కాసులేరుతున్న పాలకులు

ABN , First Publish Date - 2020-05-05T06:20:26+05:30 IST

కట్టడి ప్రాంతాల్లో తప్ప అన్ని జోన్లలోనూ మద్యం అమ్ముకోవచ్చునన్న కేంద్రం వెసులుబాటును అనేక రాష్ట్రాలు ఆత్రంగా అందిపుచ్చుకోవడంతో, మూడోవిడత లాక్‌డౌన్‌ మొదలైన రోజునే దేశం చిత్రమైన సన్నివేశాలు చూడాల్సి వచ్చింది...

కాసులేరుతున్న పాలకులు

కట్టడి ప్రాంతాల్లో తప్ప అన్ని జోన్లలోనూ మద్యం అమ్ముకోవచ్చునన్న కేంద్రం వెసులుబాటును అనేక రాష్ట్రాలు ఆత్రంగా అందిపుచ్చుకోవడంతో, మూడోవిడత లాక్‌డౌన్‌ మొదలైన రోజునే దేశం చిత్రమైన సన్నివేశాలు చూడాల్సి వచ్చింది. ఇంతకాలమూ నాల్కలు పిడచకట్టుకుపోయి ఉన్న మద్యపాన ప్రియులు నిబంధనలను తోసిరాజని ఒక్కసారిగా మద్యం దుకాణాల మీదకు ఎగబడ్డారు. చాలా చోట్ల ఉదయం ఆరుగంటలనుంచే వందలాది మంది బారులు తీరారు. ఆరడుగుల భౌతికదూరం, దుకాణం ముందు ఏకకాలంలో ఐదుగురు మాత్రమే ఉండాలన్న నియమాలన్నీ గాలికికొట్టుకుపోగా, కనీసం మాస్కులు కూడా ధరించనివారు కోకొల్లలు. తోపులాటలు, వాగ్వాదాలు, భౌతికదాడులను పోలీసులు నియంత్రించలేక లాఠీచార్జీ చేయవలసి వచ్చింది. పరిస్థితి అదుపు తప్పడంతో షాపులు కూడా మూసివేయించవలసి వచ్చింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఏ ఉద్దేశంతో మరికొంతకాలం కొనసాగించాలని ప్రభుత్వం అనుకున్నదో ఆ లక్ష్యం తొలిరోజే నీరుగారిపోయింది. లాక్‌డౌన్‌ను మరింత పొడిగించినా, మద్యం దుకాణాలను మాత్రం తక్షణమే తెరవాలని ఏ ప్రజలు డిమాండ్‌ చేశారో తెలియదు కానీ, ఇంతటి కష్టకాలంలోనూ ప్రభుత్వాలు మద్యాన్ని ఓ ఆదాయవనరుగానే చూస్తున్నాయి. కాసులకు కటకటలాడిపోతున్న పాలకులు ఖజనాను నింపుకొనే ప్రయత్నంలో, ప్రజలను మరింత ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారు.


