సమాచార హక్కు ఎత్తేసినట్లే?

ABN , First Publish Date - 2021-10-24T08:07:43+05:30 IST

ఇప్పటిదాకా ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి విషయాలను అడిగి తెలుసుకోవడం సాధ్యమయ్యేది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఓ దరఖాస్తు చేస్తే.. సమాచారం వచ్చేది.

సమాచార హక్కు ఎత్తేసినట్లే?

ప్రభుత్వ శాఖల్లో వివరాలన్నీ రహస్యం..

రాష్ట్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వు ఫలితం

చిన్నపాటి సమాచారమూ ఇక గగనమే 

ప్రభుత్వ ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధం  

సహ కార్యకర్తలు, పౌర సంఘాల ఆగ్రహం 

సమాచార కమిషన్‌ ఉనికే ప్రశ్నార్థకం


గ్రామానికి వచ్చిన నిధులెన్ని? వాటిని ఎక్కడ, ఎంత ఖర్చు చేశారు? భూములను ధరణిలో చూపించట్లేదు. కారణమేంటి? బాధ్యులెవరు? రేషన్‌ కార్డులు, పింఛన్ల మంజూరు, డబుల్‌ బెడ్‌రూం అర్హుల ఎంపికలో అవకతవకలు జరిగాయి, లబ్ధిదారుల జాబితా ఇవ్వండి! ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో తెలపండి? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదేంటి? ఉపకారవేతనాలు ఎందుకు కేటాయించలేదు? కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారుల వివరాలివ్వండి! ఉపాధి హామీ పనులు, కూలీల వివరాలివ్వండి!

ఇప్పటిదాకా ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి విషయాలను అడిగి తెలుసుకోవడం సాధ్యమయ్యేది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఓ దరఖాస్తు చేస్తే.. సమాచారం వచ్చేది. ఈ చట్టం సాయంతో అనేక సంక్షేమ పథకాల్లో జరిగిన అక్రమాలను అనేకమంది సామాన్యులు వెలికితీశారు. అర్హులైన తమను కాదని అవినీతి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అనర్హులకు కేటాయించారంటూ చాలా మంది గళమెత్తి న్యాయం పొందారు. అభివృద్ధి పనులకు మంజూరైన నిధులను పైసా ఖర్చు చేయకుండానే స్వాహా చేసిన ఉదంతాలు రాష్ట్రంలో కోకొల్లలుగా సమాచార హక్కు చట్టంతో బయటపడ్డాయి. రహదారులు, ప్రాజెక్టులు, పారిశ్రామిక వాడలకు భూసేకరణలో చెల్లించిన నష్ట పరిహారంలో భారీ అక్రమాలు వెలుగు చూశాయంటే ఈ చట్టమే కారణం. వేల కోట్ల ప్రజాధనంతో చేపడుతున్న భారీ ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవకతవకలు, కుంభకోణాలు ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంతోనే బట్టబయలు అవుతున్నాయి.


ఇలా పాలనలో పారదర్శకత, ప్రజాస్వామ్యంలో పౌరుల భాగస్వామ్యం పెరుగుతున్న క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ముందుగా అనుమతి తీసుకోకుండా ఆర్టీఐ దరఖాస్తులకు సమాచారం ఇవ్వడానికి వీల్లేదం టూ ఇటీవలే జీవో ఇచ్చింది. పాలకుల నిర్లక్ష్యంతో గత ఏడేళ్లుగా రాష్ట్రంలో అంతంత మాత్రంగా అమల్లో ఉన్న సమాచార హక్కు చట్టం ప్రభుత్వ తాజా నిర్ణయంతో పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తోంది.


సమాచార యుగంలో అనాగరిక చర్య 

పాలనలో పూర్తి పారదర్శకతను పాటిస్తున్నామంటూ ప్రభుత్వం చెప్పే మాటలకు చేతలకు అసలు ఏ మాత్రం పొంతన లేదన్న విషయం ప్రభుత్వ తాజా నిర్ణయంతో బట్టబయలై పోయింది. ప్రజల పన్నులతో ప్రభుత్వ కొనసాగుతోంది. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజలను ప్రభువులుగా, పాలకులు, అధికారులను సేవకులుగా పేర్కొంటారు. తమ పన్నులతో కొనసాగే ప్రభుత్వంలో ప్రతీది తెలుసుకునే హక్కు ప్రజలకుంది. రాజ్యాంగం సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. సమాచారం హక్కుగా ఉండాలన్న పౌర సమాజం దశాబ్దాల పోరాటం ఫలితంగా 2005లో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఈ చట్టం సాయంతో పౌరులు అనేక గణనీయమైన విజయాలు సాధించారు. భారీ అవినీతిని, కుంభకోణాలను బయటపెట్టారు. సుపరిపాలన, పారదర్శకతకు సహకరిస్తున్న ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు.. చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్నాయి.


