రుయాలో.. రోజూ ఇంతమంది చచ్చిపోతున్నారా?

ABN , First Publish Date - 2021-05-12T07:00:51+05:30 IST

సోమవారం నాటి దుర్ఘటనతో..

రుయాలో.. రోజూ ఇంతమంది చచ్చిపోతున్నారా?

మరణ మృదంగం

రోజూ 38 నుంచి 45 మరణాలు

సోమవారం 56 మంది చనిపోయారన్న సూపరింటెండెంట్‌ 

ఆ సమయంలో మాత్రం  11 మందే అని వెల్లడి 

బులెటిన్‌లో 18 మరణాలే జిల్లాలో నమోదు 


తిరుపతి(ఆంధ్రజ్యోతి): సోమవారం నాటి దుర్ఘటనతో రుయా ఆసుపత్రిలో కొంతకాలంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నట్టు వెల్లడైంది. ఆక్సిజన్‌ అందక చనిపోయింది 11 మందే అని అధికారులు చెప్పే క్రమంలో ఆస్పత్రిలో రోజూ అంతకన్నా ఎక్కువ మందే చనిపోతున్నారని బయటపెట్టారు. ప్రతిరోజూ 38 నుంచీ 45 మంది దాకా రుయాలో చనిపోతున్నారని వెల్లడించారు. అయితే వీరంతా ఏ లెక్కల్లోకీ ఎక్కకపోవడమే విచిత్రం. ఇప్పటిదాకా ఈ చావులెక్కలను ఎందుకు దాచిపెట్టారన్నదే ప్రశ్న.  


రుయా మృతులు11 కాదు 19

రుయా ఆస్పత్రిలో సోమవారం రాత్రి 8.20 నుంచీ 8.40 గంటల నడుమ 20 నిమిషాల పాటు ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయిన వ్యవధిలో 11 మంది ఆక్సిజన్‌ లేక ఊపిరాడక చనిపోయారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. చనిపోయినవారు 11మందేనని సోమవారం రాత్రి కలెక్టర్‌ మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే 11 మందితో పాటు మరో 8 మందిని కూడా ఆ సమయంలో చనిపోయినవారి జాబితాలో చేర్చాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య 19కి పెరిగే అవకాశం ఉంది. కాగా సోమవారం ఒక్కరోజే 56 మంది చనిపోయారని రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి మీడియాకు వెల్లడించారు. ఇంత పెద్ద విషాద ఘటన జరిగినప్పుడు మృతుల వివరాలను వెల్లడిస్తారు.అయితే చనిపోయినవారి పేరు , ఊరు వంటి వివరాలతో జాబితా ఇప్పటికీ ప్రకటించనే లేదు.


రోజూ ఇంతమంది చచ్చిపోతున్నారా?

గత నెల 18వ తేదీ రుయాలో మరణాల సంఖ్య భారీగా ఉన్నట్టు మంగళవారం చెప్పిన లెక్కలతో బయటపడింది. రుయాలో రెండు వారాల మరణాలు పరిశీలిస్తే వెన్నులో వణుకు పుడుతోంది. గతనెల 24వ తేదీ 22 మంది, 25న 25 మంది, 26న 28 మంది, 27న 33 మంది, 28న 32 మంది, 29న 37 మంది, 30న 30 మంది, ఈనెల 1న 34 మంది, 2న 28 మంది, 3న 36 మంది, 4న 28 మంది, 5న 28 మంది 6వ తేదీ 30 మంది వరకు కొవిడ్‌తో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. 


నేర్వని పాఠం

సోమవారం జరిగిన ఘటన వంటిదే నాలుగు రోజుల క్రితం కూడా జరిగింది. ఆక్సిజన్‌ పూర్తిగా అయిపోయే పరిస్థితి వస్తే కలెక్టర్‌ అనుమతితో స్విమ్స్‌ నుంచి 1 కేఎల్‌ అరువు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆక్సిజన్‌ సక్రమంగా అందక విలవిలలాడారు. దీనికితోడు వెంటిలేటర్ల దగ్గర ఆక్సిజన్‌ ఫ్లోమీటర్‌ సక్రమంగా పనిచేయకపోవడం వలన పలువురు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. అయితే ఇవేవీ వెల్లడించలేదంటున్నారు.


