (పీటీడీ)లో విలీనం అయిన తర్వాత అనేక సమస్యలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. జీవో నెంబర్‌ 12, 25లతో ఇచ్చిన సర్వీస్‌ సబార్డినేట్‌ రూల్స్‌ ఉద్యోగుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రమోషన్లలో జరిగే నష్టాన్ని పరిశీలించి న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఆర్టీసీలో డిసెంబర్‌ 31, 2019 నాటికి రిక్రూట్‌మెంట్‌ రెగ్యులేషన్‌ ప్రకారం నియమించిన ఉద్యోగుల పదోన్నతుల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగులందరికీ పాత పెన్షన్‌ స్కీమ్‌ను వర్తింప చేయాలని కోరుతున్నారు. ఏప్రిల్‌ 1, 2017లో వేతన సవరణకు సంబంధించిన 25 శాతం తాత్కాలిక ఫిట్‌మెంట్‌ బకాయిలను చెల్లించాలని, 2017 నుంచి 2021 వరకు  లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ విడుదల చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు తమ సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్న ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ సంస్థలను తిరిగి పునరుద్ధరించాలని, ప్రభుత్వంలోకి విలీనం చేసిన అనంతరం అమలు చేస్తున్న హెల్త్‌ స్కీమ్‌ కాకుండా, ఆర్టీసీలో ఉన్నపుడు కల్పించిన అన్‌లిమిటెడ్‌ వైద్య సేవలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.


అన్ని అర్హతలతో సెలక్షన్‌ కమిటీ ద్వారా ఎంపికై రెగ్యులేషన్‌ 30లో పదోన్నతులు పొంది అనేక ఏళ్లుగా అందులోనే కొనసాగుతున్న వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. జనవరి 1, 2020 నుంచి మరణించిన, లేదా ఇతర కారణాలతో ఉద్యోగాన్ని వదిలేసుకున్నవారికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ, టెర్మినల్‌ లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, చివరి నెల వేతనం, ఈడీఎల్‌ఎఫ్‌ చెల్లించి, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇండియన్‌ రైల్వేస్‌లో మాదిరిగా కార్మిక చట్టాలను అమలు చేయాలన్నది కార్మికుల, కార్మిక సంఘాల వాదన. ఇలాంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని కార్మిక సంఘాలన్నీ భావించాయి. ఇందుకోసం ఐక్య కార్యాచరణ దిశగా అడుగులు పడుతున్న సమయంలోనే, ప్రభుత్వ సలహాదారు సజ్జల జోక్యం చేసుకున్నారు. ఆ తర్వాత అంతా సద్దు మణిగిపోయింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలపై కూడా స్పష్టత లేదు. ఈ పరిణామాలతో విజయవాడ జోన్‌ పరిధిలోని వేలాది మంది కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు.


సజ్జల ఏమన్నారు?

రహస్య సమావేశం అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈయూ, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజులను పిలిచి మాట్లాడారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఉద్యోగుల్లో అనేక సందేహాలకు తావిచ్చాయి. సజ్జల బెదిరించి ఉంటారని, అందుకే ఉద్యమం ఆగిపోయిందన్న చర్చ కూడా నడుస్తోంది. ఏమి జరిగిందన్న దానిపై ఈ రెండు సంఘాలూ స్పష్టతనివ్వాస్సి ఉంది.

Updated Date - 2021-08-23T06:13:14+05:30 IST