సంక్షోభంలో ఆర్టీపీపీ

ABN , First Publish Date - 2021-10-13T05:26:45+05:30 IST

రాయలసీమ ఏకైక థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు ఆర్టీపీపీ. విద్యుత్తు ఉత్పత్తిలో జాతీయ స్థాయి అవార్డులెన్నో సొంతం చేసుకున్న ఈ సంస్థ తాజాగా బొగ్గు సంక్షోభం ఎందుర్కొంటోంది.

సంక్షోభంలో ఆర్టీపీపీ
రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు

పీడిస్తున్న బొగ్గు కొరత

మూడు యూనిట్ల ద్వారా మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి

ఆరు యూనిట్లు రన్‌ చేస్తే కావాల్సిన బొగ్గు 25 వేల టన్నులు 

ఉన్న నిల్వలు 65 వేల టన్నులు మాత్రమే

రోజుకు అవసరం 20 వేల టన్నులు.. సరఫరా అవుతున్నది 12 వేల టన్నులు

తాజాగా రెండింటి ద్వారా 420 మెగావాట్ల ఉత్పత్తి


కడప, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ ఏకైక థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు ఆర్టీపీపీ. విద్యుత్తు ఉత్పత్తిలో జాతీయ స్థాయి అవార్డులెన్నో సొంతం చేసుకున్న ఈ సంస్థ తాజాగా బొగ్గు సంక్షోభం ఎందుర్కొంటోంది. ఆరు యూనిట్ల ద్వారా పూర్తి సామర్థ్యం 1,650 మెగావాట్ల పవర్‌ ఉత్పత్తి చేయాలంటే రోజుకు 25 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరమని ఇంజనీర్లు అంటున్నారు. తాజాగా ఉన్న నిల్వలు 65 వేల టన్నులే. కోల్‌ మైనింగ్‌ నుంచి రోజూ సరఫరా అవుతున్నది 8-12 వేలు టన్నులకు మించడం లేదు. దీంతో బొగ్గు కొరత కారణంగా ఇప్పటికే మూడు యూనిట్లు మాత్రమే రన్‌ చేస్తుంటే.. మంగళవారం మరో యూనిట్‌ కూడా షట్‌డౌన్‌ చేసినట్లు తెలిసింది. విద్యుత్‌ కొరత వెంటాడుతున్న ఈ కీలక సమయంలో ఆరు యూనిట్ల ద్వారా పూర్తి సామర్థ్యంతో విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. ‘బొగ్గు’మంటున్న సంక్షోభం కారణంగా ఆర్టీపీపీ వెలుగులు నింపడం ప్రశ్నార్థకంగా మారింది.

కడప జిల్లా ఎర్రగుంట్ల సమీపంలో 1989లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ దూరదృష్టితో రాయలసీమ థర్మల్‌ వపర్‌ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాలుగు దశల్లో విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం. తొలి దశలో 1994లో రెండు యూనిట్ల ద్వారా 420 మెగావాట్లు (ఒక్కోటి 210 మెగావాట్లు), రెండో దశలో 2007లో రెండు యూనిట్ల ద్వారా 420 మెగావాట్లు, మూడో దశలో 2010లో ఒక యూనిట్‌ ద్వారా 210 మెగావాట్లు, నాలుగో దశలో ఒక యూనిట్‌ ద్వారా 600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించారు. ఏపీ జెన్కో పర్యవేక్షణలో నడిచే ఈ సంస్థలో 3 వేల మందికిపైగా ఉద్యోగులు, సిబ్బంది పని చేస్తున్నారు. పవర్‌ జనరేషన్‌లో ఆర్టీపీపీ ఆరుసగా ఆరేళ్లు మెరిటోరియస్‌ ఉత్పాదకత అవార్డులు, ఏడేళ్లు ప్రోత్సాహక అవార్డులు అందుకుంది. 1998-99, 2002-03, 2003-04లో దేశంలోనే మొదటి స్థానంలో, 1999-2000, 2001-02 మధ్య రెండవ స్థానంలో నిలిచింది. అలాంటి సంస్థ బొగ్గు కొరతతో బోరుమంటోంది. సగం కూడా విద్యుత్‌ ఉత్పత్తి చేయడం లేదని అధికారులే అంటున్నారు.


