ముగ్గురితో పాలన

ABN , First Publish Date - 2020-05-28T11:21:13+05:30 IST

జిల్లా స్థాయిలో ప్రభుత్వ శాఖలపై పర్యవేక్షణ మరింత పెరగనుంది. ఇందులో జాయింట్‌ కలెక్టర్లు కీలకం కానున్నారు

ముగ్గురితో పాలన

  • కలెక్టర్‌ పర్యవేక్షణ
  • జేసీలకు 50 శాఖలు

కర్నూలు (అర్బన్‌), మే 25: జిల్లా స్థాయిలో ప్రభుత్వ శాఖలపై పర్యవేక్షణ మరింత పెరగనుంది. ఇందులో జాయింట్‌ కలెక్టర్లు కీలకం కానున్నారు. కలెక్టర్‌కు పని భారం కొంత మేర తగ్గనుంది. పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవల జిల్లాకు ముగ్గురు జేసీలను నియమించింది. వారి విధులపై స్పష్టతనిచ్చింది. ముఖ్యమైన అన్ని శాఖలనూ ఇకపై జేసీలు కూడా పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు కలెక్టర్‌ తర్వాత జాయింట్‌ కలెక్టర్‌ కీలకంగా ఉండేవారు. ఆ తర్వాత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి జేసీ-2గా ఉండేవారు. అదే క్యాడర్‌లో డీఆర్వో, స్పెషల్‌ కలెక్టర్‌ ఉండేవారు. 


ఇన్నాళ్లూ కలెక్టర్‌ పైనే భారం

ఇప్పటి వరకు రెవెన్యూ, పౌర సరఫరాల శాఖను జేసీ పర్యవేక్షించేవారు. అవసరాన్ని బట్టి కలెక్టర్‌ జోక్యం చేసుకునేవారు. మిగిలిన దాదాపు అన్ని శాఖలనూ నేరుగా కలెక్టర్‌ పర్యవేక్షించేవారు. అన్ని రకాల కీలక నిర్ణయాలు, పథకాల మంజూరు, ఆర్థిక విషయాలు, పాలనా వ్యవహరాలను కలెక్టరే చూసుకునేవారు. అన్ని శాఖల అధికారులు విధిగా కలెక్టర్‌ సూచనలు, ఆదేశాలకు అనుగునంగానే పనిచేసేవారు. దీంతో కలెక్టర్‌పై నిత్యం తీవ్రమైన పని ఒత్తిడి ఉండేది. అవసరమైనప్పుడు ఇద్దరు జేసీలకు కొన్ని బాధ్యతలు అప్పగించేవారు. 


ఇక ముగ్గురు జేసీలు

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ముగ్గురు జేసీలను నియమించింది. వారు ఏఏ శాఖలు చూసుకోవాలో నిర్దేశించింది. జేసీలు నిర్వహించాల్సిన 34 శాఖలను రాష్ట్ర స్థాయిలోనే   నిర్ణయించారు. వీటిని ముగ్గురికీ పంచారు. జిల్లా స్థాయిలో మరిన్ని శాఖలను జేసీలకు అప్పగించే నిర్ణయాధికారాన్ని కలెక్టర్‌కు ప్రభుత్వం అప్పగించింది. దీంతో జిల్లాలో మరో 16 శాఖలను ముగ్గురు జేసీలకు కలెక్టర్‌ వీరపాండియన్‌ కేటాయించారు. జిల్లాలో ముగ్గురు జేసీలకు కలెక్టర్‌ కేటాయించిన శాఖల వివరాలను కలెక్టరేట్‌ పరిపాలనాధికారి వెంకటేష్‌ నాయక్‌ వెల్లడించారు. 


ఎవరెవరికి ఎన్ని..?

