సారూ.. ఇదేం తీరు!

ABN , First Publish Date - 2021-08-04T06:32:12+05:30 IST

పోలీసుశాఖలో కొందరు అధికారులు, సిబ్బంది తీరు నేరాల సంఖ్య పెరిగేందుకు కారణమౌతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.

సారూ.. ఇదేం తీరు!

  1. నిస్తేజంగా మారిన నిఘా వర్గాలు
  2. నిందితులతో కొందరి మిలాఖత్‌
  3. పోలీసులపై రాజకీయ పెత్తనం


నంద్యాల, ఆగస్టు 3: పోలీసుశాఖలో కొందరు అధికారులు, సిబ్బంది తీరు నేరాల సంఖ్య పెరిగేందుకు కారణమౌతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు వీటికి బలం చేకూరుస్తున్నాయి. నంద్యాల సబ్‌ డివిజన్‌లో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. అసాంఘిక శక్తులు పెట్రేగిపోతున్నాయి. క్షేత్రస్థాయి సమాచారాన్ని జిల్లా కేంద్రానికి చేరవేయాల్సిన నిఘా వర్గాలు కూడా విఫలం అవుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. 


రాజకీయ పెత్తనం


నంద్యాల పోలీస్‌ సబ్‌ డివిజన్‌లో దొంగతనాలు, పేకాట, మట్కా, నాటుసారా, క్రికెట్‌ బెట్టింగ్‌లు, వ్యభిచార గృహాల నిర్వహణ, గుట్కా అమ్మకాలు వంటి అనేక నేరాలు జరుగుతున్నాయి. ఇలాంటి కేసుల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటోందని సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు స్టేషన్లకు తరలించగానే కొందరు నాయకులు రంగప్రవేశం చేస్తున్నారని, కఠినమైన సెక్షన్లు నమోదు కాకుండా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఓ అధికారి అసాంఘిక శక్తుల తరపున వకాల్తా పుచ్చుకుంటున్నారని.. ఎస్‌ఐలు, సీఐలకు స్వేచ్ఛ లేకుండా పోతోందన్న ప్రచారం ఉంది. ఈ కారణంగానే పోలీసుశాఖలో పరిపాలన గాడి తప్పుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దాడుల సమయంలో పట్టుబడిన సొమ్మును చూపడంలో కూడా వ్యత్యాసం చూపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. 


నిఘా వర్గాలు ఏమయ్యాయి?


ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌బ్రాంచ్‌ విభాగాల తరపున ప్రత్యేకంగా సిబ్బంది విధి నిర్వహణలో ఉంటారు. వీరంతా క్షేత్రస్థాయిలో అసాంఘిక కార్యకలాపాల సమాచారం సేకరించడం, కీలకమైన కేసుల్లో నిందితులను గుర్తించడం, సివిల్‌ పోలీసుల విధి నిర్వహణ గురించి జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం వంటి విధులు నిర్వహిస్తారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు ముందే పసిగట్టి ఉన్నతాధికారులకు చేరవేస్తారు. స్థానిక స్టేషన్ల అధికారులను అప్రమత్తం చేసి, నేర నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తారు. కానీ నంద్యాల సబ్‌ డివిజన్‌లో ఈ విభాగాలు నిస్తేజమ య్యాయన్న విమర్శలు ఉన్నా యి. నిఘా వర్గాల్లో కొందరు అసాంఘిక శక్తులు, పలు కేసుల్లోని నిందితులకు సహక రిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నా యి. ఈ కారణంగానే పోలీసులు దాడులకు వెళ్లే విషయం నేరగాళ్లకు ముందుగానే తెలిసిపో తోందని అంటున్నారు. 


పెరిగిన నేరాలు


నంద్యాల పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో 2020 జనవరి 20 నుంచి 2021 జూలై వరకు 12 హత్యలు, 21 హత్యాయత్నాలు, 9 అత్యాచారాలు, అత్యాచారయత్నాలు జరిగాయి. ఫోక్సో చట్టం కింద ఏడు కేసులు నమోదయ్యాయి.


నంద్యాల త్రీ టౌన్‌ స్టేషన్‌ అధికారిక వాట్సాప్‌ గ్రూపులో మట్కా డాన్‌ కూతురు సెల్‌ నెంబర్‌ ఉండటాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో కొందరిపైనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారని, మరికొందరిని వదిలేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 


గత ఏడాది మార్చిలో నంద్యాలలోని ఎన్‌జీవో కాలనీలో రౌడీ షీటర్‌ రాజశేఖర్‌ (డబుల్‌ మర్డర్‌ కేసులో ముద్దాయి) నడిరోడ్డుపై హత్యకు గురయ్యాడు. 


గత ఏడాది మేలో రైతు నగరంలో మహిళ తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది.


గత ఏడాది అక్టోబరులో పొన్నాపురానికి చెందిన వైసీపీ నాయకుడు సుబ్బరాయుడు విజయ మిల్క్‌ డెయిరీ వెనుక భాగంలోని పొలాల్లో హత్యకు గురయ్యాడు.


గత ఏడాది వైఎస్‌ నగర్‌లో లక్ష్మీదేవి అనే గర్భిణి నడిరోడ్డుపై హత్యకు గురైంది.


ఈ ఏడాది జూన్‌లో వైఎస్‌ నగర్‌లో రౌడీషీటర్‌ సురేంద్ర అలియాస్‌ సూరి చేతిలో జగన్‌ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. 


జూన్‌లో గడివేముల మండలం పెసరవాయికి చెందిన టీడీపీ నాయకులు వడ్డు నాగేశ్వరరెడ్డి, వడ్డు ప్రతాపరెడ్డి సోదరులు ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు.


జూలైలో మండలంలోని చాపిరేవులలో భర్త చేతిలో భార్య నాగేంద్రమ్మ హత్యకు గురైంది. 


గత ఏడాది టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎన్‌జీవో కాలనీలో ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. రూ.లక్షల్లో నగదు స్వాధీనం చేసుకొని కొంతమేరకే చూపించారని, కేసులో కొందరు నిందితులను రాజకీయ ఒత్తిళ్లతో తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. 


నంద్యాలలోని గాంధీచౌక్‌, పెద్దమార్కెట్‌, సాయిబాబానగర్‌, ఎస్‌బీఐ కాలనీ, నూనెపల్లె తదితర ప్రాంతాల్లోని గుట్కా నిర్వాహకుల నుంచి కొందరు పోలీసులకు మామూళ్లు ముడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. 


గతేడాది ఫరూక్‌నగర్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో రూ.50 వేల నగదు, 45 తులాల బంగారం చోరీకి గురయ్యాయి. ఆ కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని సమాచారం. 


ఎస్‌బీఐ కాలనీలో ఓ ప్రముఖ వైద్యుడి బంధువు ఇంట్లో దొంగలు పడి 30 తులాల బంగారం, కొంత నగదును చోరీ చేశారు. 


నూనెపల్లె సమీపంలోని కాలనీలో కూతురి పెళ్లి కోసం ఓ ఆర్టీసీ ఉద్యోగి కూడబెట్టుకున్న 30 తులాలకు పైగా బంగారు నగలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. 


ఈ ఏడాది జూలైలో జ్ఞానాపురంలో పాస్టర్‌ విజయ్‌ ఇంట్లో దొంగలు పడి 20 తులాల బంగారు నగలు, రూ.50 వేల నగదు చోరీ చేశారు.

Updated Date - 2021-08-04T06:32:12+05:30 IST