ఆ 11 మంది వీరే!

1. డి.సాహిత్‌ (27)-వరదయ్యపాళెం 2. కె.బాబు (55)- మంగళం, తిరుపతి. 3. జి.భువనేశ్వరబాబు (36), తేజానగర్‌, చిత్తూరు 4.ఎం.రాజమ్మ (71), వెలగమూడి, నెల్లూరు 5.బి.మున్నీర్‌ సాహెబ్‌ (49), మర్రిపాడు, గుర్రంకొండ 6.బి.దేవేంద్ర రెడ్డి (58), అదినవారిపల్లె,ఎర్రావారి పాళెం 7.ఎస్‌.ఫజులుల్లా (41), కలికిరి 8.ఎ.వెంకటసుబ్బయ్య (28), రాజంపేట,కడప జిల్లా 9.సి.తనూజరాణి(48), గాజులమండ్యం,రేణిగుంట 10.పి.గౌ్‌సబాషా (37), కొత్తపేట,పుంగనూరు 11.ఎస్కే మహ్మద్‌ బాషా (49), గోవిందనగర్‌, తిరుపతి 


జాబితాలో చేర్చని 8 మంది 

1. సి. మదనమోహన్‌ (52), వై.వేణుగోపాల్‌ (55), టి.రమే్‌షబాబు (39), రమణాచారి(40), ఎ.ఆదిలక్ష్మి(35), ఎన్‌.శివప్రియ (33), బి.సులోచన (52), ఎస్కే కళాధర్‌ (48).


అంతలోనే ఊపిరి ఆగింది!

‘వారంరోజుల మెరుగైన చికిత్సతో నా భర్త వేణుగోపాల్‌(50) కోలుకున్నాడు. గాలి బాగా పీల్చుకుని వదిలేస్తే బుధ, గురువారాల్లో డిశ్చార్చి చేస్తామని వైద్యులు చెప్పారు. అప్పుడప్పుడు ఆయన వెంటిలేటర్‌ తీసేసి బయటి గాలి పీల్చుకుంటూ ఉన్నాడు. నాకేం భయం లేదు. రెండు రోజుల్లో ఇంటికెళ్దామన్నాడు. ఆ మాట చెప్పిన కొన్ని గంటల్లోనే.. సోమవారం రాత్రి ఆక్సిజన్‌ ఆగిపోయింది. బాధితుల బంధువులు ఒక్కసారిగా వచ్చి బెడ్‌పై పడిపోవడంతో గందరగోళం నెలకొంది. మా ఆయన కళ్లు తేలేశాడు. డాక్టర్లకు చెబితే బోర్లా పడుకోబెట్టి గుండెపై తట్టమన్నారు. ఇలా అరగంట పాటు చేశా. అంతలోనే ఆక్సిజన్‌ వచ్చేసింది. కానీ, అప్పటికే మా ఆయన ప్రాణం పోయింది. ఐదు నిమిషాల్లో ఆక్సిజన్‌ వచ్చుంటే ప్రాణం నిలిచేదేమో?’ అని మదనపల్లెకు చెందిన మాజీ కౌన్సిలర్‌ జయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. రాత్రిక్రి రాత్రే బంధువులు తిరుపతికి చేరుకుని మృతదేహాన్ని వీరి స్వగ్రామమైన సదుం మండలం చింతలవారిపల్లెకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. 


ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగి మృతి 

తిరుపతిలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలో పనిచేస్తున్న రమే్‌షబాబు (42).. నెల కిందట కేవీపల్లె ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా బదిలీ అయ్యారు. రోజూ తిరుపతి నుంచి విధులకు హాజరవుతున్నాడు. వారం కిందట కరోనా రావడంతో రుయాలోని కొవిడ్‌ సెంటర్‌లో చేరి చికిత్స పొందుతున్నాడు. సోమవారం రాత్రి ఆక్సిజన్‌ అంతరాయంతో మృత్యువాత పడినట్లు ఎంపీడీవో సురేంద్రబాబు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.రమే్‌షబాబు మృతి పట్ల సహోద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. 


బిడ్డకు జన్మనిచ్చిన 12 రోజులకే.. 

కలికిరి పంచాయతీ అంకెంవారిపల్లెకు చెందిన పి.పుష్పలత(30)కు పీలేరు ప్రభుత్వాస్పత్రిలో 12 రోజుల కిందట సిజేరియన్‌ ద్వారా ప్రసవం చేశారు. వారం రోజుల తర్వాత జరిపిన పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయింది. అప్పట్నుంచి తిరుపతి ఆస్పత్రుల్లో ప్రయత్నించి పడకలు లభించక కాలం గడిపింది. చివరికి సోమవారం రుయాలో చేరారు. రాత్రి 8.30 గంటలకు ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయిన ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. బిడ్డ మాత్రం క్షేమంగా ఉంది. ఫ ఇదే దుర్ఘటనలో కలికిరి చిరునామాతో రూయాలో చేరిన ఎస్‌.ఫజులుల్లా(35) కూడా మృతి చెందాడు. దామలచెరువుకు చెందిన ఈయన కరోనా లక్షణాలతో కలికిరిలోని సోదరి ఇంటికి వచ్చాడు. ప్రభుత్వ వైద్య శాఖలో పనిచేసే బావ పర్యవేక్షణలో చికిత్స పొందాలని ప్రయత్నించాడు. నాలుగు రోజులు స్థానికంగా చికిత్స తీసుకున్న తర్వాత పరిస్థితి విషమించడంతో రుయాలో చేరి.. ఆక్సిజన్‌ అందని ఘటనకు బలయ్యాడు. 


శ్రీకాళహస్తి మహిళ కూడా.. 

శ్రీకాళహస్తి పట్టణం సినిమావీధిలోని రమేష్‌ భార్య ఆదిలక్ష్మి(39)కి కరోనా ఉన్నట్లు గత నెల 26న నిర్ధారణ అయింది. శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో చేరగా.. ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోవడంతో 30వ తేదీన కుటుంబీకులు రుయాకు తీసుకెళ్లారు. ఆ రోజు పడక దొరక్కపోవడంతో మళ్లీ శ్రీకాళహస్తికి తీసుకొచ్చారు. మళ్లీ ఆక్సిజన్‌ స్థాయులు తగ్గిపోవడంతో 5వ తేది రుయాకు తీసుకెళ్లారు. వెంటిలేటరుపై చికిత్స పొందుతుండగా... సోమవారం రాత్రి ఆక్సిజన్‌ ఆగిన ఘటనలో మృతిచెందింది. ఈమె మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు చేశారు. ఈమెకు ఇద్దరు కుమారులున్నారు.


గొర్రెల వ్యాపారి ‘ఊపిరి’ పోయింది 

గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన మున్నీర్‌ సాబ్‌ (50) గొర్రెల వ్యాపారి. పది రోజుల కిందట కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో రుయాలో చేర్పించారు. సోమవారం రాత్రి ఆక్సిజన్‌ అందక మృతిచెందిన వారిలో ఆయన ఉన్నట్లు భార్య తెలిపారు. కుమార్తెకు వివాహం కాగా మిగతా ముగ్గురు కుమారులు చిన్న పిల్లలు. కుటుంబాన్ని ఎలా నెట్టుకు రావాలంటూ ఆమె తల్లడిల్లుతున్నారు. మర్రిపాడులో మంగళవారం ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు.