జాయింట్‌ కలెక్టర్లలో ఒకరు రెవెన్యూ, రైతు భరోసా వ్యవహారాలను చూస్తారు. మరొక జేసీ వార్డు, గ్రామ సచివాలయాలు, అభివృద్ధి వ్యవహారాలను చూస్తారు. ఇంకో జేసీ ఆసరా, సక్షేమం వ్యవహారాలను చూస్తారు. తొలి ఇద్దరూ ఐఏఎస్‌ అధికారులే కావడంతో సమాన హోదా ఉంటుంది. 


పాలనా వ్యవహరాల్లో కొంత అనుభవం ఉన్నవారికి కీలకమైన రెవెన్యూ, రైతు భరోసా శాఖలను అప్పగించినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం జేసీలకు కేటాయించిన 34 శాఖలో 20 శాఖల పర్యవేక్షణను ఈ ఒక్క అధికారికే అప్పగించారు. 


నేరుగా ఐఏఎస్‌కు ఎంపికైన అధికారికి అభివృద్ది, సచివాలయాలు ఇచ్చారు. ఈ అధికారి పరిధిలో 13 శాఖలు ఉంటాయి.


ఎస్‌డీసీ హోదా ఉన్న అధికారికి సంక్షేమం, ఆసరా బాధ్యతలు అప్పగించారు. ఈయన జేసీ హోదాలో మరో 17 శాఖలను చూస్తారు. జిల్లా స్థాయిలో ముఖ్యమైన 50 శాఖల పర్యవేక్షణ ఇక నుంచి జేసీలు పర్యవేక్షిస్తారు. కానీ ఎప్పటిలాగే తుది నిర్ణయం కలెక్టర్‌ చేతిలోనే ప్రభుత్వం ఉంచింది.


ఎవరెవరికి ఏవేవి..?


జేసీ-1 (రెవెన్యూ- రైతు భరోసా)

రెవెన్యూ మరియు సర్వే, పౌరసరఫరాలు, వ్యవసాయం, పశుసంవర్థక శాఖ, ఉద్యాన, పట్టు పరిశ్రమలు, మత్స్య శాఖ, సాగునీరు, విద్యుత్‌, గునులు-భూగర్భవనరులు, శాంతి భద్రతలు, ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌, మార్కెటింగ్‌ మరియు సహకారం, విపత్తుల నిర్వహణ. ఈ శాఖలను రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కేటాయించారు. ప్రణాళికలు, రవాణా, భూగర్భజల వనరులు, రిజిస్ర్టేషన్‌, లీగల్‌ మెట్రాలజీ, అటవీశాఖలను జిల్లా స్థాయిలో కలెక్టర్‌ కేటాయించారు. 


జేసీ-2 (సచివాలయాలు-అభివృద్ధి)

గ్రామ- వార్డు సచివాలయాలు, పంచాయతీరాజ్‌, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, పురపాలక-పట్టణాభివృద్ధి, హౌసింగ్‌, మీ సేవ, ఆర్జీఎస్‌ అండ్‌ ఐటీ, విద్యుత్‌, ఇరిగేషన్‌ మినహా ఇంజనీరింగ్‌ శాఖలు. వీటిని రాష్ట్ర  ప్రభుత్వం కేటాయించింది. ఔషధ నియంత్రణ, ఆయుష్‌, సామాజిక అటవీ శాఖలను కలెక్టర్‌ కేటాయించారు. 


జేసీ -3 (అసరా- అభివృద్ధి)

గ్రామీణాభివృద్ధి, డీఆర్‌డీఏ- డ్వామా, మహిళ, శిశు సంక్షేమం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మైనార్టీ సంక్షేమ శాఖలు, పరిశ్రమలు, ఎండోమెంట్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సెర్ఫ్‌, కార్మిక, ఫ్యాక్టరీలు, అగ్నిమాపక, పర్యాటకం, కాలుష్య నియంత్రణ, చేనేత, జౌళిశాఖలను కలెక్టర్‌ కేటాయించారు. 

Updated Date - 2020-05-28T11:21:13+05:30 IST