రెండేళ్ల క్రితం ఈ చట్టాన్ని బలహీన పరిచేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో సవరణలు చేసింది. దీనికి తమ మద్దతు ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా చట్టాన్ని నిర్వీర్యం చేసే ఉత్తర్వులను విడుదల చేసింది.దీని ప్రకారం గ్రామస్థాయిలో ప్రభుత్వ కార్యాలయంలో ఏ చిన్న సమాచారం కోసం ఆర్టీఐ దరఖాస్తు చేసినా.. రాష్ట్రస్థాయి అధికారుల అనుమతి లేకుండా సమాచారం ఇవ్వడానికి వీల్లేదు. మండలం నుంచి జిల్లా కలెక్టరేట్‌కి వెళ్లిన దరఖాస్తులకు మోక్షం దక్కాలంటే.. నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఈ తరుణంలో రాష్ట్ర స్థాయిలో అనుమతి రావడం జరిగే పని కాదు. ప్రస్తుత సమాచార యుగంలో ప్రభుత్వ నిర్ణయం రాతియుగం నాటి అనాగరిక చర్యలను గుర్తుకు తెస్తోంది. 


ప్రాథమిక హక్కు ఉల్లంఘనే

రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసిన ఉత్తర్వు చట్ట వ్యతిరేకమే కాకుండా రాజ్యాంగం ప్రసాదించిన పౌరుల ప్రాథమిక హక్కుకూ విఘాతం కల్పించడమే అని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. సమాచారం పొందడం ప్రజల హక్కు అని ఆర్టీఐ చట్టం పేర్కొంటుండగా.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 9(1)(ఏ) ప్రసాదించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ సైతం సమాచారం పొందే స్వేచ్ఛనే తెలియజేస్తుందని సుప్రీంకోర్టు పలుమార్లు వెలువరించిన తీర్పుల్లో స్పష్టం చేసింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు పౌరుల ప్రాథమిక హక్కునూ హరించేలా ఉన్నాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.


ఇక నేతలు, అధికారుల ఇష్టారాజ్యం 

రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులతో ప్రభుత్వ పాలన మరింత అవినీతిమయంగా మారే ప్రమాదముంది. సమాచార హక్కు చట్టం 2005లో రాకమునుపు 1923లో రూపొందించిన బ్రిటీషు కాలంనాటి అధికారిక రహస్యాల చట్టం అమల్లో ఉండేది. దీనిప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు తమ వద్ద ఉన్న ఎలాంటి సమాచారం ఇవ్వడానికి వీల్లేదు. ఆర్టీఐ చట్టం రాకతో ప్రజలు ప్రశ్నిస్తున్నందున అధికారుల్లో భయం పెరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఆర్టీఐతో ప్రజలు తెలుసుకునే అవకాశం ఉండటంతో ప్రభుత్వంలోనూ జవాబుదారీతనం పెరిగింది. ఇదంతా ఆర్టీఐ చట్టం సాధించిన అసాధారణ విజయాలు. కానీ.. గత ఏడేళ్లుగా చట్టాన్ని బలహీనపరిచేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. 2014లో రాష్ట్రం ఆవిర్భవిస్తే.. 2017 వరకు సమాచార కమిషన్‌నే ఏర్పాటు చేయలేదంటే ఆర్టీఐపై ప్రభుత్వ చిత్తశుద్ధి అర్ధం చేసుకోవచ్చు.


