సబ్బం హరి కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-04T08:17:11+05:30 IST

అనకాపల్లి మాజీ ఎంపీ, విశాఖ మాజీ మేయర్‌, టీడీపీ సీనియర్‌ నేత సబ్బం హరి (69) సోమవారం కన్నుమూశారు. గత నెల 15న ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మూడు రోజులు హోం క్వారంటైన్‌లో

సబ్బం హరి కన్నుమూత

గత నెల 15న కొవిడ్‌ పాజిటివ్‌

19వ తేదీన ఆస్పత్రిలో చేరిక

పరిస్థితి విషమించడంతో అపోలోకు తరలింపు

వెంటిలేటర్‌పై చికిత్స

రెండ్రోజుల క్రితం నెగిటివ్‌ 

అయితే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో తుది శ్వాస 

సమకాలీన, రాజకీయ అంశాలపై లోతైన పరిజ్ఞానం

వెంకయ్య, జగన్‌, చంద్రబాబు తదితర ప్రముఖుల సంతాపం


విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మాజీ ఎంపీ, విశాఖ మాజీ మేయర్‌, టీడీపీ సీనియర్‌ నేత సబ్బం హరి (69) సోమవారం కన్నుమూశారు. గత నెల 15న ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మూడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉండి.. అనంతరం వైద్యుల సూచన మేరకు విశాఖలోని కనకదుర్గ నర్సింగ్‌హోంలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. అప్పట్లోనే ఆయన తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు అందరికీ వాట్సా్‌పలో ఓ మెసేజ్‌ పంపించారు. పది రోజులు ఆస్పత్రిలో ఉండి, కోలుకుని ఇం టికి వస్తానని.. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. అయితే కొద్దిరోజులకే ఆయన పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటి న ఆయన్ను ఆరిలోవలోని అపోలో ఆస్పత్రికి మార్చారు. అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేశారు. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు. సోమవారం మధ్యా హ్నం 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు మంగళవారం ఉదయం నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు వెంకట్‌ తెలిపారు. సీతమ్మధారలోని స్వగృహంలో ఆయన సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. కొవిడ్‌తో అస్వస్థతకు గురికావడంతో గత నెల 19న తన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించామన్నారు. సీరియ్‌సగా ఉండడంతో టీడీపీ అధినే త చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎప్పటికప్పుడు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారని తెలిపారు. రెండ్రోజుల కింద కరోనా పరీక్ష నిర్వహించ గా, నెగటివ్‌ వచ్చిందని, అయితే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ వల్ల సోమవారం మధ్యాహ్నం తన తండ్రి కన్నుమూశారని వివరించారు. అంత్యక్రియలు స్థానిక కేఆర్‌ఎం కాలనీ శ్మశాన వాటికలో మంగళవారం నిర్వహిస్తామని చెప్పారు. అభిమానులు, కార్యకర్తలు ఎవరూ రావద్దని, చివరి చూ పునకు ఎవరైనా వస్తే.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని వెంకట్‌ సూచించారు.


1952లో జననం..

విశాఖకు 30 కి.మీ. దూరాన ఉన్న చిట్టివలస సబ్బం హరి స్వస్థలం. 1952 జూన్‌ 1న ఆయన జన్మించారు. తండ్రి బంగారునాయుడు, తల్లి అచ్చెయ్యమ్మ. ఆరుగురిలో ఆయనే చివరి సంతా నం. చిట్టివలసలో పదో తరగతి వరకు చదువుకున్నారు. విశాఖలోని ఏవీఎన్‌ కళాశాలలో ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేశారు. ప్రేమించి లక్ష్మిని వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల క్రితమే ఆమె కాలం చే శారు. ఇద్దరు కుమార్తెలు, కుమారుడికి వివాహా లు జరిగాయి. సీతమ్మధార నివాసంలో తండ్రితో పాటే పాటే కుమారుడు వెంకట్‌(సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌) ఉంటున్నారు. 


మేయర్‌గా, ఎంపీగా.. 

టీడీపీ హవా ఉన్నప్పటికీ సబ్బం హరి 1995 లో విశాఖ మేయర్‌గా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి కాంగ్రెస్‌ తరఫున గెలుపొందారు. 1999లో విశాఖ -1 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కంభంపాటి హరిబాబుపై పోటీ చేసి ఓడిపోయారు. 2009లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి, ప్రముఖ సినీనిర్మాత అల్లు అరవింద్‌పై గెలుపొందారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్మోహన్‌రెడ్డి కడప ఎంపీగా గెలిచారు. ఇద్ద రూ పార్లమెంటుకు వెళ్లడంతో అక్కడ ఆయన తో పరిచయం ఏర్పడింది. రాజశేఖర్‌రెడ్డి మర ణం తర్వాత జగన్‌తో కలిసి కొన్నాళ్లు ఉన్నారు. ఆ తర్వాత విభేదాలు రావడంతో దూరమయ్యా రు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. సమైక్యాంధ్ర గళం వినిపించారు. నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటుచేసిన సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి ఆ పార్టీ తరపున ఎంపీగా బరిలో దిగి, చివరి నిమిషంలో విరమించుకున్నారు. అనంతరం కొన్నాళ్లు ఏ పార్టీలో చేరకుండా మౌనంగా ఉండిపోయారు. 2019 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతి లో ఓడిపోయారు. తాజాగా విశాఖలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో సైతం వార్డు కార్పొరేటర్లు గా ఇతర జిల్లాల వారు పోటీ చేయడాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు.  


మేయర్‌గా తనదైన ముద్ర..

