Abn logo
Feb 24 2021 @ 01:23AM

ఊహించని విజేత!

అందం, అభినయం రెండూ ఉన్న అమ్మాయి రుబీనా దిలౌక్‌. ఐఏఎస్‌ అధికారిణి అవ్వాలనుకొని అనుకోకుండా ఫ్యాషన్‌ రంగం వైపు వచ్చిన ఆమె టీవీ నటిగా బోలెడు పాపులారిటీ సంపాదించకున్నారు. ఇప్పుడు బిగ్‌బాస్‌ 14 సీజన్‌ విజేతగా నిలవడం ఆమె క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఫ్యాషన్‌కు మారుపేరుగా నిలిచిన ఈ బ్యూటీ విశేషాలివి..


సిమ్లాకు చెందిన రుబీనా గళగళ మాటాడుతుంది. తెలివితేటలు కూడా ఎక్కువే. స్కూలు రోజుల్లో డిబేట్‌ పోటీల్లో బహుమతులు చాలా గెలుచుకుంది కూడా. పెద్దయ్యాక ఐఏఎస్‌ అధికారిణి అవ్వాలనుకుంది. అందుకోసం ప్రిపరేషన్‌ కూడా మొదలెట్టింది. కానీ కాలేజీకి వచ్చేసరికి ఆమె మనసు ఫ్యాషన్‌ ప్రపంచంవైపు మళ్లింది. రచయిత అయిన తండ్రి కూడా ఆమె కలలకు రెక్కలిచ్చారు. కుటుంబం ప్రోత్సాహం, పట్టుదలతో అందాల పోటీలకు సిద్ధమయింది. 2006లో మిస్‌ సిమ్లా, 2008లో మిస్‌ నార్త్‌ ఇండియాగా నిలవడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ సమయంలోనే ఆమెకు బుల్లితెర నుంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలాజీ టీవీలో ప్రసారమయ్యే ‘చోటీ బహూ 2’ షోతో రుబీనా బుల్లితెర ప్రయాణం మొదలైంది. ఆ షోలో రాధిక పాత్రలో రుబినా ఒదిగిపోయారు. అయితే కలర్స్‌ టీవీలో వచ్చిన ‘శక్తి అస్తిత్వ కె ఎహ్‌సాస్‌ కీ’లో ఆమె నటన అందరిని మెప్పించింది. బిగ్‌బాస్‌ హౌజ్‌లో 

టీవీ నటిగా సంపాదించుకున్న పాపులారితో ఆమెకు బిగ్‌బాస్‌ 14 సీజన్‌లో ఎంట్రీ లభించింది. భర్త అభినవ్‌ శుక్లాతో బిగ్‌బాస్‌ హౌజ్‌లో అడుగుపెట్టింది. అయితే ఆమె భర్త రెండు వారాలకే షో నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. ఆమె చిత్రమైన మనిషి అని, ఒక టీచర్‌లా ప్రవర్తిస్తుందని, పెత్తనం చెలాయించాలని చూస్తుందని హౌజ్‌లో అందరూ అనేవారు. మొదటి రెండు వారాలు రుబీనాకు పీడకలగా అనిపించాయి. బెరుకుగా ఉన్న ఆమె క్రమంగా గట్టి పోటీదారుగా మారారు. వారం వారం సల్మాన్‌ఖాన్‌ రుబీనాకు సలహాలు ఇచ్చేవారు. అలా ఆమె ధైర్యం తెచ్చుకుంది. ‘‘బిగ్‌బాస్‌ విజేతగా నిలుస్తానని అస్సలు అనుకోలేదు. ఫైనల్‌కు చేరుతానని మాత్రం అనుకున్నాను. సల్మాన్‌ఖాన్‌ నాకు కొన్ని విషయాలు నేర్పించకుంటే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. ఆయన నాకు ఎంతో సాయం చేశారు.’’ అంటున్న రుబీనా బిగ్‌బాస్‌ విజేత అయిన ఆరో మహిళగా, అయిదో టీవీ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్‌బాస్‌ 14 సీజన్‌ రుబీనాకు వ్యక్తిగతంగానూ ఎంతో గుర్తిండిపోయే షో. ఎందుకంటే విడాకులు తీసుకుందామనే నిర్ణయానికి వచ్చిన అభినవ్‌, రుబీనా తమ బంఽధాన్ని నిలబెట్టుకొనేందుకు ఒక అవకాశం కోసం బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. అనుకున్నట్టుగానే ఈ షో వారి మధ్య మనస్ఫర్థలు, పొరపొచ్చాలను దూరం చేసి ఇద్దరినీ దగ్గర చేసింది.