ఆర్టీఐ దరఖాస్తులకు స్పందించకూడదంటూ గతంలోనే ప్రభుత్వం ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.దీంతో గరిష్ఠంగా 30 రోజుల్లో అందించాల్సిన సమాచారం కోసం పౌరులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్రజాసమాచార అధికారుల(పీఐవో) వద్ద  దాదాపు 2.60 లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నట్టు అంచనా. అలాగే మొదటి అప్పీలేట్‌ అథారిటీ వద్ద 80 వేలకు పైగా దరఖాస్తులు పెండింగులో ఉండగా.. రెండో అప్పీలేట్‌ అథారిటీ అయిన రాష్ట్ర సమాచార కమిషన్‌లో 10 వేలకు పైగా దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. చట్టం అమలు ఇప్పటికే అంతంతమాత్రంగా ఉండటంతో.. ప్రభుత్వ తాజా ఆదేశాల నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారనుంది. అధికారుల ఇష్టారాజ్య పాలనకు దారితీసే అవకాశాలున్నాయి. అర్హత ప్రకారం కాకుండా ప్రజాప్రతినిధులు, నేతలు చెప్పిన వారికే రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు కేటాయించే పరిస్థితులు ఉంటాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయు. దీన్నే అధికారులు అవకాశంగా తీసుకుని అవినీతికి పాల్పడే అవకాశాలూ ఉన్నాయి.


అవినీతికి ఆధారాలు దొరుకుతున్నాయనేనా? 

వివిధ రాష్ట్రాలు ఆర్టీఐను మరింత బలోపేతం చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వ తిరోగమన చర్య వెనక ప్రధాన కారణం ఇటీవలే వెలుగులోకి వచ్చిన పలు అవినీతి సంఘటనలే అని తెలిసింది. ఆదాయం సమకూర్చుకునేందుకు గతనెలలో ప్రభుత్వం ఖానామెట్‌, పుప్పాలగూడలోని 116 ఎకరాల ప్రభుత్వ భూములను వేలం వేయాలని నిర్ణయించింది. దీనిద్వారా రూ.10వేల కోట్లను ఆర్జించాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే ప్రభుత్వం వేలానికి పెట్టిన భూములు తమవంటూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వాయిదా వేయాల్సి వచ్చింది. కోర్టుకు వెళ్లిన హక్కుదారులు రెవెన్యూ శాఖ వద్ద ఉన్న పాత రికార్డులను ఆర్టీఐ దరఖాస్తుల ద్వారా సేకరించారు. అనేకచోట్ల డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం పెరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ప్రభుత్వం కేటాయించిన రేషన్‌ కార్డులు, ఆసరా పింఛన్లలో అనర్హులు ఉన్నారంటూ పౌరులు ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి బట్టబయలు చేస్తున్నారు.


ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించి అమలుచేస్తున్న దళితబంధు పథకంలో లబ్ధిదారుల ఎంపిక విధానాన్ని తెలుపాలంటూ ఇప్పటికే అనేక మంది ఆర్టీఐ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. ఈ చట్టం ప్రకారం అందిన దరఖాస్తులకు అధికారులు సమాచారం ధ్రువీకరించుకుని అందిస్తారు. ఇచ్చిన ప్రభుత్వ అధికారి పేరు, హోదాతో పాటు కార్యాలయ అధికారిక స్టాంపు కూడా దీనిపై ఉంటుంది. వీటిని న్యాయస్థానాలు కూడా గుర్తిస్తున్నందున.. పౌరులు ఆర్టీఐ ద్వారా అధికారికంగా సమాచారం పొందే వీలుంది. ఈ పరిణామాలన్నీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కిందిస్థాయి అధికారులు సమాచారం ఇవ్వకుండా ఉత్తర్వులను జారీచేసిందని తెలుస్తోంది. 




మనకంటే బిహార్‌ నయం 


అభివృద్ధిలో దేశానికే ఆదర్శమంటూ ప్రతిరోజు ఢంకా బజాయిస్తున్న ప్రభుత్వం.. సమాచార హక్కు చట్టం అమల్లో మాత్రం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అట్టడుగు స్థానంలో ఉంది. సమాచార హక్కు చట్టాన్ని పౌరులకు  మరింత చేరువగా చేసేందుకు అనేక రాష్ట్రాలు రాష్ట్ర కమిషన్ల శాఖలను ఇతర నగరాల్లోనూ విస్తరిస్తున్నారు. మహారాష్ట్ర సమాచార కమిషన్‌ 8 చోట్ల శాఖలను ఏర్పాటుచేసింది. తెలంగాణలో 33 జిల్లాల ప్రజలకు ఒకే కమిషన్‌ హైదరాబాద్‌లో ఉంది. సమాచారం కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అసవరం లేకుండా.. ఆన్‌లైన్లో దరఖాస్తు చేసేందుకు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కమిషన్లు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాయి. కమిషన్‌కు సైతం ఆన్‌లైన్లోనే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ.. తెలంగాణలో కమిషన్‌కు ఫిర్యాదు చేయాలంటే.. దరఖాస్తుదారు స్వయంగా హైదరాబాద్‌ మోజంజాహి మార్కెట్‌ వద్ద ఉన్న కమిషన్‌ కార్యాలయానికి స్వయంగా రావాల్సిందే. కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదులను గరిష్ఠంగా 3 నెలల్లోపు పరిష్కరిస్తూ బిహార్‌ సహ కమిషన్‌ ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తోంది.




