నత్తనడకన పల్లెప్రగతి పనులు

ABN , First Publish Date - 2021-08-03T04:57:56+05:30 IST

పల్లె ప్రగతిని మరింత పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో అనేక పథకాలను అమలు చేస్తోంది. దాననుగుణంగానే గ్రామ పంచాయతీలకు నెలనెలా నిధు ల మంజూరు, సిబ్బంది నియామకం లాంటి పనుల ను చేపట్టింది.

నత్తనడకన పల్లెప్రగతి పనులు
నేరడిగొండ మండలం వాంకిడిలో కొనసాగుతున్న శ్మశాన వాటిక నిర్మాణ పనులు

నగుబాటుగా మారుతున్న పనుల నాణ్యత

శ్మశాన వాటిక నిర్మాణాల్లో తీవ్ర జాప్యం

అంతిమయాత్రకు తప్పని అవస్థలు

కలెక్టర్‌ హెచ్చరించినా తీరు మార్చుకోని అధికారులు

ఆదిలాబాద్‌, ఆగస్టు2 (ఆంధ్రజ్యోతి): పల్లె ప్రగతిని మరింత పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో అనేక పథకాలను అమలు చేస్తోంది. దాననుగుణంగానే గ్రామ పంచాయతీలకు నెలనెలా నిధు ల మంజూరు, సిబ్బంది నియామకం లాంటి పనుల ను చేపట్టింది. ప్రధానంగా గ్రామాల్లో హరితహారం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌యార్డు, శ్మశాన వాటికల నిర్మాణం పనులతో పాటు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిని సారిస్తోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా కొన్ని గ్రామాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. ఏళ్ల తరబడి ప్రగతి పనులు పడుతూ లేస్తునే కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యటనల సమయంలోనే పనులు చేపడుతున్నా.. ఆ తర్వాత అంతా మామూలుగానే మారిపోతుంది. జిల్లాలోని 15 మండ లాలకు ప్రత్యేకాధికారులను నియమించి పనుల పర్యవేక్షన బాధ్యతను అప్పగించిన ఫలితం కనిపించడం లేదు. అదనపు కలెక్టర్‌తో పాటు ప్రత్యేకాధికారులు ప్ర గతి పనులను పూర్తి చేయించడంలో విఫలమవుతూ నే ఉన్నారు. దీనికి తోడు కొందరు సర్పంచ్‌ల నిర్లక్ష్యం, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, అధికారుల అలసత్వం, అభివృద్ధి పనుల్లో పర్సంటేజిలు, ప్రగతి పనులకు ఆటంకంగా మారుతున్నాయి. జిల్లాలో 468 గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికల నిర్మాణం చేపడుతున్నా ఇప్పటికి పూర్తి కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. ఇప్పటి వరకు 450కి పైగా శ్మశాన వాటికలు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం 424 వరకే పూర్తయినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్‌, డీఆర్డీఏ అధికారుల లెక్కలకు ఏ మాత్రం పొంతన లేకుండానే పోయింది. ఇప్పటికే పనుల పూర్తిపై పలుమార్లు డెడ్‌లైన్‌ పెట్టినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. పనుల జాప్యంపై ఇప్పటికే ఒకరిద్దరు సర్పంచ్‌లు, కార్యదర్శులపై చర్యలు తీసుకొని మరికొంత మంది సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులనుజారీ చేశారు. అయినా గ్రామాల్లో కదలిక కనిపించడం లేదు. గ్రామస్థాయిలో ఉన్నతాధికారులు పర్యటించి మరింత కఠినంగా వ్యవహరిస్తేనే ప్రగృతి పనులు ముందుకు సాగే అవకాశం ఉంటుంది.

  హెచ్చరికలు బేఖాతరు..

