ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-05-06T06:26:54+05:30 IST

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
ఉయ్యూరు సీబీఎం హాస్పిటల్‌ వద్ద వ్యాక్సిన్‌ కోసం వేచి ఉన్న మహిళలు, పురుషులు

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, మే 5 : గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాక్సిన్‌ పట్ల అనుమానాలు లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయిం చుకోవాలని వైద్యాధికారి మంజూష సూచించారు. బాపుల పాడు మండలంలోని వీరవల్లి ఆరోగ్య కేంద్ర పరిధిలో 98 మందికి, బాపులపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 310 మందికి బుధవారం కోవిషీల్డ్‌ రెండవ డోసు పంపిణీ చేశారు. ప్రజలు వ్యాక్సిన్‌ కోసం బారులు తీరడంతో త్వరితగతిన వ్యాక్సిన్‌ అందించేందుకు రెండు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నియమావళి పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లక్షణాలు కనబడిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో గాని, ఆరోగ్య కార్యకర్తకు గాని, సచివాలయంలో గాని తక్షణం తెలియ జేయాలని, కోవిడ్‌ నిర్ధారణ పరీక్షానంతరం ఫలితం వచ్చే వరకూ హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడుతూ తగిన విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్‌ మంజూష,  శిరీషలు సూచించారు. మొదటిడోసు కోసం ప్రజల నిరీక్షణ ఈ విడత కూడా ఫలించలేదని తిరిగి వెళ్లిపోతున్న కొందరు  వాపోయారు. 45 సంవత్సరాల పైబడిన వారికి మొదటి డోసుకూడా అందించాలని ప్రజలు కోరుతు న్నారు. ప్రభుత్వం ఇచ్చే వ్యాక్సిన్‌ కేంద్రాలకు చేరే వరకూ కూడా ఎంత మందికి, ఎప్పుడు, ఎక్కడ వేస్తారనేది తెలియడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

202 మందికి రెండో డోస్‌

ఉంగుటూరు : మండలంలోని పెదఅవుటపల్లి, ఉంగు టూరు, ఇందుపల్లి పీహెచ్‌సీల్లో బుధవారం 45 ఏళ్లు పైబడిన 202మందికి రెండవ విడత కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు ఆయా పీహెచ్‌సీల వైద్యాధికారులు డాక్టర్‌ బి,శిరీష, డాక్టర్‌ కె.వాణి, డాక్టర్‌ వి.సుబ్బారావు తెలిపారు. పెదఅవుటపల్లిలో 88మందికి, ఉంగుటూరులో 70మందికి, ఇందుపల్లిలో 44మందికి మొత్తం 202మందికి వ్యాక్సిన్‌ వేశామన్నారు. మండలంలో రోజురోజుకీ కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయని, తాజాగా  మరో ఆరుగురు కరోనా బారిన పడ్డారని తెలిపారు. పొట్టిపాడులో ముగ్గురు, తేలప్రోలులో ఇద్దరు, మానికొండలో ఒకరికి కరోనా సోకిందని చెప్పారు. కరోనా వైరస్‌ పట్ల అలసత్వాన్ని వీడి, అవగాహన పెంపొందించుకోవాలన్నారు. మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వాడటం, భౌతికదూరం పాటించడం లాంటి స్వీయ నియంత్రణ పద్ధతుల ద్వారానే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే అశ్రద్ధ చేయక కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు.

ఉయ్యూరులో 750 మందికి  

ఉయ్యూరు  : ఉయ్యూరు, మండల పరిధిలో  బుధవారం 750 మందికి కరోనా రెండవ విడత వ్యాక్సిన్‌ వేశారు. ఉయ్యూరులో సీబీఎం హాస్పిటల్‌, శ్రీనివాసా కళాశాల, వార్డు సచివాలయం, కాటూరు, చినఓగిరాలలో వ్యాక్సిన్‌ వేశారు. వ్యాక్సిన్‌ కోసం ఎండను  సైతం లెక్క చేయక వేచి ఉన్నారు. కాగా మొదటి విడత వ్యాక్సిన్‌ వేయాలని డిమాం డ్‌ చేస్తూ ఉయ్యూరు పట్టణంలో కొందరు వార్డు కౌన్సిలర్లు, తమ బంధువులు, తెలిసిన వారి కోసం నగర పంచాయతీ అధికారులు, ఉద్యోగులు వైద్య, ఆరోగ్య సిబ్బందిపై ఒత్తిడి  తెచ్చారు. 

Updated Date - 2021-05-06T06:26:54+05:30 IST