ఆర్టీఐ కమిషన్‌ ఉన్నా లేనట్టే


రాష్ట్రంలో ఆర్టీఐ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన కీలక బాధ్యత రాష్ట్ర సమాచార కమిషన్‌దే. కోరిన సమాచారం గరిష్ఠంగా 30 రోజుల్లో ఇవ్వాల్సి ఉండగా.. ఆర్టీఐ దరఖాస్తు పెట్టి నాలుగైదేళ్లు దాటినా సమాచారం ఇవ్వని ఉదాహరణలు రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్నాయి. అధికారుల తీరుపై ప్రజలు చివరి ప్రయత్నంగా సమాచార కమిషన్‌ను ఆశ్రయిస్తే ఇక్కడా నిరాశే ఎదురవుతుంది. రాష్ట్రంలో సెప్టెంబరు-2017లో సమాచార కమిషన్‌ ఏర్పడగా.. ప్రస్తుతం కమిషన్‌ ముందు 10 వేలకు పైగా కేసులు పెండింగులో ఉన్నాయి. ఇందులో నాలుగేళ్ల క్రితం నాటి కేసులూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం సమాచార కమిషన్‌లో ఆరుగురు కమిషనర్లు ఉన్నారు. పేరుకు కమిషన్‌ ఉన్నట్టే కానీ.. 2017 నుంచి ఇప్పటివరకు చట్టం అమలుపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో ఇంత వరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదంటే కమిషన్‌ చిత్తశుద్ధిని అంచనా వేయవచ్చు. సెక్షన్‌ 4(1)(బి) ప్రకారం ప్రతీ ప్రభుత్వ శాఖ తమ పరిధిలోని సమాచారంతోపాటు ఉద్యోగుల జీతభత్యాలు ఎప్పటికప్పుడు స్వచ్ఛందంగా అధికారిక వెబ్‌సైట్లో ఉంచాలి. సెక్షన్‌ 25(1) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్‌ ఏటా వార్షిక నివేదికను వెల్లడించాలి. మొత్తం అందిన దరఖాస్తులు, పరిష్కరించినవి, పెండింగులో ఉన్నవి, తిరస్కరించినవాటి వివరాలను విధిగా వెల్లడించాల్సి ఉంది. అన్ని రాష్ట్రాల కమిషన్లు ఏటా విధిగా వెల్లడిస్తుండగా.. తెలంగాణలో మాత్రం కమిషన్‌ ఏర్పాటైనప్పటి నుంచి ఇంతవరకు వార్షిక నివేదిక వెల్లడించలేదు.




ప్రభుత్వానికి సవరణ అధికారం లేదు 


కొందరు ప్రజా సమాచార అధికారులు దరఖాస్తులను పరిశీలించకుండా ఆషామాషీగా సమాచారం ఇస్తున్నారన్న కుంటిసాకుతో ప్రధాన కార్యదర్శి ఆదేశాలు విడుదల చేయడం హాస్యాస్పదం. సుపరిపాలనకు దోహదపడుతున్న ఆర్టీఐ చట్టాన్ని నిర్వీర్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. పార్లమెంటు రూపొందించిన చట్టానికి సవరణలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదన్న కనీస పరిజ్ఞానం కూడా లేకపోవడం అత్యంత దురదృష్టకరం. చట్టంపై ఏ మాత్రం అవగాహన లేకుండా ప్రభుత్వ ఆదేశాలను విడుదల చేసింది. ఈ ఆదేశాలు అమలైతే ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం లోపిస్తుంది. అవినీతి మరింత విజృంభిస్తుంది. ఈ ఆదేశాలను వెంటనే రద్దు చేయాలి.  


ఎం.పద్మనాభరెడ్డి, కార్యదర్శి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

Updated Date - 2021-10-24T08:07:43+05:30 IST