భారత్, పాక్‌లతో స్వతంత్ర సంబంధాలు : రష్యా

ABN , First Publish Date - 2021-04-14T23:04:29+05:30 IST

భారత్, పాకిస్థాన్‌లతో తమకు స్వతంత్ర సంబంధాలు ఉన్నాయని రష్యా పేర్కొంది. పాకిస్థాన్‌కు

భారత్, పాక్‌లతో స్వతంత్ర సంబంధాలు : రష్యా

న్యూఢిల్లీ : భారత్, పాకిస్థాన్‌లతో తమకు స్వతంత్ర సంబంధాలు ఉన్నాయని రష్యా పేర్కొంది. పాకిస్థాన్‌కు అందజేస్తున్న సైనిక సహకారం కేవలం ఉగ్రవాదంపై పోరాటానికి మాత్రమే పరిమితమని తెలిపింది. భారత దేశంతో కుదిరిన అన్ని ఆయుధ ఒప్పందాలను పూర్తిగా నెరవేర్చుతామని స్పష్టం చేసింది.


న్యూఢిల్లీలో రష్యా రాయబారులు నికొలాయ్ కుదషెవ్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బబుష్కిన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ భారత్, పాక్‌లతో రష్యాకు స్వతంత్ర సంబంధాలు ఉన్నాయన్నారు. పాకిస్థాన్‌కు అందజేస్తున్న సైనిక సహకారం కేవలం ఉగ్రవాదంపై పోరాటానికి మాత్రమే పరిమితమని తెలిపారు. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సహా భారత దేశంతో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను పూర్తి చేసేందుకు రష్యా కట్టుబడి ఉందన్నారు. అమెరికా ఆంక్షలు విధిస్తుందనే భయాందోళన ఉన్నప్పటికీ భారత్‌తో ఒప్పందాలను నెరవేరుస్తుందన్నారు.


క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డయలాగ్ (క్వాడ్), ఇండో-పసిఫిక్ కాన్సెప్ట్‌పై ఈ దౌత్యవేత్తలిద్దరూ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంనాటి పరిస్థితులను మళ్ళీ తీసుకురావాలన్నదే పాశ్చాత్య దేశాల వ్యూహమని కుదషెవ్ ఆరోపించారు. బబుష్కిన్ మాట్లాడుతూ, పాకిస్థాన్‌కు సంబంధించినంత వరకు రష్యా, భారత దేశం మధ్య భేదాభిప్రాయాలు, అపార్థాలు ఉన్నాయనుకోవడంలో అర్థం లేదన్నారు. భారత్, పాక్‌లతో రష్యాకు స్వతంత్ర సంబంధాలు ఉన్నాయని చెప్పారు. యోగ్యతల ఆధారంగానే సంబంధాలు ఉంటాయన్నారు. భారత దేశం రష్యాకు విశ్వసనీయ భాగస్వామి అని తెలిపారు. 


రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవరోవ్ ఇటీవల న్యూఢిల్లీలో పర్యటేంచారు. ఈ ఏడాది జూన్ తర్వాత భారత్-రష్యా వార్షిక సదస్సు ఏర్పాటుకు సన్నాహాలు చేయడం కోసం లవరోవ్ వచ్చారు. లవరోవ్ ఇక్కడి నుంచి పాకిస్థాన్ వెళ్ళారు. 


Updated Date - 2021-04-14T23:04:29+05:30 IST