2018 కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామాల్లో ప్రగతి పనులను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ఆదేశించడంతో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ పలుమార్లు అధికారులను హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినా పనితీరులో మార్పు కనిపించడమే లేదు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో పరిస్థితులు మరీ అధ్వానంగా కనిపిస్తున్నాయి. అధికారులు వారానికి ఒక్కసారి ఇలా వెళ్లి అలా తిరిగి వస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని మండలాలకు ఇన్‌చార్జి అధికారులే కొనసాగడంతో పనుల్లో వేగం కనిపించడంలేదు. మండల స్థాయి అధికారులు మండల కేంద్రాల్లో గ్రా మ స్థాయి అధికారులు స్థానికంగానే ఉండాలని ఆదేశాలు జారీ చేసినా అది మున్నాళ్ల ముచ్చటగానే మారి పోయింది. జిల్లాలో మండల కేంద్రాలతో పాటు గ్రామాలోను ఏ ఒక్క అధికారి స్థానికంగా ఉండడం లేదు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి అంటే తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడా ప్రజల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి పనులు ముందుకు సాగినట్లు కనిపించడమే లేదు.

చిమ్మ చీకట్లోనే అంత్యక్రియలు..

జిల్లాలో అక్కడక్కడ కొన్ని శ్మశాన వాటికలకు మాత్రమే విద్యుత్‌ సౌకర్యం ఉన్నా సుమారుగా 400 లకు పైగా శ్మశానాలకు ఇప్పటి వరకు కరెంట్‌ సరఫరా లేదు. అనుకోకుండా రాత్రి వేళల్లో అంత్యక్రియలు చేయాల్సి వస్తే అవస్థలే పడాల్సి వస్తోంది. కనీసం శ్మశానానికి వెళ్లేందుకైనా సరైన రోడ్డు మార్గం లేదు. అసలే వర్షాకాలం కావడంతో అడుగు తీసి అడుగు వేస్తే బురదమయంగానే కనిపిస్తోంది. కొన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలకు పంట చేన్లలో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం పంటలు వేయడంతో తరచూ వివాదాలకు దారి తీస్తోంది. శ్మశానంలో పిచ్చిమొక్కలు పెరిగి పోయి అధ్వానంగా కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో స్మార్ట్‌ ఫోన్‌ల సహకారంతోనే అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ గుడిహత్నూర్‌ మండలం బెల్లూరి గ్రామంలో శ్మశాన వాటిక పనులను పరిశీలించేందుకు ఎన్నో ఇబ్బందులు పడి వెళ్లాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులే జిల్లాలో మరెన్నో గ్రామాల్లో కనిపిస్తున్నాయి.

నాణ్యత కరువు..

గ్రామాల్లో కొనసాగుతున్న ప్రగతి పనుల్లో ఏ మాత్రం నాణ్యత లేకుండానే పోతోంది. పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన పనులు నిర్మాణం పూర్తయిన నెలల వ్యవధిలోనే నేలమట్టమవుతున్నాయి. పనుల్లో నాణ్యత లేక పోవడంతో బీటలు వారీ కనిపిస్తున్నాయి. పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌, ఉపాధి హామీ అధికారులు ప్రగతి పనులను పరిశీలించకుండానే సర్పంచ్‌లు చెప్పినట్లుగా బిల్లులు ముట్టచెబుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఏదో పనులు చేశామా, వదిలేశామా అన్న తీరుతో అధికారులు కనిపిస్తున్నారు. జిల్లాలో చేపట్టిన పల్లె ప్రగతి పనుల నాణ్యతపై ఉన్నతాధికారులతో విచారణ జరిపిస్తే అధికారుల నిర్లక్ష్యం బయట పడే అవకాశం ఉంది. ఉదాహారణకు  నేరడిగొండ మండలం వాంకిడి గ్రామ పంచాయతీ శ్మశాన వాటిక వద్ద స్నానగదులు నిర్మించి ఉపయోగంలోకి రాక ముందే ఇటీవల కురిసిన వర్షాలకు నేలమట్టమైంది. ఇలాంటి పరిస్థితులే జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్నాయి.

Updated Date - 2021-08-03T04:57:56+05:30 IST