Abn logo
Oct 24 2021 @ 01:32AM

‘రుడా’ అనుమతులు మొదలు

వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభిస్తున్న రుడా చైర్‌పర్సన్‌ షర్మిళారెడ్డి

130 దరఖాస్తులకు అనుమతి

రూ.40 లక్షల ఆదాయం 

 ఏపీడీపీ ఎంస్‌ వెబ్‌పోర్టల్‌ ప్రారంభం

రాజమహేంద్రవరం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (రుడా)  భవనాలకు, లే అవుట్లకు అనుమతి ఇవ్వనుంది. వారం రోజుల్లో 130 దరఖాస్తులు పరిశీలించి అనుమతి ఇచ్చాం. రూ.40 లక్షల ఆదాయం రుడాకు వచ్చిందని రుడా చైర్‌పర్శన్‌ మేడపాటి షర్మిళారెడ్డి తెలిపారు. స్థా నిక రుడా కార్యాలయంలో శనివారం భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులు వంటి సర్వీసులకు సంబంధించిన ఆన్‌లైన్‌ ఏపీడీపీ ఎంఎస్‌ వెబ్‌ పోర్టల్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలో 207 గ్రామాల అభివృద్ధికి మార్గం సుగమం అయిందన్నారు. గ్రామాలలో భవన నిర్మాణాలు,  లేఅవుట్ల అనుమతులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి, ఆన్‌లైన్‌లో వేగంగా అనుమతులు వచ్చేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు మున్సిపాల్టీల పరిధిలో కూడా ఈ ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చినట్టు వివరించారు. రుడా వైస్‌ చైర్మన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ మాట్లాడుతూ పంచాయతీల పరిధిలో 300 చదరపు మీటర్ల వరకూ భవన నిర్మాణాలకు పంచాయతీలే అనుమతి ఇవ్వవచ్చని, అది దాటితే రుడా అనుమతి అవసరమన్నారు.  కార్పొరేషన్‌లో 1000 చదరపు మీటర్లలోపు అనుమతులు ఇస్తా మని, ఈ పరిధి దాటితే రుడా అనుమతి అవసరమన్నారు. లేఅవుట్లు ప్లాన్లు, 2017లో వచ్చిన జీవో నంబరు 119 ప్రకారం రుడా పరిధిలో అనుమతులు పొందవచ్చని ఆయన వివరించారు. భవిష్యత్‌లో మూడు రాజధానులు ఏర్పడితే రుడా కేంద్రబిందువుగా తయారవుతుందని, పరిపాలనాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉందన్నారు. అనుమతులు ఇచ్చే ముందు ఆయా లేఅవుట్లలో విశాలమైన రోడ్లు, డ్రెయిన్లు ఉండేలా తప్పనిసరిగా చూడాలన్నారు. రుడా ప్రణాళికాధికారి  రామమోహన్‌ మాట్లాడుతూ రుడా, కుడాలకు రిజిస్ర్టేషన్‌ ఆఫ్షన్లు ఎంచుకోవచ్చని తెలిపారు. బిల్డర్లకు, సర్వేయర్లకు ఆప్షన్లు ఎంచుకోవడాని కి డిసెంబర్‌ 31 వరకూ గడువు ఉందని, రుడా ఎపీడీపీఎంఎస్‌ పోర్టల్‌ కోడ్‌ నంబరు 1194గా నిర్ణయించినట్టు చెప్పారు.