ఐకమత్యంతోనే గ్రామాభివృద్ధి

ABN , First Publish Date - 2021-06-23T06:55:09+05:30 IST

కుల, మతాలు, పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలు ఐకమత్యంగా ముందుకు సాగితే ఏడాదిలోగా వాసాలమర్రి గ్రామాభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. దత్తత గ్రామం తుర్కపల్లి మండలం వాసాలమర్రిని ఆయన మంగళవారం సందర్శించారు. గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసిన అనంతరం గ్రామసభలో ప్రసంగించారు.

ఐకమత్యంతోనే గ్రామాభివృద్ధి
తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌, పాల్గొన్న గ్రామస్థులు

చుట్టూ 100 గ్రామాలు చూసిపోవాలి 

ఈర్ష్యా ద్వేషాలు, స్పర్ధలు లేని ప్రేమ ఉండాలి 

పోలీసు కేసులు ఉండొద్దు, ఉంటే పరిష్కరించుకోవాలి 

ప్రతి ఇంటికీ ప్రభుత్వ లబ్ధి 

దత్తత గ్రామంలో సీఎం కేసీఆర్‌ 

సహపంక్తి భోజనం, గ్రామసభ


యాదాద్రి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి)/తుర్కపల్లి: కుల, మతాలు, పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలు ఐకమత్యంగా ముందుకు సాగితే ఏడాదిలోగా వాసాలమర్రి గ్రామాభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. దత్తత గ్రామం తుర్కపల్లి మండలం వాసాలమర్రిని ఆయన మంగళవారం సందర్శించారు. గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసిన అనంతరం గ్రామసభలో ప్రసంగించారు. ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్థులకు సూచనలు, ప్రణాళికను వివరించారు. చుట్టూ 100గ్రామాలకు వాసాలమర్రి ఆదర్శంగా అభివృద్ధి చెందాలని, అందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందన్నారు. గ్రామస్థులు ఐక్యత, పట్టుదలతో కృషి చేస్తే అభివృద్ధిని సాధించుకోవచ్చన్నారు. గ్రామంలో ఎలాంటి పోలీసు కేసులు ఉండవద్దని, ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. అందుకు కమిషనర్‌, డీసీపీ సహకారం తీసుకోవాలని సూచించారు. గ్రామంలోని ప్రతి ఇంటినీ సర్వే చేసి, వారి ఆర్థిక, సామాజిక స్థితిగతుల లెక్కలు తీయాలన్నారు. దిగువస్థాయిలోని కుటుంబాలను గుర్తించి, వారికి ఏది అవసరమో దాన్ని సమకూర్చి వారి జీవితాలను బాగుచేయాలన్నారు. అందుకు గ్రామస్థులంతా వారికి సహకరించాలన్నారు. గ్రామంలో వ్యాధుల బారినపడిన వారిని గుర్తించి మెరుగైన ఉచిత వైద్యం అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుస్తామి హామీ ఇచ్చారు. పాడిగేదెలు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. గ్రామాభివృద్ధిలో విద్యావంతులు, యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వాసాలమర్రికి మరో 20సార్లు వస్తానని, మున్ముందు ఇలా సభలు పెట్టకుండా ప్రజల మధ్య కూర్చుని మాట్లాడతానన్నారు. గ్రామా న్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్‌ పమేలా సత్పథిని ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నామని ప్రకటించారు. అభివృద్ధి బాధ్యతను సర్పంచ్‌, ఎంపీటీసీ తీసుకోవాలన్నారు. వారికి మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత, జడ్పీ చైర్మన్‌ సందీ్‌పరెడ్డి, జడ్పీటీసీ, ఎంపీపీ సహకరిస్తారని చెప్పారు. ఇక తాను గ్రామస్థుల వెంటనే ఉంటానన్నారు. 

