Abn logo
Mar 28 2020 @ 03:20AM

ఆర్టీజీఎస్‌కు ఎందుకు నో!

  • కీలక వ్యవస్థను వాడుకోని రాష్ట్రం
  • కరోనాపై యుద్ధానికి చక్కటి కేంద్రం
  • సమగ్ర పర్యవేక్షణకు అవకాశం
  • ఏకీకృత సమన్వయానికీ వీలు
  • అయినా... ఎందుకో నిర్లక్ష్యం!
  • దానిని వార్‌రూమ్‌గా మార్చాలి


(అమరావతి  - ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం బీచ్‌ రోడ్‌లో ఫలానా నంబరు వీధి లైటు వెలగడం లేదు! విజయవాడ పున్నమి ఘాట్‌లో చెత్త భారీగా పేరుకుపోయింది. కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్‌లో ద్విచక్ర వాహన దారుడు పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడు. 


...ఇలాంటివెన్నెన్నో! జరిగింది జరిగినట్లు అప్పటికప్పుడు తెలుసుకునే వ్యవస్థ... రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సిస్టమ్‌ (ఆర్టీజీఎస్‌)! రాష్ట్రవ్యాప్తంగా సూక్ష్మస్థాయిలో జరుగుతున్న అంశాలన్నింటినీ సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ నుంచే పర్యవేక్షించేందుకు అవకాశముంది. కరోనాపై కట్టడికి ఈ వ్యవస్థను ఉపయోగించుకోగలిగితే... చర్యల్లో వేగం పెరుగుతుందని, మెరుగైన ఫలితాలనూ సాధించవచ్చుననీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దురదృష్టవశాత్తూ... ఇంతటి కీలకమైన ఆర్టీజీఎస్‌ను కేవలం వెనక ఉండి అందించే సేవలకే పరిమితం చేశారు. అలాకాకుండా దాని సేవలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని, వివిధ శాఖల అధికారుల సమన్వయ సమావేశాలకు కేంద్రంగా మార్చితే బాగుంటుందని అధికారులు చెబుతున్నారు.


ఇదీ దాని సత్తా... 

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతోందో కళ్లకు కట్టినట్లు చూపించే వ్యవస్థ ఆర్టీజీఎస్‌. నగరాలు, పట్టణాల్లో చీమ చిటుక్కుమన్నా చెప్పే ఏర్పాట్లున్నాయి. సచివాలయంలో కూర్చుంటే చాలు... క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుస్తుంది. దానికి అనుగుణంగా అవసరమైన ఆదేశాలు, సూచనలు ఇవ్చొచ్చు. పరిస్థితిని చక్కదిద్దొచ్చు. ప్రజలకు, యంత్రాంగానికి శ్రమలేకుండా స్మార్ట్‌గా వ్యవహారం నడిపించవచ్చు. విపత్తుల సమయంలో ఆర్టీజీ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. శ్రీకాకుళం జిల్లాలో తితలీ తుఫాను సమయంలో అవసరమైన సూచనలన్నీ ఇక్కడి నుంచే వెళ్లాయి. కృష్ణా పుష్కరాల సమయంలో పారిశుధ్య నిర్వహణ, క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌, ఇతర పనుల సమన్వయానికీ ఆర్టీజీఎ్‌సను పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నారు. చివరికి... మరుగుదొడ్ల పరిశుభ్రతను కూడా సచివాలయంలో కూర్చుని తెలుసుకోగలిగారు.


కరోనాపై ‘వార్‌’కూ... 

లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడానికి యంత్రాంగం నానా ఇబ్బందులు పడుతోంది. అన్నింటికీ మించి కేంద్రీకృత సమన్వయం కరువైంది. ఈ సమస్యలకు ఆర్టీజీఎస్‌ చక్కటి పరిష్కారం చూపిస్తుంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి వందల మంది సరిహద్దులకు వచ్చారు. తిండి, నిద్ర, మంచినీళ్లు లేకుండా 8గంటలు గడిపారు. ముఖ్యమంత్రికి సమాచారం చేరడానికి అన్ని గంటలు పట్టింది. ఆయన తెలంగాణ సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడానికి మరికొన్ని గంటలు పట్టింది. అదే ఆర్టీజీఎ్‌సను ఉపయోగించుకుంటే ఇంత గందరగోళం ఉండేదే కాదు. చెక్‌పోస్టు, టోల్‌గేట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నీ ఆర్టీజీఎ్‌సకు అనుసంధానం చేసుకోవచ్చు. పెద్దసంఖ్యలో ప్రజలు వస్తున్న విషయాన్ని పసిగట్టి... క్షణాల మీద తగిన ఆదేశాలు జారీ  చేసే అవకాశం ఉండేది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు బయటికి రాకుండా ఆర్టీజీఎ్‌సకు అనుసంధానంగా ఉన్న కెమెరాల నుంచి నిఘా వేయవచ్చు.  ప్రజలు నియంత్రణతోనే ఉంటున్నా... రైతుబజార్లలో గుంపులుగా చేరుతున్నారు. అన్నిచోట్లా పోలీసులు ఉండి నియంత్రించే పరిస్థితి లేదు. రైతుబజార్లలో సీసీ కెమెరాలను ఆర్టీజీఎ్‌సతో అనుసంధానించి పరిశీలించి...ఎక్కడా గుంపులు గుంపులుగా కలవకుండా సూచనలివ్వొచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీజీఎ్‌సను సమర్థంగా ఉపయోగించుకోవాలని, కరోనా కట్టడికి ఈ కేంద్రాన్ని ‘వార్‌ రూమ్‌’గా ఉపయోగించుకుంటే బాగుంటుందని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement