సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ అధిష్ఠానం సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2020-07-14T19:31:46+05:30 IST

డిప్యూటీ సీఎం, రెబల్ నేత సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్ అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ అధిష్ఠానం సంచలన నిర్ణయం

రాజస్థాన్: డిప్యూటీ సీఎం, రెబల్ నేత సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్ అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం పదవితో పాటు, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించారు. ఆయన అనుచరవర్గానికి చెందిన మరో ఇద్దరిపై వేటు వేసింది. గెహ్లాట్ ప్రభుత్వాన్ని అస్తిరపరచాలని సచిన్ పైలట్ అనుకున్నారని కాంగ్రెస్ తన ప్రకటనలో పేర్కొంది. 


అంతకుముందు, రాజస్థాన్ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి 104 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు సమాచారం. సోమవారం జరిగిన మొదటి సమావేశంలో సైతం ఇదే సంఖ్యలో ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ ప్రకటించారు. కాగా వరుసగా రెండు రోజు సమావేశానికి వందకు పైగా ఎమ్మెల్యేలు పాల్గొనడంతో రాజస్థాన్ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదనే తెలుస్తోంది.


మరోవైపు సచిన్ పైలట్‌కు భారతీయ జనతా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని ఆ పార్టీ నేత ఓం మథుర్ ప్రకటించారు. బీజేపీలోకి చేర్చుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, బీజేపీతో అంతర్గత సంప్రదింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చినప్పటికీ ఆ పార్టీ నుంచి అధికారికంగా ఆహ్వానం రావడం ఇదే తొలిసారి.

Updated Date - 2020-07-14T19:31:46+05:30 IST