మా తమ్ముడిని చంపేశారు 

ఊపిరి ఆడడం లేదని తీసుకొచ్చిన మా తమ్ముడి ఊపిరిని రుయా సిబ్బంది పూర్తిగా తీసేశారు. ఆక్సిజన్‌పై ఎంతో మంది రోగులు ఆధారపడి ఉన్న సమయంలో అయిపోతుందనే విషయాన్ని ముందుగా చూసుకోకపోవడం, ఆఖరి క్షణాల్లో కనీసం రోగుల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయకపోవడం బాధాకరం. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం మరీ ఇంత ఘోరంగా ఉంటుందని అనుకోలేదు. ఇక్కడి వైద్యులు, సిబ్బంది కనీసం మానవత్వం కూడా లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. 

- సుబ్రహ్మణ్యం, మృతుడు రామారావు సోదరుడు, చంద్రగిరి


రెండేళ్ల కిందటే పెళ్లయింది 

మా అన్న గౌస్‌బాషా(37)కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. వారం కిందట కరోనా రావడంతో రుయాలో చేర్పించాం. సోమవారం రాత్రి 7.20 గంటలకు ఆక్సిజన్‌ సరఫరా ఆగడంతో మా అన్న మృతి చెందాడు. మా వదిన 7 నెలల గర్భిణి. ఎలా జీవించాలి? 

- ఇమ్రాన్‌ ఖాన్‌, కొత్తపేట,పుంగనూరు 


నా కొడుకు దక్కకుండా పోయాడు 

నా కుమారుడు గజేంద్రబాబు(35) ఆర్టీసీలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు.కరోనా పరీక్షలు చేసుకున్న వారం తర్వాత పాజిటివ్‌ అని రిజల్టు వచ్చింది. ఈ క్రమంలో వారం కిందట రుయాలో చేర్పించాం. సోమవారం రాత్రి 7.20- 8.10 గంటల మధ్యలో ఆక్సిజన్‌ నిలిచింది. నా కోడలు సునీత నోటితో దాదాపు 10 నిమిషాల పాటు ఊపిరి ఊదినా.. ఫలితం దక్కలేదు. అక్కడి అధికారులు సక్రమంగా పని చేయకపోవడంతోనే నా కొడుకు మాకు దక్కకుండా పోయాడు.వాడి ఇద్దరు పిల్లలు ఎలా బతకాలి? 

- మల్లేష్‌, ఈడిగపల్లె, పుంగనూరు మండలం 


మా జగనన్న అని గెలిపించుకున్న పాపానికి.. 

నాపేరు గిరిధర్‌రావు. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్నా. ఇటీవల మానాన్న పీఎస్‌ రామారావుకు కరోనా వచ్చి.. పూర్తిగా నయమైంది. మళ్లీ సోమవారం ఊపిరాడడం లేదని చెప్పడంతో రుయాస్పత్రికి తీసుకొచ్చాం. సాయంత్రం వరకు అరకొరగా వైద్యం అందించారు. సాయంత్రం ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందనడంతో ఎమర్జెన్సీ వార్డుకు మార్చి ఆక్సిజన్‌ పెట్టారు. అలా పెట్టిన అరగంటకే ఆక్సిజన్‌ సరఫరా ఆగింది. అంతరాయం ఏర్పడిందని సిబ్బంది హడావుడి చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. కొంత సమయానికే ఆక్సిజన్‌ అందక మా నాన్న మృతిచెందాడు. మా జగనన్న, మా ప్రభుత్వం అని గెలిపించుకున్న పాపానికి మాకు బాగా బుద్ధి వచ్చింది. నా కళ్ల ముందే మా నాన్నతోపాటు మరో 20 మంది వరకు చనిపోయారు. ఆక్సిజన్‌ అందక అరగంటకు పైగా గిలగిల కొట్టుకుంటున్నా ఒక్కరూ స్పందించలేదు. ఆక్సిజన్‌ అయిపోతుందని ముందే తెలిసినా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ విషయాన్ని ముందుగా చెప్పుంటే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లి బతికించుకొనే వాళ్లం. 

- గిరిధర్‌రావు 



Updated Date - 2021-05-12T07:00:51+05:30 IST