రూ.50 వేలలోపు రుణ మాఫీ

ABN , First Publish Date - 2021-08-02T07:01:45+05:30 IST

రైతుల పంట రుణాల మాఫీపై సర్కారు ఎట్టకేలకు కదిలింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఇప్పటిదాకా రూ.25 వేల లోపు పంట రుణాలను మాఫీ..

రూ.50 వేలలోపు రుణ మాఫీ

ఈ నెల 15 నుంచి అమలు.. నెలాఖరులోపు పూర్తి

6.13 లక్షల మందికి లబ్ధి.. రూ.1850 కోట్ల ఖర్చు

అనాథలకు అండగా నిలవాలని ప్రభుత్వ నిర్ణయం

విధాన రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం

ఈడబ్ల్యూఎస్‌ కోటాకు ఆదాయ పరిమితి రూ.8 లక్షలు

ఈ కోటాలో ఉద్యోగ నియామకాలకు ఐదేళ్ల సడలింపు 

కేబినెట్‌ భేటీలో నిర్ణయాలు.. సుదీర్ఘంగా సమావేశం 

పత్తిసాగు విస్తీర్ణం పెంచడంపై ప్రత్యేక దృష్టి

నేడు హాలియాకు సీఎం కేసీఆర్‌

సాగర్‌ ఉప ఎన్నిక హామీల ప్రగతిపై సమీక్ష


హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రైతుల పంట రుణాల మాఫీపై సర్కారు ఎట్టకేలకు కదిలింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఇప్పటిదాకా రూ.25 వేల లోపు పంట రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం.. దానికి కొనసాగింపుగా రూ.50 వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకూ రుణమాఫీ ప్రక్రియను కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. ఆదివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సుదీర్ఘంగా సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆరు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో పలు శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థికశాఖ ఈ సందర్భంగా కేబినెట్‌ ముందు ఉంచింది.


రూ.25 వేల లోపు రుణాల మాఫీతో రాష్ట్రంలో 3 లక్షల మందికి పైగా రైతులు ప్రయోజనం పొందారని, రూ.50 వేల వరకు మాఫీతో మరో 6 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతారని పేర్కొంది. దీంతో రుణమాఫీ ద్వారా ప్రయోజనం పొందనున్న రైతుల సంఖ్య 9 లక్షలకు చేరుకోనుందని ఆర్థికశాఖ వెల్లడించింది. కాగా, వ్యవసాయంపై చర్చలో భాగంగా వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర అంశాలను మంత్రివర్గం సమీక్షించింది. పత్తిసాగుపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా ఉన్న ప్రత్యేక డిమాండ్‌ వల్ల ఆ పంట సాగును మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను కేబినెట్‌ ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య పంటలకు అనువైన ప్రాంతాలను గుర్తించి.. లాభసాటి పంటల సాగును మరింత ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఇందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని నిర్దేశించింది. 


సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు.. ‘టిమ్స్‌’

ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉన్న టిమ్స్‌ ఆస్పత్రితోపాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు కూడా ‘‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)’’గా నామకరణం చేయాలని కేబినెట్‌ తీర్మానించింది. టిమ్స్‌ గచ్చిబౌలి, టిమ్స్‌ సనత్‌నగర్‌, టిమ్స్‌ ఎల్బీనగర్‌, టిమ్స్‌ అల్వాల్‌ దవాఖానాలుగా అభివృద్ధి చేసి.. అన్నిరకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలనూ ఒకేచోట అందించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ఆస్పత్రుల సత్వర నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలు, పురోగతిపైనా చర్చించింది. త్వరలోనే వీటి నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ఆదేశించింది. వరంగల్‌లో ఇప్పటికే మంజూరు చేసిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పురోగతిపై చర్చించిన కేబినెట్‌.. త్వరలో నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. పటాన్‌చెరులో కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని కేబినెట్‌ మంజూరు చేసింది. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఏడు మెడికల్‌ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై కేబినెట్‌ చర్చించింది. ఇందుకు నిర్మాణాలను చేపట్టాలని, వసతులను సత్వరమే ఏర్పాటు చేయాలని రోడ్లు, భవనాల శాఖను ఆదేశించింది. హైదరాబాద్‌లోని నిమ్స్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి.. వచ్చే కేబినెట్‌ సమావేశానికి తీసుకురావాలని వైద్యాధికారులను ఆదేశించింది. భవిష్యత్తులో అనుమతించబోయే మెడికల్‌ కాలేజీల కొరకు స్థలాన్వేషణ, సౌకర్యాల రూపకల్పనకు ముందస్తు చర్యలను ఇప్పటినుంచే ప్రారంభించాలని నిర్దేశించింది. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ స్థాపన లక్ష్యంగా.. ఇప్పటికీ మెడికల్‌ కాలేజీలు లేని జిల్లాలను గుర్తించి దశలవారీగా ఆయా చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 


ఈడబ్ల్యుఎస్‌ కోటాకు 5 ఏళ్ల సడలింపు

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యుఎస్‌) కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రిజర్వేషన్‌ కోటాపై మంత్రివర్గం చర్చించింది. ఈ కోటాలో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు పొందేందుకు రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు అర్హులుగా తీర్మానించింది. ఈ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిలో 5 సంవత్సరాలు సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది.  కాగా, ప్రపంచంలో, దేశంలో ఉన్న కరోనా పరిస్థితిపైనా రాష్ట్ర మంత్రివర్గం చర్చించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి.. వాక్సినేషన్‌, ఆస్పత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పనపై చర్చించింది. కొన్ని జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉండడంపై వైద్యాధికారులు కేబినెట్‌కు సమాచారం అందించారు. సమస్యాత్మక జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలు, ఆక్సిజన్‌, మందులు, బెడ్లు తదితరాల లభ్యతపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. అన్ని జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించి, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, అన్నిరకాల మందులు, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని వైద్యాధికారులను ఆదేశించింది. సమస్యాత్మక జిల్లాల్లో మరోసారి పర్యటించాలని నిర్దేశించింది. 


అనాథల కోసం సమగ్ర విధానం 

రాష్ట్రంలోని అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన.. విధాన రూపకల్పనకు సంబంధించిన చర్చతోనే మంత్రివర్గ సమావేశాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల పూర్తి వివరాలు తెప్పించాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శిని కేబినెట్‌ ఆదేశించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోవడంతో ఎదిగే వయసులో ఉన్న పిల్లలు మానసిక వేదనతోపాటు సామాజిక వివక్షనూ ఎదుర్కొంటూ సమాజ క్రూరత్వానికి

బలయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కాళ్లపై వారు నిలబడి ప్రయోజకులయ్యే వరకూ ప్రభుత్వమే వారికి ఆశ్రయం కల్పించి అండగా నిలవాలన్నారు. గతంలో అనాథ పిల్లలకు బీసీ హోదాను ఇవ్వడంతోపాటు వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు చేపట్టామని తెలిపారు. అనాథ పిల్లల కోసం సమగ్ర విధానం రూపొందించాలని అన్నారు. ఖాళీగా ఉన్న అనువైన ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి అందులో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. ఇందుకు సంబంధించి కార్యాచరణ కోసం మంత్రి సత్యవతి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఇంద్ర కరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లిని సభ్యులుగా నియమించింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ఆహ్వానితుడిగా ఉంటారు. 

Updated Date - 2021-08-02T07:01:45+05:30 IST