Abn logo
Apr 7 2021 @ 17:11PM

ఆవు కోసం రోడ్డుపై పరుగులు తీసిన పోలీసులు!

జార్జియా: పోలీసులు నేరస్థులను వెంబడించి పట్టుకోవడం గురించిన వార్తలను ఇప్పటి వరకు చాలానే వినుంటాం. ఇటువంటి సంఘటనలను సినిమాల్లో కూడా చూసుంటాం. కానీ వీటికి భిన్నంగా అమెరికాలో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఆవును పట్టుకోవడానికి పోలీసులు రోడ్డుపై పరుగులు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జార్జియాలో ఓ వ్యక్తి.. ట్రక్కులో ఆవులను తరలిస్తుండగా.. అందులోంచి ఓ ఆవు రోడ్డుపై పడిపోయింది. అనంతరం వాహనదారులు ఇబ్బంది పడేలా రోడ్డుపై పరుగులు పెట్టింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతేకాకుండా గంటపాటు ఆ రోడ్డుపై వాహనాలను నిలివేసి.. ఆవును పట్టుకునేందుకు శ్రమించారు. దీంతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. చివరికి ఓ స్థానికుడి సహాయంతో తాడుతో ఆవును బంధించి.. యజమానికి దానిని క్షేమంగా అప్పగించారు. కాగా.. ఈ విషయాన్ని స్వయంగా పోలీసులే ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. 


Advertisement
Advertisement
Advertisement