సమాన భావన కోసమే రన్‌ ఫర్‌ యూనిటీ

ABN , First Publish Date - 2020-10-28T06:49:06+05:30 IST

దేశ భద్రత, అంతర్గత భద్రత, ప్రజల ఆస్తి, ప్రాణ నష్ట నివారణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది.

సమాన భావన కోసమే రన్‌ ఫర్‌ యూనిటీ
సర్పవరంలో రన్‌ దృశ్యం

  • ఎస్పీ నయీం అస్మీ
  • పోలీసు అమరవీరుల సంస్మరణ  వారోత్సవాల్లో భాగంగా పరుగు

సర్పవరం జంక్షన్‌, కాకినాడ క్రైం, అక్టోబరు 27: దేశ భద్రత, అంతర్గత భద్రత, ప్రజల ఆస్తి, ప్రాణ నష్ట నివారణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది.  దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబాలకు మేము అండగా ఉన్నామనే మనోధైర్యాన్ని కల్పించడంతోపాటు సిబ్బందిని, ప్రజలందర్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి అందరూ సమానమనే భావన కల్పించడం కోసమే ‘రన్‌ ఫర్‌ యూనిటీ’ కార్యక్రమమని  జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ పేర్కొన్నారు. పోలీసు అమరువీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సర్పవరం జంక్షన్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అమరులైన వారిని స్మరించుకుంటూ అక్టోబరు 21 నుంచి 31 వరకు వివిధ కార్యక్రమాలను పోలీసులు నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో భాగమే పరుగు కార్యక్రమమని, ఆరోగ్యవంతమెన సమాజం కోసం ప్రతీ ఒక్కరూ ఉదయాన్నే నడక, పరుగు చేయడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాణత్యాగం చేసిన అమరవీరులు, కొవిడ్‌తో మృతి చెందిన కుటుంబాల ఇళ్లకు వెళ్లి ఓదార్చి, వారి సంక్షేమం కోసం కృషి చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ గరుడ సుమిత్‌ మాట్లాడుతూ ఉదయాన్నే అందరూ కొద్దిసేపు వాకింగ్‌, రన్నింగ్‌ చేయడం ద్వారా ఆరోగ్యంగా జీవించగలుగుతారన్నారు. సర్పవరం జంక్షన్‌ వద్ద ప్రారంభమైన ఈ పరుగు కార్యక్రమం భానుగుడి వరకు సాగి, అక్కడ నుంచి జిల్లా పోలీసు కార్యాలయానికి చేరింది. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీలు కరణంకుమార్‌, వీఎస్‌ ప్రభాకరరావు, డీఎస్పీ వీ. భీమారావు, ఎస్‌బీ డీఎస్పీలు అంబికా ప్రసాద్‌, ట్రాఫిక్‌ డీఎస్పీ రామకృష్ణ, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది, శ్యామ్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులు పాల్గొన్నారు. 






Updated Date - 2020-10-28T06:49:06+05:30 IST