పారిపోతున్నాను

ABN , First Publish Date - 2020-10-12T06:24:07+05:30 IST

కోపం లేదు కొట్లాట లేదు నేను నేనులా నిటారుగా నిలబడలేక చీలి అనేకానేక నేనులుగా...

పారిపోతున్నాను

కోపం లేదు

కొట్లాట లేదు


నేను నేనులా

నిటారుగా నిలబడలేక చీలి

అనేకానేక నేనులుగా


నేను నా ముందు నిలబడలేక

దూదిపింజలా తేలి

తెల్లారి అద్దంలో

ముఖాన్ని చూసుకునే సరికి పిల్లిలా


అసలు ఏమైంది 

చీకటి చెంగు తగలగానే

రంగులు ఎలా మారాయి


మనమేదో మిడిసి పొగరుతో

అనుకుంటాం కానీ

ఒక్కసారి ఉఫ్‌మని ఊదితే

ఆరిపోయిన దీపంలా


నిజంగా మనం తెల్లారి లేచి

ఎన్నెన్నో పాత్రలుగా 

నిర్జీవిస్తుంటాం నిర్లజ్జగా


నా ముందు నిలబడలేక

నేను క్రమంగా తేలిపోతున్నాను

వాన కురవని తెలిమబ్బులా 


నాలుక ఒకటే

ఎన్ని రకాల మాటలు

బతుకు ఒకటే

ఎన్ని నటనలు ఎన్ని ద్వంద్వాలు


పగలంతా వగలుపోయి

తీరా ఇంటికి వచ్చి

నిలువుటద్దం ముందు నిలబడితే 

నేనులా గాక మేకవన్నె పులిలా 


ప్రశ్న నుంచి ప్రజల నుంచి

బాధల నుంచి దహించే దుఃఖాల నుంచి 

నాది గాని వాచకాన్ని

నలుగురికి అప్పచెపుతున్నాను

ప్రతి పింఛన్‌ దగ్గర బాంఛగా 


నేను నా నుంచి

అందనంతగా కొట్టుకుపోయి

గొంతు ఎండి ఎంతకూ దామారక 

ఏమారిన తుంగలా


ట్యాంక్‌బండ్‌ మీంచి

హుస్సేన్‌సాగర్లోకి లేకిగా దూకేది

రైలు పట్టాల మీద దిక్కులేక తల పెట్టేది

పొలంలో పురుగుమందు తాగి సచ్చేది

నేనే నేనే నేనే నేనే


ఎవరు అన్నదీ లేదు

ఎవరు అడిగిందీ కాదు


నేను నా ముందే కాక 

వేరెవరి ముందు ఎదురు పడలేక

మోకాళ్ళ మీద నిలబడి

ఎన్నో నేనులుగా


చొప్పకట్టె నుంచి

ఇస్తార్లు కుట్టే చీపురు పుల్లలుగా చీలి

గోడమీది ట్యూబ్‌లైట్‌ పక్కన

పొంచిఉన్న నంగనాచి బల్లిలా

జూకంటి జగన్నాథం


Updated Date - 2020-10-12T06:24:07+05:30 IST