Abn logo
Apr 2 2020 @ 03:43AM

అధికార పార్టీలో అన‘కొండ’లు!

  • విశాఖ జిల్లాలో గ్రావెల్‌ దందా
  • యలమంచిలి నియోజకవర్గంలో కొండలే ఫలహారం
  • భూముల చదునుకు డి.పట్టాదారుల చేతే దరఖాస్తు
  • ఆనక మరో సంస్థ ద్వారా తవ్వకాలు
  • రోజుకు 350 లారీల గ్రావెల్‌ తరలింపు
  • ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి
  • జీడి తోటల మధ్య భారీ రహదారి
  • పంట దెబ్బతింటున్నా నోరుమెదపని రైతులు
  • పట్టించుకోని గనుల శాఖ అధికారులు


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు కొండలనే కొల్లగొట్టేస్తున్నారు. బినామీల పేరుతో లీజులు తీసుకుని లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తవ్వుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో భారీ నిర్మాణాలు చేపడుతున్న బార్క్‌, అచ్యుతాపురం సెజ్‌ అవసరాలకు భారీగా గ్రావెల్‌ అవసరం కావడం వీరికి కలిసొచ్చింది. క్వారీ నుంచి బార్క్‌కు జీడితోటల మధ్య పొడవైన మట్టి రహదారిని సైతం నిర్మించుకున్నారు. తెరవెనుక అధికార పార్టీ నేతలు ఉండడంతో రైతులు నోరెత్తలేకున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.


లోతట్టు ప్రాంతాల్లో డంపింగ్‌...

అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌), సెజ్‌ ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలను కప్పడానికి పెద్దఎత్తున గ్రావెల్‌ అవసరం పడింది. ఈ నేపథ్యంలో అచ్యుతాపురం మండలం నునపర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని నడింపల్లికి ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. ఆ ప్రాంతంలో చాలాకాలం క్రితం పేదలకు పట్టాలు ఇచ్చారు. వారంతా జీడితోటలు సాగు చేసుకుంటున్నారు. అక్కడ మేలురకం గ్రావెల్‌ ఉందని గుర్తించిన వైసీపీ నేతలు.. వారిపై ఒత్తిడి తెచ్చారు. దొప్పెర్ల మాజీ ప్రజా ప్రతినిధి, దోసూరు పంచాయతీ రావిపాలేనికి చెందిన మరో వ్యక్తి మధ్యవర్తులుగా వ్యవహరించి జీడితోటల రైతులతో ఒప్పందం చేసుకున్నారు. కొండవాలులో సుమారు 30 ఎకరాలు వ్యవసాయానికి అనువుగా లేదని, ఎత్తుపల్లాలుగా ఉన్న ఆ ప్రాంతాన్ని చదును చేయడానికి విశాఖ నగరానికి చెందిన పీజేఆర్‌ అనే సంస్థకు లీజుకు ఇచ్చుకుంటామని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేయించారు. దీని వెనుక ఉన్నది అధికార పార్టీ నేతలు కావడంతో రెవెన్యూ, గనుల శాఖ అధికారులు నడింపల్లిలో సర్వే నంబర్‌ 89/1,2లో 1.315 హెక్టార్లు, సర్వే నంబరు 86, 88లలో 2.352 హెక్టార్లు, సర్వే నంబరు 90లో 1.35 హెక్టార్లు, సర్వే నంబరు 87లో 1.21 హెక్టార్లలో గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతి ఇచ్చేశారు. 


