42 సెకన్లలో.. కమ్మేసింది

ABN , First Publish Date - 2022-09-14T17:20:32+05:30 IST

రూబీ హోటల్‌ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. మొత్తం 42 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్‌లో

42 సెకన్లలో.. కమ్మేసింది

హైదరాబాద్‌ సిటీ: రూబీ హోటల్‌ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. మొత్తం 42 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్‌లో ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టంగా కనిపిస్తోంది. 

 సరిగ్గా సోమవారం రాత్రి 9:17:24 గంటలకు చిన్నగా పొగలు వచ్చాయి

 9:17:28కి పొగలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.

 9:17:30కి బ్యాటరీలు పేలిన శబ్దం వచ్చింది

 9:17:32కి మంటలు వచ్చాయి

 9:17:35కు మరిన్ని బ్యాటరీలు పేలి, పెద్ద ఎత్తున శబ్దంతో మంటలు వ్యాపించాయి.

  9:17:38కి మంటలు, దట్టమైన పొగ సెల్లార్‌ను చుట్టుముట్టాయి.

 9:17:40 నుంచి 9:17:50 మధ్యలో మంటలు, పొగ భవనం పై భాగానికి విస్తరించాయి.

 9:18:06కు మంటలు చిన్నగా మారిపోయి.. దట్టమైన పొగ పూర్తిగా విస్తరించి ఏం కనిపించకుండా పోయింది. 


విచారణకు రెండు బృందాలు

రూబీ హోటల్‌ ప్రమాద ఘటన విషయంలో జరిగిన నిర్లక్ష్యం.. నిబంధనల బేఖాతరుపై పరిశీలనకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ప్రాంతీయ అగ్నిమాపక అధికారి పాపయ్య తెలిపారు. బ్యాటరీ చార్జింగే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్న నేపథ్యంలో.. దానిపై దర్యాప్తు సాగుతోందని ఆయన తెలిపారు. అసలు బ్యాటరీ వాహనాలకు సంబంధించి అగ్నిమాపక శాఖ తరఫున ఇంకా ఎలాంటి నియమ నిబంధనలు, మార్గదర్శకాలు సిద్ధం కాలేదని ఆయన చెప్పారు. ఏసీ గదులు.. ఇరుకు గదుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు పొగలు దట్టంగా కమ్ముకోవడం సహజమేనని.. ఆ పొగ పోయేలా ఎమర్జెన్సీ స్మోక్‌ ఫ్రీ ఎగ్జిట్‌లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రతి గదిలో 10 శాతం స్థలాన్ని ఓపెన్‌ చేసి.. అవసరమైనప్పుడు అవి తెరుచుకునేలా ఏర్పాట్లు చేయాలని.. కొత్తగా కడుతున్న భవనాల్లో ఈ ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు.


తొమ్మిది మందిని రక్షించా..

రాంగోపాల్‌పేట్‌: అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటల వల్ల కాకుండా పొగ వల్లనే ప్రాణనష్టం అధికమైందని సికింద్రాబాద్‌ అగ్నిమాపక కేంద్రం ఫైర్‌ ఆఫీసర్‌ డి.మోహన్‌రావు పేర్కొన్నారు. రూబీ హోటల్‌లో ప్రమాదం జరిగిందంటూ రాత్రి 9.37కి కంట్రోల్‌ రూం నుంచి కాల్‌ వచ్చిందని, 9.42కి ఘటనా స్థలానికి చేరుకున్నామని ఆయన చెప్పారు. తాను తొమ్మిది మందిని రక్షించి.. అపోలో, గాంధీ, యశోద ఆస్పత్రులకు తరలించినట్లు వివరించారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వాటి నుంచి బయటపడడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు.

Updated Date - 2022-09-14T17:20:32+05:30 IST