టెస్టుల కోసం పరుగులు!

ABN , First Publish Date - 2022-01-18T09:48:57+05:30 IST

రాష్ట్రంలో కరోనా మళ్లీ కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో మహమ్మారి కట్టడికి టెస్టింగ్‌.. ట్రేసింగ్‌..

టెస్టుల కోసం పరుగులు!

  • ఐజీఎం, తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద బారులు 
  • ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్న బాధితులు 
  • టెస్టింగ్‌ కేంద్రాలను పెంచాలని డిమాండ్‌


(ఆంధ్రజ్యోతి-విజయవాడ)  

రాష్ట్రంలో కరోనా మళ్లీ కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో మహమ్మారి కట్టడికి టెస్టింగ్‌.. ట్రేసింగ్‌.. ట్రీట్మెంట్‌ విధానాన్ని అనుసరిస్తూ.. థర్డ్‌వేవ్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఉన్నతాధికారులను ఆదేశించారు. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వపరంగా కొవిడ్‌ పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేక ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. కృష్ణా జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు టెస్టుల విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. వైరస్‌ శరవేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు పరీక్షలు చేయించుకునేందుకు సమీపంలోని పీహెచ్‌లకు వెళుతున్నారు. అక్కడ పరీక్షలు నిర్వహించకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు.


గతంలో విజయవాడ నగరంలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, దండమూడి రాజగోపాల్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియం, గుణదల మేరీమాత ఆలయం వద్ద కూడా కొవిడ్‌ పరీక్షలు చేసేవారు. ఐమాస్క్‌ బస్సుల్లో పనిచేసే కాంట్రాక్టు సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో సెకండ్‌ వేవ్‌ కొనసాగుతుండగానే ఈ బస్సుల్లో టెస్టులు నిలిచిపోయాయి. ప్రస్తుతం తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నప్పటికీ.. సిబ్బంది, ఆర్టీపీసీఆర్‌ కిట్ల కొరత వేధిస్తున్నాయి. దీంతో జనం అసహనంతో వెనుదిరుగుతున్నారు. గత్యంతరం లేక ప్రైవేటు ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రైవేటు ల్యాబ్‌ల్లో ఆర్టీపీసీఆర్‌ టెస్టుకు రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇంత భరించడం పేదలకు కష్టంగా మారింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ కొవిడ్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 


నిర్లక్ష్యానికి నిదర్శనం..

గతేడాది కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో వైద్య సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన మొబైల్‌ పరీక్ష ప్రత్యేక వాహనాలు ప్రస్తుతం విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నిరుపయోగంగా దుమ్ముపట్టి పాడైపోతున్నాయి.


Updated Date - 2022-01-18T09:48:57+05:30 IST