కనికరమేదీ?

ABN , First Publish Date - 2020-11-29T06:55:40+05:30 IST

కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో సేవలందించినా అధికారులు కరికరం చూపట్లేదు. కరోనా బారిన పడిన బాధి తులను ఆస్పత్రికి తరలించటం, కోలుకున్న వారిని ఇంటికి చేర్చటంలో వారం తా విశేష సేవలు అందించారు.

కనికరమేదీ?

పెండింగ్‌లో అద్దె వాహనాల బిల్లులు

కరోనా కష్టకాలంలో 108 ప్రైవేట్‌ వాహనాల ఏర్పాటు

కష్టకాలంలో బాధితులకు సేవలు

నేటికీ యజమానులకు బకాయిలు చెల్లించని దుస్థితి

అనంతపురం వ్యవసాయం, నవంబరు 28: కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో సేవలందించినా అధికారులు కరికరం చూపట్లేదు. కరోనా బారిన పడిన బాధి తులను ఆస్పత్రికి తరలించటం, కోలుకున్న వారిని ఇంటికి చేర్చటంలో వారం తా విశేష సేవలు అందించారు. కరోనా విలయతాండవం చేసే సమయంలో కొందరు ప్రైవేట్‌ వాహన యజమానులు అడిగిందే తడువుగా వాహనాలు అద్దెకు పెట్టారు. కొందరు డ్రైవర్లు వాహనాలు నడిపేందుకు భయపడినా.. వారికి నచ్చజెప్పి అద్దె వాహనాల ద్వారా కరోనా బాధితులకు సేవలు అందించారు. విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించిన వాహన యజమానులకు చెల్లించాల్సిన అద్దె డబ్బు ఇవ్వకుండా సంబంఽధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో తరచూ ఆర్టీఏ కార్యాలయం చుట్టూ వాహన యజమాను లు ప్రదక్షిణలు చేస్తున్నారు.


కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో వాహనాల వినియోగం  

జిల్లాలో కరోనా విజృంభించిన సమయంలో బాధితులను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించేందుకు అంబులెన్స్‌లు సరిపోకపోవటంతో ప్రైవేట్‌ వాహనాలను అద్దెకు తీసుకున్నారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో కరోనా బాధితులను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించటం, కోలుకున్న వారిని ఇంటికి చేర్చేం దుకు అద్దె వాహనాలను వినియోగించారు. క్షేత్రస్థాయిలో కరోనా పరీక్షలు, చికిత్సలు చేసేందుకు ఇదే వాహనాలను ఉపయోగించారు. జిల్లావ్యాప్తంగా 108 ప్రైవేట్‌ వాహనాలను ఆర్టీఓ యంత్రాంగం ద్వారా వైద్య, ఆరోగ్య శాఖకు అద్దెకు పెట్టారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.45వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ లెక్కన మూడు నెలలకు ఒక్కో వాహనానికి రూ.1.35 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. 

   108 వాహనాలకు నెలకు రూ.48.60 లక్షలు, మూడు నెలలకు రూ.1.45 కోట్ల అద్దె డబ్బు చెల్లించాల్సి ఉంది. కొంతమంది ప్రైవేట్‌ వాహన యజమానులు అద్దెకు వాహనాలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మూడు నెలల బకాయిలు పెండింగ్‌లో ఉంచడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వెంటనే బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.


వైద్య, ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లాం

కొవిడ్‌ సమయంలో ప్రైవేట్‌ వాహనాలను అద్దెకు సమకూర్చి, వైద్య, ఆరోగ్య శాఖకు అప్పగించాం. వాహనదారులకు అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని కార్యాలయానికి వస్తున్నారు. వాహన యజమానుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఇదివరకే తెలియజేశాం. మరోమారు జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లి, అద్దె బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. 

- శివరాంప్రసాద్‌, డీటీసీ

Updated Date - 2020-11-29T06:55:40+05:30 IST