విశాఖ మేయర్‌గా హరి నగర పరిపాలనలో తనదైన ముద్రవేశారు. నగర ప్రజలకు చిరకాలం గుర్తుండిపోయే పనులు చేపట్టారు. అప్పట్లో విశాఖవాసులకు రాత్రి ఒంటి గంట మొదలుకొని తెల్లవారుజాము 5 వరకు కుళాయిల నీరు ఇచ్చేవారు. మహిళలు రాత్రివేళ నిద్రలు మానుకొని నీటి కోసం ఎదురుచూసేవా రు. ఆయన మేయర్‌ కాగానే నీటి సరఫరా వేళల ను ఉదయం 6 గంటలకు మార్చారు. బీచ్‌రోడ్డులో మహానుభావుల విగ్రహాలు పెట్టించి, హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లా మార్చారు. నగరం నడిబొడ్డున స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియం నిర్మించారు. శివాజీపాలెంలో నివాసాల మధ్యనున్న డంపింగ్‌యార్డు ను నగర శివార్లకు తరలించి, ఆ స్థానంలో చక్కటి పార్కు(శివాజీ) ఏర్పాటుచేశారు. నగరం మొత్తం సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థ తీసుకొచ్చారు.  


రాజకీయ విశ్లేషకుడిగా..

సమకాలీన, రాజకీయ అంశాలపై సబ్బం హరి కి మంచి పట్టుంది. ఏ అంశం తీసుకున్నా దానిపై లోతుగా విశ్లేషించి, భవిష్యత్తు పరిణామాలను వివరిస్తారు. కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమి తం కాకుండా జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలను కూడా చెబుతారు. సబ్బం హరి ప్రతి మంగళవారం భీమిలి వెళ్లేవారు. అక్కడ బీచ్‌ రోడ్డులో తనకున్న చిన్న అతిథిగృహంలో బసచేసేవారు. ఆ రోజున స్థానిక నాయకులు, ప్రజలు వచ్చి సమస్య లు చెప్పుకొంటే.. వాటికి పరిష్కారం చూపించేవా రు. విశాఖలో కూడా ఆయన ఎవరైనా న్యాయం కోరి వస్తే.. పక్షపాతం లేకుండా ఇరుపక్షాలను కూర్చోబెట్టి పరిష్కరించేవారు. తన మాటకు కట్టుబడి ఉంటామంటేనే ఇరువర్గాలతో మాట్లాడేవారు. 


రాజకీయాలకు దూరంగా కుటుంబం..

సబ్బం హరి తన కుటుంబ సభ్యులను ఎప్పు డూ రాజకీయాల్లోకి తీసుకురాలేదు. ఆయన శుభ కార్యాలకు వెళ్లడం చాలా అరుదు. అలాగే తన ఇంట్లో జరిగే కార్యాలకు కూడా చాలా తక్కువ మందినే ఆహ్వానించేవారు. తన పిల్లలెవరినీ ఎవరికీ పరిచయం చేయలేదు. విశాఖలో చాలామంది కి ఆయన కుమారుడు ఎలా ఉంటాడో కూడా తెలియదు. కుటుంబానికి ఆయన ఎక్కువ ప్రాధా న్యం ఇచ్చేవారు. భార్య చాలాకాలం అనారోగ్యంతో బెడ్‌పైనే ఉంటే.. ఓ భర్తగా దగ్గరుండి అనేక సపర్యలు చేశారు. ఎక్కడెక్కడి నుంచో వైద్యులను తీసుకొచ్చి ఆమెకు నయం చేయించే ప్రయత్నం చేశారు. 2017లో ఆమె మరణం ఆయన్ను కొంత కుంగదీసింది. అయినా వెంటనే కోలుకుని రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలంగా మారారు.


వలస నేతలకు వ్యతిరేకి

విశాఖలో వలస రాజకీయాలను హరి గట్టిగా వ్యతిరేకించేవారు. స్థానికులే పాలకులు కావాలని తపించారు. విద్యార్థి దశలోనే ఆయన రాజకీయా ల వైపు మొగ్గుచూపారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రాజీవ్‌గాంధీకి వీరాభిమాని. హరి యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా ఉన్నప్పుడు రాజీవ్‌ విశాఖ వచ్చారు. ఆ సమయంలో ఆయన వెంట కాలికి చెప్పులు లేకుండానే పరుగులు తీశారు. విశాఖ లో కాంగ్రెస్‌ కురువృద్ధుడు ద్రోణంరాజు సత్యనారాయణ, సీనియర్‌ నేతలు గుడివాడ గురునాథరావు, కొణతాల రామకృష్ణ తదితరులతో ఢీ అం టే ఢీ అనేలా రాజకీయాలు నడిపారు. చిన్న వయసులోనే తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటుచేసుకున్నారు. రాష్ట్ట్ర, జాతీయ స్థాయి నాయకులకు దగ్గరగా ఉంటూ వర్తమాన రాజకీయ వ్యవహారాలను ఔపోసన పట్టారు. విశాఖలో వ్యాపారాల కోసం, ఉపాధి కోసం వచ్చిన వారు రాజకీయాల్లో కీలకంగా ఉంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నప్పుడు ఆయన స్థానిక నినాదం ఎత్తుకున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఇక్కడి సమస్యల పరిష్కారంపై ఆసక్తి ఉండదని, స్థానికులనే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని ప్రజలను అభ్యర్థించేవారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి విశాఖ ఎంపీగా పోటీ చేసినప్పుడు స్థానికేతరుడంటూ హరి స్పష్టంగా తన వైఖరి చెప్పడంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది కూడా.

Updated Date - 2021-05-04T08:17:11+05:30 IST