మద్యాన్ని ప్రభుత్వాలు నిత్యావసరాలకంటే ఓ మెట్టుపైనే ఉంచాయి. నిత్యావసరాల కొనుగోలుకు కొద్దిగంటల సమయం మాత్రమే ఇచ్చినా, మద్యం దుకాణాలు మాత్రం రాత్రి ఏడువరకూ తెరిచి ఉంటాయి. మద్యం దుకాణాలముందు ఈ విపరీతమైన రద్దీని నివారించాలంటే తెరిచివుంచే సమయాన్ని మరింత పెంచాలని కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు నివేదికలు ఇచ్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మద్యపాన ప్రియులు ఇలా ఒక్కసారిగా ఎగబడతారనీ, నిబంధనల ఉల్లంఘన తీవ్రంగా జరుగుతుందని ప్రభుత్వాలకు తెలియదనుకోలేం. పేదలను ఇంతకాలమూ నిబంధనల పేరిట తీవ్రంగా హింసించిన ప్రభుత్వాలు, ఈ మద్యం విక్రయాల కోసం వందలాదిమందిని రోడ్డుమీదకు యధేచ్ఛగా తీసుకొచ్చి నలభైరోజుల లాక్‌డౌన్‌ కష్టాన్ని నీరుగార్చడం విషాదం. సంపూర్ణ మద్యనిషేధ లక్ష్యాన్ని ఓ నవరత్నంగా ప్రకటించుకున్న ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరీ విచిత్రం. రాష్ట్రంలో కరోనా విజృంభణ తీవ్రంగా ఉన్నా, మద్యం అమ్మకాలు ఆరంభించడంతో పాటు, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ధరలను సైతం పెంచింది. పైగా, కొనుగోళ్ళను నిరుత్సాహపరచేందుకే అదనపు సర్‌చార్జి విధించామనీ, మద్యనిషేధంవైపే ఇలా అడుగులు వేస్తున్నామని సన్నాయినొక్కులు నొక్కుతోంది. ప్రభుత్వం నిజంగా మద్యనిషేధానికి కట్టుబడివుంటే లాక్‌డౌన్‌ నలభైరోజులను ఒక సదవకాశంగా మలుచుకొని ఉండేది. ఇంతకాలం మూతబడిన దుకాణాలను తెరిచి, ధరలు పెంచడం వేలకోట్లు కూడబెట్టుకోవడానికే కానీ, ప్రజలకు మేలుచేయడానికి కాదు. ఈ అమ్మకాలతో ఉన్న స్టాకంతా ఖాళీ కావడమే కాక, ప్రజలు భారీ కొనుగోళ్లతో రాబోయే రోజులకోసం సరుకు నిల్వచేసుకోవడం ఖాయం. తమిళనాడులో మద్యం విక్రయాలు లేనందున ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు గ్రామాల్లో తమిళులు కూడా బారులు తీరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏతావాతా రాష్ట్ర ప్రభుత్వం తాను ఊహించినదానికంటే ఈ కష్టకాలంలో భారీగా ఆర్జించడం ఖాయం.


కరోనాకు మద్యం కూడా తోడైతే మా బతుకులు ఏమైపోతాయని కొన్నిచోట్ల మహిళలు తీవ్రంగా ప్రతిఘటించి దుకాణాలు బలవంతంగా మూసివేయించారట. ప్రజల ప్రాణాల పట్ల పాలకులకూ కాస్తంత ప్రేమ ఉండివుంటే బాగుండేది. కరోనాను ఎదుర్కోవాలంటే రోగనిరోధకశక్తి అవసరమనీ, దానికి ఈ కషాయాలు తాగాలనీ, ఇలా పెంచుకోవాలనీ చెబుతూనే రోగనిరోధకశక్తిని తీవ్రంగా హరించివేసే మద్యపానాన్ని అనుమతించడం విచిత్రం. ఆదాయాలు తీవ్రంగా దెబ్బతిని ఉన్న స్థితిలో ప్రజలను మరింత పీల్చిపిప్పిచేయడానికి పాలకులు సంకల్పించడం విషాదం. సరిహద్దు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు ఆరంభమైన స్థితిలో తెలంగాణలో ఏం చేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క మల్లగుల్లాలు పడుతున్నట్టుగా, మరోపక్క బీర్ల తయారీకి కొత్తగా అనుమతులు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. కరోనా నియంత్రణకోసం సరిహద్దులను కఠినంగా కాపాడుకున్నవారికి దృఢసంకల్పం ఉంటే మద్యం అక్రమరవాణానికి అడ్డుకోవడం పెద్దకష్టమేమీ కాదు. ప్రభుత్వాలు మద్యనిషేధం అమలుచేయడం మాట దేవుడెరుగు, కనీసం లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసేంతవరకూ విక్రయాలపై నిషేధం అమలు జరిపితే ఆ దురలవాటునుంచి బయటపడాలనుకున్న కొందరికైనా మేలు జరుగుతుంది.

Updated Date - 2020-05-05T06:20:26+05:30 IST