Abn logo
Aug 13 2020 @ 02:07AM

రష్యా సంజీవని!

ప్రచ్ఛన్నయుద్ధకాలంలో, 1957లో అంతరిక్షంలో ప్రవేశించిన తొట్టతొలి కృత్రిమ ఉపగ్రహానికి మాజీ సోవియట్‌ యూనియన్‌ పెట్టిన పేరు స్పుత్నిక్‌. అది మూడునెలలు మాత్రమే రివ్వున తిరిగినా, రోదసీ పరిశోధనలో ఓ మహాద్భుత ఘట్టం. అరవైమూడేళ్ళ తరువాత అదే పేరుతో రష్యా కరోనా వాక్సిన్‌ తేవడం ‘వాక్సిన్‌ వార్‌’ లో తనదే పైచేయని చాటుకోవడంగా కొందరికి ఆగ్రహం కలుగుతోంది. కరోనా మహమ్మారితో యావత్‌ ప్రపంచమూ ఆర్థికంగా పతనమై, లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఒక కొత్త వాక్సిన్‌ వచ్చినప్పుడు అభినందలకంటే విమర్శలే ఎక్కువ వెల్లువెత్తడం విచిత్రం. శాస్త్రీయ కోణంలో ఆ వాక్సిన్‌ను బేరీజు వేయవలసిందే, సమర్థతను ప్రశ్నించవలసిందే. కానీ, ఇప్పుడు జరుగుతున్నది రష్యా ఇంత త్వరితగతిన వాక్సిన్‌ ఎలా తయారుచేసిందన్న వాదన మీద. ఒక వాక్సిన్‌ తయారీలో సాంప్రదాయికంగా పాటించాల్సిన దశల్లో, చివరిదశ పూర్తికాకుండానే విజయాన్ని ఎలా చాటుకుంటారని. 


రష్యా తన పనితాను చేసుకుపోతున్నది. నేనే ఫస్ట్‌ అని ప్రకటించిన చాలా దేశాలు మొదటి రెండు దశల్లో ఉండగానే, రష్యా అధ్యక్షుడు మంగళవారం తమ వాక్సిన్‌ని ప్రజావినియోగానికి వీలుగా రిజిస్టర్‌ చేసినట్టు ప్రకటించారు. తయారీలో అనుసరించాల్సిన అన్ని ప్రమాణాలు, పరీక్షలు విజయవంతంగా దాటిన తరువాతే దీనిని ఆమోదించామన్నారు. తమ వాక్సిన్‌ ఎంతో సురక్షితమంటూ ఆయన చేసిన వాదనలను అటుంచితే, పుతిన్‌ కుమార్తెల్లో ఒకరు ఆ వాక్సిన్‌ వేసుకున్నారన్న ప్రకటన విశేషమైనది. స్వయంగా వైద్యురాలైన ఆమె వైద్యరంగంలో పరిశోధనలకు సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరిస్తారని పేరు. రెండు వేర్వేరు పదార్థాలను ఇంజక్షన్‌ ద్వారా ఇచ్చిన ఈ టీకా ఆమెలో వ్యాధిని నియంత్రించగలిగే స్థాయిలో రోగనిరోధకతను పెంచిందనీ, దుష్ప్రభావాలు చూపలేదనీ పుతిన్‌ ప్రకటించారు. కొత్త కొత్త ప్రయోగాలు, పరీక్షలకు వలంటీర్లుగా సిద్ధపడటం రష్యన్లకు అలవాటే. నిజానికి, ఈ టీకా తయారుచేసిన గమలేయా ఇనిస్టిట్యూట్‌ డైరక్టర్‌ ఇంకా అది ప్రాథమిక దశలో ఉండగానే, కోతులమీద పరీక్షించకముందే ఏప్రిల్‌ నెలలో తనపై ప్రయోగించుకున్నారు. ఆయన సహా మరోవందమంది తోటి పరిశోధకులు ఇప్పటికీ ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా నిక్షేపంగా ఉన్నారు. ఏదైనా ఓ వాక్సిన్‌ రూపకల్పనకు పదేళ్ళకాలం పడుతుందనీ, కనీసం ఐదువందల మిలియన్‌ డాలర్లు ఖర్చవుతుందనీ లెక్క. జనవరిలో కొవిడ్‌–19 వైరస్‌ జెనటిక్‌ కోడ్‌ను చైనా విడుదల చేసిన తరువాత, అన్ని దేశాలూ వాక్సిన్‌ రేసులో పరుగు ప్రారంభించాయి. మహమ్మారినుంచి మానవాళిని సాధ్యమైనంత వేగంగా రక్షించాలి కనుక, గతంలో మాదిరిగా పరిశోధనలూ ప్రయోగాలూ తాపీగా చేస్తే ఊరుకోబోమని ప్రభుత్వాలు తమ వ్యవస్థలను పరుగులు తీయించాయి. ఈ ఫాస్ట్‌ ట్రాక్‌ విధానంలో రష్యా మరింత వేగంగా దూసుకుపోవడం ఇప్పుడు చాలా దేశాలకు నచ్చడం లేదు.


ఈ తరహా ఎడినోవైరస్‌లకు టీకాలు తయారుచేసే విశేషానుభవం, సమర్థమైన వ్యవస్థలు తమ వద్ద ఎప్పటినుంచో ఉన్నాయనీ, అందువల్లే వాక్సిన్‌ తయారీని వేగవంతం చేయగలిగామని రష్యా వాదిస్తోంది. మొదటి రెండు దశలతోనే వాక్సిన్‌ సమర్థతమీద గురికుదిరినట్టుంది, మూడోదశ ప్రయోగాన్నీ, భారీ ఉత్పత్తినీ కలగలపి ముందుకు పోతోంది. రెండేళ్ళపాటు వైరస్‌నుంచి రక్షించగలిగే ఈ టీకాలు వేసుకున్నవారందరినీ నిత్యమూ గమనించేందుకు ఒక యాప్‌ తయారుచేసుకుంది. రష్యా అవసరాలు తీరిన తరువాతే ఎగుమతులని చెబుతున్నా, భారత్‌ సహా ఓ ఇరవై దేశాలు ఇప్పటికే కొనుగోలుకు ఆసక్తి చూపాయని అంటున్నారు. కరోనాను ప్రపంచం నుంచి తుడిచిపెట్టాలంటే వాక్సిన్‌ ఎవరి తయారీ అయినా 20 బిలియన్‌ డోసులు అవసరమని అంచనా. సమర్థతను విశ్వసించడానికి తగిన ఆధారాలు లేవన్న వాదనతో చాలా దేశాలు స్పుత్నిక్‌ను కాదుపొమ్మంటున్నాయి. వాక్సిన్‌ తయారీని దేశ ప్రతిష్ఠతో ముడిపెట్టి పుతిన్‌ ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాడని విమర్శకుల వాదన. రష్యా ఇప్పుడు దెబ్బతిని ఉండవచ్చును కానీ, శాస్త్ర, వైద్య, అంతరిక్షరంగాల్లో అది తన పూర్వావతారంలో సాధించిన ఘనవిజయాలు కాదనలేనివి. పుతిన్‌ వాక్సిన్‌లో పస ఉన్నదీ లేనిదీ, దాని ప్రభావం ఎంతన్నదీ తేలడానికి ఎక్కువ కాలం నిరీక్షించనక్కరలేదు. అంతలోగా దానిమీద ఇంత రాద్ధాంతమూ అక్కరలేదు.

Advertisement
Advertisement
Advertisement