తరిగిపోతున్న బొగ్గు నిల్వలు

ఆర్టీపీపీ పూర్తి సామర్థ్యం 1,650 మెగావాట్ల ఉత్పత్తి కోసం ఆరు యూనిట్లు రన్‌ చేస్తే రోజుకు 20-25 వేల టన్నుల బొగ్గు అవసరం ఉంది. సింగరేణి, మహానది కోల్‌ ఫీల్డ్‌ లిమిటెండ్‌ నుంచి బొగ్గు సరఫరా అవుతుంది. తాజాగా రోజుకు 8-12 వేల టన్నులు కూడా సరఫరా కావడం లేదని ఆర్టీపీపీ అధికారులే అంటున్నారు. నిల్వ ఉన్న బొగ్గు 65 వేల టన్నులే. ఆరు యూనిట్లు రన్‌ చేస్తే రెండున్నర రోజులకు కూడా సరిపోవడం లేదు. సరఫరా అవుతున్నది అరకొరే. అదీ ఎప్పుడు ఆగిపోతుందో తెలియని దైన్యపరిస్థితి ఉందని సిబ్బంది ఆందోళన. వారం పది రోజులుగా మూడు యూనిట్ల ద్వారా 630 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. మరో 1,020 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మూడు యూనిట్లను షట్‌డౌన్‌ చేశారు. రన్‌ అవుతున్న మూడింటిలో మంగళవారం ఒక యూనిట్‌ ఆపేసినట్లు తెలిసింది. 2020 మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపు 9-10 నెలలు మొత్తం యూనిట్లు బందు చేశారు. విండ్‌, సోలార్‌ పవర్‌ ద్వారా తక్కువ ధరలకే విద్యుత్‌ సరఫరా అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీపీలో ఉత్పత్తిని ఆపేసింది. అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది రోడ్డెక్కారు. ఆ తరువాత ఉత్పత్తి ప్రారంభించి ఐదు యూనిట్లు రన్‌ చేసి 1,050 నుంచి 1,200 మెగావాట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టారు. గత ఏడాది మార్చి సమయంలో 4.60 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉన్న బొగ్గు నిల్వలు 65 వేల టన్నులకు పడిపోయాయి. గతంలో రోజుకు 20 వేల టన్నులు బొగ్గు సరఫరా ఉంటే.. తాజాగా 8-12 వేల టన్నులు కూడా ఉండడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ వెలుగులు ప్రశ్నార్థకమేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కోటా మేరకు బొగ్గు సరఫరా లేదు

- జగన్నాథ్‌, ఆర్టీపీపీ ఎస్‌ఈ, ఎర్రగుంట్ల, కడప జిల్లా

ఆర్టీపీపీకి సింగరేణి, మహానది కోల్‌ ఫీల్డ్‌ లిమిటెడ్‌ నుంచి బొగ్గు సరఫరా అవుతుంది. ఆరు యూనిట్లు రన్‌ చేస్తే రోజుకు సగటున 20-25 వేల మెట్రిక్‌ టన్నులు అవసరం ఉంది. ప్రస్తుతం బొగ్గు సరఫరా బాగా తగ్గిపోయింది. అలాగే ఆర్టీపీపీలో బొగ్గు నిల్వలు 65 వేల టన్నులకు పడిపోయాయి. దీంతో విద్యుత్తు ఉత్పత్తి తగ్గించి మూడు యూనిట్లు మాత్రమే రన్‌ చేస్తున్నాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

 



Updated Date - 2021-10-13T05:26:45+05:30 IST