Advertisement
Advertisement
Abn logo
Advertisement

చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్న Russia.. ఛాలెంజ్ అంటూ కనీవినీ ఎరుగని సాహసం.. విస్తుపోతున్న ప్రపంచ దేశాలు..!

ఇంటర్నెట్ డెస్క్: సినిమా షూటింగ్‌లు ఎక్కడ జరుగుతాయి అంటే.. కొండలు,గుట్టలు, భవనాలు, ఆకాశహర్మ్యాలు, పెద్ద పెద్ద ఓడలు ఇలా ఎక్కడైనా చేయొచ్చు. సీన్‌కు తగిన చోట షూటింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోగలిగితే చాలు. ఇక టామ్ క్రూయిజ్ లాంటి డేర్‌ డెవిల్ హీరోలు నటించే సినిమాలకైతే షూటింగులు గాల్లో కూడా జరుగుతాయి. మిషన్ ఇంపాజిబుల్ సినిమాల్లో కొన్ని సీన్ల కోసం టామ్.. విమానాల్లోంచి, ఆకాశహర్మ్యాల నుంచి దూకిన విషయం తెలిసిందే. అయితే..ఈ షూటింగ్ విన్యాసాలు ఇంకా అంతరిక్షం దాకా వెళ్లలేదు. ఇప్పటివరకూ అంతరిక్షం థీమ్‌గా ఉన్న సినిమాలన్నిటిలో బాగా గ్రాఫిక్స్ దట్టించి.. మన చూస్తున్నదంతా అంతరిక్షమే అన్న భ్రమ కలుగజేశారు. ఇవన్నీ హాలీవుడ్‌ సినిమాలే. కానీ.. ఇకపై కథ మారబోతోంది. ఎందుకంటే ఇప్పుడు సీన్‌లో ఏకంగా రష్యా ఎంట్రీ ఇచ్చింది. ఇందుకు సంబంధించి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. రష్యా దర్శకుడు క్లిమ్ షిపెంకో చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా తన సినిమా షూటింగ్‌ను అంతరిక్షంలో ప్లాన్ చేశాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) దీనికి వేదిక కాబోతోంది. ఈ దిశగా రష్యా అంతరిక్ష సంస్థ  రాస్‌కాస్మోస్ కూడా తన వంతు సహకారం అందిస్తోంది. ఛాలెంజ్ అనే సినిమా కోసం డైరెక్టర్ క్లిమ్ షిపెంకో, నటి యూలియా పెరిస్లిడ్ మంగళవారం నాడు భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.25కు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమయ్యారు. కజికిస్తాన్‌లో బికనూర్ కాస్మోడ్రోమ్ ప్రయోగ కేంద్రం నుంచి రష్యా వ్యోమనౌక సోయూజ్ ఎమ్ఎస్-19 ద్వారా ఐఎస్ఎస్‌కు బయలుదేరారు. రష్యా వ్యోమగామి ష్కాప్లెరోవ్ కూడా వారి వెంట వెళ్లారు. 

ఏకంగా 12 రోజుల పాటు వారు అంతరిక్షంలో షూటింగ్ చేయనున్నారు. 35 నుంచి 40 నిమిషాల పాటు చిత్రీకరణ చేయడం..మధ్యలో కాస్తంత బ్రేక్ తీసుకోవడం.. మళ్లీ 35 నిమిషాల పాటు షూటింగ్ చేయడం..ఇలా షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకున్నారు. సినిమా కథ ప్రకారం.. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఓ వ్యోమగామిని రక్షించేందుకు ఓ మహిళా డాక్టర్ వెళుతుంది. ఇక రష్యా చిత్ర బృందం.. టామ్‌ క్రూయిజ్‌ను మించిపోతూ షూటింగ్ మొత్తాన్ని అంతరిక్షానికి మార్చేసింది. అంతా అనుకున్నట్టు జరిగితే..  అంతరిక్షంలో చిత్రీకరణ జరుపుకున్న తొలి సినిమా రష్యాదే అవుతుంది..చరిత్రలో ఇదో రికార్డుగా మిగిలిపోతుంది. ఇప్పటికే అంతరిక్షంలోకి తొలి ఉపగ్రహాన్ని, తొలిసారిగా మానవుడిని పంపించిన ఘనతను రష్యా దక్కించుకున్న విషయం తెలిసిందే. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement