Abn logo
May 17 2021 @ 20:30PM

`ఏం చేస్తున్నావ్`.. కోహ్లీతో పరిచయాన్ని గుర్తు చేసుకున్న సచిన్!

భారత క్రికెట్ దేవుడిగా, స్టార్ బ్యాట్స్‌మెన్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ప్రపంచంలో మరే ఇతర బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కానన్ని ఎన్నో రికార్డులను సచిన్ నెలకొల్పాడు. సచిన్ లాంటి బ్యాట్స్‌మెన్ మరొకరు ఉండరు అనుకుంటున్న తరుణంలో  విరాట్ కోహ్లీ టీమిండియా తలుపు తట్టాడు. సచిన్ స్థాయిలో ఆడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. 


సచిన్ కెరీర్ చరమాంకంలో ఉండగా కోహ్లీ అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా కోహ్లీతో తన తొలి పరిచయాన్ని సచిన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. `టీమిండియాకు ఎంపికై డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన తర్వాత కోహ్లీ నేరుగా వచ్చి నా కాళ్లు మొక్కాడు. నేను షాకై.. `ఏం చేస్తున్నావ్.. ఇలాంటివి చేయనవసరం లేదు` అని చెప్పా. ఆ తర్వాత పక్కకి చూడగా.. యువరాజ్ సింగ్, మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్ నవ్వుతూ కనిపించార`ని సచిన్ చెప్పాడు. భారత్ జట్టులోకి కొత్తగా సెలెక్ట్ అయినవారు మొదట సచిన్ టెండూల్కర్ ఆశీర్వాదం తీసుకోవాలని విరాట్ కోహ్లీకి ఆ ముగ్గురు క్రికెటర్లు చెప్పారట. అది నిజమని నమ్మి కోహ్లీ అలాగే చేశాడట. జట్టులోకి కొత్తగా వచ్చిన కోహ్లీని సరదాగా ఆటపట్టించడానికే వారు అలా చెప్పారట. 

Advertisement