రూ.150కోట్లతో అభివృద్ధి

కరెంటు స్తంభం మొదలు ఏ శాఖాపరంగానైనా అభివృద్ధి చేసుకుందామని, అవసరమైతే రూ.150కోట్ల వరకు ఖర్చు చేద్దామన్నారు. జిల్లాలోని వాసాలమర్రి ఆదర్శంగా అభివృద్ధి చెందితే ఈ వెలుగులు చుట్టూ ఉన్న 400 గ్రామాలకు ప్రసరిస్తాయన్నారు. నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ గ్రామ అభివృద్ధి వందలాది గ్రామాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఎర్రవెల్లిలో మౌలిక సదుపాయాల నమూనాలో వాసాలమర్రిలో అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వాసాలమర్రిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో మిగిలిన 420 పంచాయతీలకు ఒక్కోదానికి రూ.25లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆరు మునిసిపాలిటీల్లో భువనగిరికి రూ.కోటి, మిగిలిన ఐదు మునిసిపాలిటీలు యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, పోచంపల్లి, చౌటుప్పల్‌కు రూ.50లక్షల చొప్పున సీఎం స్పెషల్‌ఫండ్‌ మంజూరు చేస్తానని ప్రకటించారు.


 ఆత్మీయ పలకరింపు

గ్రామసభ, సహపంక్తి భోజనాల నేప థ్యంలో కేసీఆర్‌ పలువురు మహిళలతో మాట్లాడి వారి ఆర్థిక స్థితిగతులు అడిగితెసుకున్నారు. విద్యార్థులు, కొంతమంది గ్రామస్థులు సమస్యలపై వినతి పత్రాలు అందజేయగా, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు జగదీ్‌షరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖరెడ్డి, గాదరి కిషోర్‌, చిరుమర్తి లింగయ్య, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, కలెక్టర్‌ పమేలా సత్పథి, వైస్‌ చైర్మన్‌ బిక్కూ నాయక్‌,  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌, ఎంపీపీ భూక్యా సుశీల, సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.


 గ్రామస్థులతో సహపంక్తి భోజనం

దత్తత గ్రామంలో అభివృద్ధి ప్రణాళికల ను చేపట్టడానికి వాసాలమర్రి పర్యటించి గ్రా మస్థులతో సీఎం మమేకమయ్యారు. ఆయన కు గ్రామశివారులో ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో రామాలయం వద్ద అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అక్కడి నుంచి సభావేదికకు చేరుకుని ప్రాంగణంలోని గ్రామస్థులను భోజనశాలకు తీసుకువెళ్లి వారికి భోజనాలను స్వయంగా వడ్డించారు. 


సీఎం పర్యటనలో భారీ బందోబస్తు 

సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ పర్యవేక్షణలో పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. 750 మంది పోలీసు ఉన్నతాధికారులతో పాటు మరో వెయ్యి మంది వరకు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కాగా, సీఎం పర్యటన ఏర్పాట్లను నాలుగు రోజులుగా జిల్లాని 40 మంది ఉన్నతస్థాయి అధికారులతో పాటు 250 నుంచి 300 వరకు డివిజన్‌, మండలస్థాయి అధికారులు పర్యవేక్షించారు.


రామాలయంలో సీఎం పూజలు 

సీఎం కేసీఆర్‌ వాసాలమర్రి పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం చేరుకోగానే ముందుగా గ్రామంలోని రామాలయం దగ్గరకు రాగానే కాన్వాయ్‌ దిగి ఆలయంలోకి ప్రవేశించారు. మర్కూక్‌ బావానందాస్వామి ఆశ్రమం పీఠాధిపతి సత్యనారాయణశర్మ ఆధ్వర్యంలో ఆలయ పురోహితులు గోపాల్‌శర్మ, మంగేశ్‌శర్మలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని అక్కడి నుంచి గ్రామ సభావేదిక పైకి వెళ్లారు. 


 కొండాపూర్‌లో ఆగిన సీఎం కేసీఆర్‌

వాసాలమర్రి గ్రామసభను ముగించుకొని వెళ్తున్న సీఎం కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం మండలంలోని కొండాపూర్‌ గ్రామంలో గ్రామస్థులను చూసి ఆగారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మల్లేష్‌, గ్రామస్థులతో కలిసి తమ గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ పలు అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2021-06-23T06:55:09+05:30 IST