ఒక్కొక్క సర్వే నంబర్‌లో 50 నుంచి 60 వేల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తరలించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడు నెలల పాటు తాత్కాలిక పర్మిట్‌ లభించింది. కేవలం రెండు నెలల కాలంలోనే కొండవాలులో లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తరలించేశారు. గ్రావెల్‌ తరలించడానికి సుమా రు 60 టిప్పర్లు వినియోగించారు. ఒక్కోటిప్పర్‌ 30 టన్నుల చొప్పున రోజుకు ఐదు ట్రిప్పులు వేసింది. అయితే కాంట్రాక్టర్‌ ఇచ్చిన లెక్కల మేరకు మాత్రమే  సీనరేజీ వసూలుచేశారు. దీనివల్ల ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లింది. వెంకటాపురం నుంచి ధారబోగాపురం వరకు కొండవాలు ప్రాంతంలో క్వారీల నుంచి కూడా గ్రావెల్‌ తవ్వి భారీగా తరలిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ కొండను ఆనుకుని కొందరు రెండు లే అవుట్లువేశారు. పనిలో పనిగా కొండను కొంతమేర ఆక్రమించుకున్నారు. కొండను తొలిచి చదును చేసి లేఅవుట్‌ వేసినా ఎవరూ పల్లెత్తు మాటనడం లేదు. నడింపల్లి, ధారభోగాపురం, వెంకటాపురం కొండల నుంచి గ్రావెల్‌ను సెజ్‌ పునరావాస కాలనీ మీదుగా రేయింబవళ్లు సుమారు 300 నుంచి 350 లారీలతో తీసుకుపోతున్నారు. దీంతో సెజ్‌ పునరావాస కాలనీలో రోడ్లన్నీ పూర్తిగా పాడైపోయాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రావెల్‌ తవ్వకాలు ఆగాయి.


గ్రావెల్‌ తరలింపునకు అనుమతి

తవ్వకాల కోసం పీజేఆర్‌ కంపెనీకి ఫిబ్రవరి నుంచి మూడు నెలలు అంటే ఏప్రిల్‌ నెలాఖరు వరకు గడువుంది. ఆ తర్వాత పర్మిట్‌ రద్దవుతుంది. తవ్విన గ్రావెల్‌కు కంపెనీ క్యూబిక్‌ మీటరుకు రూ.60 చెల్లిస్తోంది. అయితే ఇప్పటివరకు ఎంత చెల్లించిందనే వివరాలు కార్యాలయంలో ఉన్నాయి. లాక్‌డౌన్‌ ప్రభావంతో మేమెవరం కార్యాలయానికి వెళ్లడంలేదు.

- వెంకటరావు, ఇన్‌చార్జి ఏడీ, గనుల శాఖ


అప్పుడు వ్యతిరేకం.. ఇప్పుడు అంగీకారం

నడింపల్లిలో గ్రావెల్‌ తవ్వడానికి మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) దరఖాస్తు చేసింది. ఆ మేరకు గ్రావెల్‌ తవ్వకాల కోసం వెళితే గ్రామస్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పి ప్రజాప్రతినిధులు అంగీకరించలేదు. దాంతో సంస్థ వెనక్కి తగ్గింది. ప్రభుత్వం మారడంతో అధికార పార్టీ నేతలు నడింపల్లి కొండపై కన్నేసి, అనుమతులు తెచ్చుకుని యథేచ్ఛగా తవ్వుకుంటున్నారు.


రైతుల నోట్లో మట్టి...

గ్రావెల్‌ను తరలించడానికి మార్గం లేకపోవడంతో నడింపల్లి నుంచి బార్క్‌ రోడ్డు వరకు మధ్యలో దొప్పెర్ల మీదుగా మూడు కిలోమీటర్ల పొడవున రహదారి నిర్మించారు. గతంలో ఉన్న చిన్నపాటి రహదారిని లారీలు వెళ్లేలా 40 అడుగుల వెడల్పుతో వేశారు. ఈ రహదారి నిర్మాణం సందర్భంగా జీడితోటలు కొంతవరకు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం గ్రావెల్‌తో రోజూ లారీలు తిరుగుతుండడంతో చెట్లు ఎర్రమట్టితో నిండిపోవడంతో పంటపై ప్రభావం పడింది. పరిహారం కింద కొంత మొత్తం ఇచ్చినా రైతులకు వాటిల్లుతున్న నష్టం ఎంతో ఎక్కువగా ఉంది.


భూముల చదును కోసం లీజుకిచ్చారు

నడింపల్లిలో ఐదారు సర్వే నంబర్లలో తవ్వకాలకు డి.ఫారం రైతుల నుంచి దరఖాస్తు వచ్చింది. ఇచ్చిన భూములు వ్యవసాయానికి అనువుగా లేవని, చదును చేయడానికి ఇతరులకు లీజుకు ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దానిని పరిశీలించి ఆమోదించాం. భూములు చదునుచేసిన తరువాత సదరు భూములను రైతులకు అందజేయాల్సి ఉంటుంది.

- టి.నారాయణరావు, తహశీల్దారు, అచ్యుతాపురం

Advertisement
Advertisement
Advertisement