ఇంటి వద్దే ర్యాపిడ్‌ టెస్ట్‌

ABN , First Publish Date - 2022-01-28T16:58:21+05:30 IST

నగరంలో ఒమైక్రాన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటి వద్దే ర్యాపిడ్‌ యాంటీజన్‌ పరీక్షలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది.

ఇంటి వద్దే ర్యాపిడ్‌ టెస్ట్‌

ఆశా వర్కర్లకు కొవిడ్‌ పరీక్ష కిట్లు

లక్షణాలు ఉండి నెగెటివ్‌ వస్తే ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌

అంగన్‌వాడీ కేంద్రాల వద్ద వ్యాక్సినేషన్‌


హైదరాబాద్‌ సిటీ: నగరంలో ఒమైక్రాన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటి వద్దే ర్యాపిడ్‌ యాంటీజన్‌ పరీక్షలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. నగరంలో ప్రతి ఇంట్లో దాదాపు ఒకరిద్దరు కొవిడ్‌ లక్షణాలతో జ్వరం, దగ్గు బారిన పడి అస్వస్థతకు గురవుతున్నారు. కొవిడ్‌ పరీక్షల కోసం టెస్టింగ్‌ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తుండడంతో ఉసూరుమంటున్నారు. లక్షణాలున్న వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడే ర్యాపిడ్‌ యాంటీజన్‌ పరీక్షలను రెండు రోజులుగా వైద్యశాఖ నిర్వహిస్తోంది.  


ఫీవర్‌ సర్వేతో పాటు..

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 881ఆశా బృందాల సభ్యులు ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నారు. రోజూ 50వేల ఇళ్లను సందర్శిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం వంటి కొవిడ్‌ లక్షణాలతోపాటు మలేరియా, డెంగీ, ఇతర జబ్బులు వంటి విషయాలను సర్వేలో సేకరిస్తున్నారు. వారిలో ఎవరికైనా లక్షణాలు తీవ్రంగా ఉంటే అక్కడికక్కడే నమూనాలు సేకరించి ర్యాపిడ్‌ యాంటీజన్‌ పరీక్షలు నిర్వహించే బాధ్యతను ఆశా వర్కర్లకు అప్పగించారు. ర్యాపిడ్‌లో నెగెటివ్‌ వచ్చి లక్షణాలు తీవ్రంగా ఉంటే వారిని సమీప టెస్టింగ్‌ కేంద్రానికి పంపించి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయిస్తున్నారు.  


ఇంటి సమీపంలోనే వ్యాక్సినేషన్లు

నగరంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌లో ఇప్పటికే మొదటి డోసు వందశాతం పూర్తికాగా, రెండోడోసు 80శాతం దాటింది. ఇప్పుడు బూస్టర్‌ డోసు, టీనేజర్లకు టీకాలు వేస్తున్నారు. కేవలం ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితమైన టీకా కార్యక్రమం ఇప్పుడు నేరుగా ఇళ్ల వద్దే చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఎవరైనా పది నుంచి ఇరవై మంది వరకు ఉంటే అక్కడికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లి టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, అపార్ట్‌మెంట్ల వద్ద కూడా రెండో డోసు, బూస్టర్‌ డోసు, టీనేజర్లకు టీకాలు వేయనున్నారు. 


సేవలను విస్తరిస్తున్నాం..

అస్వస్థతతో ఉండేవారిని గుర్తించే పని వేగంగా కొనసాగుతోంది. కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారికి ఇంటి వద్దనే ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించాలని ఆశా వర్కర్లను ఆదేశించాం. నమూనాలు ఎలా సేకరించాలో అవగాహన కల్పించి పరీక్ష కిట్లను వారికి అందజేశాం. అనుమానితులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే మందుల కిట్లను పంపిణీ చేస్తున్నాం. ఇంతవరకు రెండో డోసు టీకా  తీసుకోని వారిని గుర్తిస్తున్నాం. వారి వద్దకే సిబ్బందిని పంపించి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 

- డాక్టర్‌ వెంకటి, డీఎంఅండ్‌హెచ్‌ఓ 

Updated Date - 2022-01-28T16:58:21+05:30 IST