సమాంతర వ్యవసాయంతో అధిక లాభాలు

ABN , First Publish Date - 2021-08-03T07:05:59+05:30 IST

సమాంతర వ్యవసాయంతో అధిక లాభాలు పొందవచ్చని జాతీయ వ్యవసాయ గ్రామీణాభిృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) చైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవిందరాజులు సూచించారు.

సమాంతర వ్యవసాయంతో అధిక లాభాలు
రైతుశిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న గోవిందరాజులు, ఎమ్మెల్యే గాంధీ తదితరులు

 రైతు శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవంలో నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు 

అబ్దుల్లాపూర్‌మెట్‌, ఆగస్ట్టు 2 (ఆంధ్రజ్యోతి): సమాంతర వ్యవసాయంతో అధిక లాభాలు పొందవచ్చని జాతీయ వ్యవసాయ గ్రామీణాభిృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) చైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవిందరాజులు సూచించారు. రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం, తారామతిపేట గ్రామ పరిధిలోని సేంద్రియ రైతు నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రంలో కర్షక సేవా కేంద్రం హైదరాబాద్‌ వారి నిర్వహణలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న పలు రకాల పంటలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పదివేల సంవత్సరాల క్రితం మొదటి రైతు మహిళ అని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు వ్యవసాయానికి పెద్దపీట వేశాయన్నారు. ఇంటిగ్రేటెడ్‌ వ్యవసాయంతో రైతులు లాభాలు గడించేలా కృషి చేయాలన్నారు. వ్యవసాయంతోపాటు ఆయిల్‌ఫామ్‌, మత్స్య, సోలార్‌, పాడిపశు, డ్రిప్‌ ఇరిగేషన్‌ తదితర రంగాలపై రైతులు దృష్టిపెడితే అధిక లాభాలు సాధించవచ్చన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి నాబార్డ్‌ సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ శిక్షణ కేంద్రం ద్వారా రైతులను సంఘటితం చేసి ప్రకృతి సేద్యం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను వారికి వివరించాలన్నారు. యువ రైతులను వ్యవసాయం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్‌ ప్రవీణ్‌రావు, నాబార్డ్‌ సీజీఎం వై. కృష్ణారావు, ఉద్యానశాఖ కమిషనర్‌ వెంకట్రాంరెడ్డి, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ వి. లక్ష్మారెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-03T07:05:59+05:30 IST