నిబంధనలు పాతర.. విచారణకు ముందే క్రేన్‌ శకలాల తొలగింపు

ABN , First Publish Date - 2020-08-04T17:39:25+05:30 IST

హిందుస్థాన్‌ షిప్‌యార్డులో ప్రమాదానికి గురైన క్రేన్‌ శకలాలను ఒక్కొక్కటిగా తీసేస్తున్నారు. శనివారం ఉదయం ప్రమాదం జరగ్గా... సోమవారం రాత్రికి చాలా వరకు తొలగించారు. మంగళవారానికి పూర్తిగా క్లియర్‌ చేయనున్నట్టు సమాచారం. క్రేన్‌ కూలిన ప్రమాదంలో పది మంది మరణించడంతో

నిబంధనలు పాతర.. విచారణకు ముందే క్రేన్‌ శకలాల తొలగింపు

కీలక ఆధారాలు లేకుండా చేసే యత్నం?

ఏడుగురు సభ్యులతో అకడమిక్‌ కమిటీ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): హిందుస్థాన్‌ షిప్‌యార్డులో ప్రమాదానికి గురైన క్రేన్‌ శకలాలను ఒక్కొక్కటిగా తీసేస్తున్నారు. శనివారం ఉదయం ప్రమాదం జరగ్గా... సోమవారం రాత్రికి చాలా వరకు తొలగించారు. మంగళవారానికి పూర్తిగా క్లియర్‌ చేయనున్నట్టు సమాచారం. క్రేన్‌ కూలిన ప్రమాదంలో పది మంది మరణించడంతో దీనిపై విచారణకు రెండు కమిటీలను వేశారు. ఒకటి షిప్‌యార్డులోని అధికారులు, నిపుణులతో అంతర్గత కమిటీ కాగా.... మరొకటి జిల్లా అధికారులు వేసిన అకడమిక్‌ కమిటీ. ఇందులో మొత్తం ఏడుగురు సభ్యులు వున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఐదుగురు ప్రొఫెసర్లు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, ఆర్‌డీఓ వున్నారు. వీరిలో ఏ ఒక్కరికీ భారీ క్రేన్లతో పనిచేసిన అనుభవం లేదు. విద్యాపరమైన అవగాహన తప్ప.... షిప్‌యార్డు క్రేన్లకు సంబంధించిన అనుభవం శూన్యం. క్రేన్‌ తయారీ, బిగింపులో తప్పులను వీరు ఎలా గుర్తిస్తారనేదే పెద్ద ప్రశ్న!


నివేదికలపై నిపుణుల విమర్శలు

జిల్లాలో ఇటీవల కాలంలో రసాయన సంబంధ పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాలపై నిపుణుల కమిటీలు సమర్పించిన నివేదికల్లో లోపాలు ఉన్నాయని, అందులో సభ్యులకు శాస్త్ర పరిజ్ఞానం కూడా లేదన్న విమర్శలు వచ్చాయి. కనీస అవగాహన లేనివారు అధికారులుగా కొనసాగుతున్నారని, ప్రభుత్వం వారి నివేదికలపై ఆధారపడి తప్పు ఒప్పులను నిర్ణయిస్తున్నదని ‘సైంటిస్ట్స్‌ ఫర్‌ ది పీపుల్‌’ అనే సంస్థ ఆరోపించింది. ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదంపై హైపవర్‌ కమిటీ సమర్పించిన నివేదికలోనూ లోపాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో క్రేన్‌ ప్రమాదంపై విచారణకు సరైన అను భవం, సాధికారత ఉన్న వారిని నియమించకపోవడం అను మానాలకు తావిస్తున్నది. విచారణ కమిటీలో తప్పనిసరిగా క్రేన్లతో పనిచేసిన అనుభవం ఉన్నవారు వుండాలి. విశాఖపట్నం పోర్టు, కంటెయినర్‌ టెర్మినళ్లలో ఇలాంటి క్రేన్లు ఉన్నాయి. వాటిని నిర్వహిస్తున్న అధికారులు ఉన్నారు. వారిలో ఒక్కరినైనా ఈ కమిటీలో నియమిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు.


విచారణ ఎలా?

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానిపై ప్రభుత్వ విచారణ ఉంటుందని భావిస్తే... అక్కడి ఆధారాలు చెరిగిపోకుండా ఆ పరిసరాలను మూసేస్తారు. ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. విచారణ పూర్తయ్యేంతవరకు చిన్న వస్తువును కూడా అక్కడి నుంచి తీయరు. కానీ క్రేన్‌ ప్రమాదంలో విచారణ మొదలు కాక ముందే క్రేన్‌ శకలాలను తొలగించేస్తున్నారు. ఆధారాలు లేకుండా విచారణ ఎలా చేపడ తారు? నిజాలు ఎలా బయటకు వస్తాయి? అన్న ప్రశ్నలకు అధికారులే సమాధానాలు చెప్పాలి. షిప్‌యార్డు నుంచి వేసిన కమిటీ.... ఆ యాజమాన్య లోపాలను బయటపెట్టే అవకాశం లేదు. పైగా షిప్‌యార్డు ఛైర్మన్‌ శరత్‌బాబు తెచ్చిన ఒత్తిడి వల్లే ఆపరేషన్స్‌ విభాగం... సుమారు ఏడేళ్లుగా పక్కనున్న ఈ క్రేన్‌ను ఆపరేషన్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నించిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌.నరసింగరావు ఆరోపించారు. ఈ క్రేన్‌ను 2013లోనే అనుపమ్‌ కంపెనీ తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు. క్రేన్‌ దుర్ఘటనపై కేంద్ర హోమ్‌ శాఖ స్పందించి, సుప్రీమ్‌ కోర్టు న్యాయమూర్తితో విచారణ చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 


కమిటీ దృష్టి సారించాల్సిన అంశాలు

ప్రమాదానికి దారితీసిన కారణాలు, సమయం, ప్రాంతం.

క్రేన్‌లో ఎలక్ట్రికల్‌, ఎలక్ర్టో మెకానికల్‌, స్ట్రక్చరల్‌, ఇంజనీరింగ్‌ లోపాలు.

మానవ తప్పిదాలు.

ట్రయల్‌ రన్‌ నిర్వహించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు.

షిప్‌యార్డు పర్యవేక్షణలో లోపాలు.

సాంకేతికపరమైన లోపాలు.... ఇతర కారణాలు ఏమైనా ఉంటే అవి కూడా...


వారం రోజుల్లో నివేదిక

ప్రమాదం ఈ నెల ఒకటో తేదీన జరగ్గా అదే రోజు కమిటీని వేస్తూ కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సూచనలు చేయాలని కమిటీని కోరారు. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Updated Date - 2020-08-04T17:39:25+05:30 IST