అంబానీ ఇంటి బయట పేలుడు పదార్థాల కేసు: మరొకరి అరెస్ట్

ABN , First Publish Date - 2021-04-11T23:20:53+05:30 IST

బిలియనీర్ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంటి ఎదుట ఓ కారులో పేలుడు పదార్థాలు నింపి నిలిపి ఉంచిన కేసులో

అంబానీ ఇంటి బయట పేలుడు పదార్థాల కేసు: మరొకరి అరెస్ట్

ముంబై: బిలియనీర్ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంటి ఎదుట ఓ కారులో పేలుడు పదార్థాలు నింపి నిలిపి ఉంచిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్ట్ కాగా, తాజాగా ఆయన సహచరుడైన మరో పోలీసు అధికారి రియాజ్ కాజీని నేడు ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ (ఏపీఐ) కాజీని తొలుత విచారణకు పిలిచిన జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ అనంతరం అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం కేసుతోపాటు ఫిబ్రవరి 25న మరణించిన థానే వ్యాపారవేత్త మన్సుఖ్ హిరాన్ కేసులో సంబంధాలపై కాజీని ఎన్ఐఏ పలుమార్లు ప్రశ్నించింది. 


ఆదివారం కాజీని అరెస్ట్ చేసిన తర్వాత హాలీడే కోర్టులో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 16 వరకు కోర్టు అతడిని ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. కాజీని గత నెలలో ముంబై క్రైం బ్రాంచ్ నుంచి తొలగించారు. కాగా, సబర్బన్ విఖ్రోలి లోని ఓ నంబరు ప్లేట్ల దుకాణంలోకి కాజీ వెళ్లి దుకాణ యజమానితో మాట్లాడినట్టు సీసీటీవీ ఫుటేజీలో వెలుగుచూసింది.  

Updated Date - 2021-04-11T23:20:53+05:30 IST