Talibansతో చర్చలకు రెడీ అయిన రష్యా

ABN , First Publish Date - 2021-10-08T01:13:37+05:30 IST

ఆప్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకుని పాలన మొదలుపెట్టిన తాలిబన్లతో చర్చలకు రష్యా రెడీ అయింది. ఆప్ఘనిస్థాన్‌పై అంతర్జాతీయ

Talibansతో చర్చలకు రెడీ అయిన రష్యా

మాస్కో: ఆప్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకుని పాలన మొదలుపెట్టిన తాలిబన్లతో చర్చలకు రష్యా రెడీ అయింది. ఆప్ఘనిస్థాన్‌పై అంతర్జాతీయ చర్చల కోసం తాలిబన్లను ఆహ్వానించాలని యోచిస్తోంది. ఈ నెల 20న మాస్కోలో ఈ చర్చలు జరపాలని ప్లాన్ చేస్తున్నట్టు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక ప్రతినిధి జామిర్ కబులోవ్ ఒకరు తెలిపారు. అయితే, ఇంతకుమించిన వివరాలను వెల్లడించలేదు.


రష్యా ఈ ఏడాది మార్చిలో ఆఫ్ఘనిస్థాన్‌పై అంతర్జాతీయ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రష్యా, అమెరికా, చైనా, పాకిస్థాన్ కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఆ సమయంలో  యుద్ధం చేస్తున్న ఆఫ్ఘన్ పక్షాలు శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని, హింసను అరికట్టాలని పిలుపునిచ్చాయి. అలాగే, ఎలాంటి దాడులకు పాల్పడవద్దని తాలిబన్లను కోరాయి. 


అయితే, అమెరికా, దాని మిత్ర సేనలు ఆప్ఘనిస్థాన్ నుంచి వైదొలగిన వెంటనే తాలిబన్లు విశ్వరూపం ప్రదర్శించారు. రోజుల వ్యవధిలోనే ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్నారు. దీంతో మధ్య ఆసియాలోకి తాలిబన్ల చొరబడే అవకాశం ఉందని రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల పరమయ్యాక తజికిస్థాన్‌లో రష్యా మిలటరీ విన్యాసాలు చేసింది.


పుతిన్ గురువారం తజికిస్థాన్ అధ్యక్షుడు ఎమోమలి రఖ్‌మోన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని పరిస్థితిపై ఇరువురు నేతలు చర్చించారు. కాబూల్‌లో మానవతా సంక్షోభం రోజురోజుకు మరింత దారుణంగా తయారవుతున్నట్టు ఐరాస చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌కు సాయం అందిస్తారా? అన్న ప్రశ్నకు కబులోవ్ స్పందిస్తూ.. తప్పకుండా అందిస్తామని, అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు.

Updated Date - 2021-10-08T01:13:37+05:30 IST