సచివాలయాల్లో ఆధార్‌ సేవలు

ABN , First Publish Date - 2021-08-02T05:43:07+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ తప్పనిసరి కావడంతో అనేక మండలాల్లో ఆధార్‌ కేంద్రాలు లేక ప్రజానీకం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సచివాలయాల ద్వారా ఆధార్‌ సేవలు అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.

సచివాలయాల్లో ఆధార్‌ సేవలు
సచివాలయంలో ఆధార్‌ కేంద్రం

కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు

ఒంగోలు (కలెక్టరేట్‌), ఆగస్టు 1 : గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ తప్పనిసరి కావడంతో అనేక మండలాల్లో ఆధార్‌ కేంద్రాలు లేక ప్రజానీకం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సచివాలయాల ద్వారా ఆధార్‌ సేవలు అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో 47 సచివాలయాలను ఆధార్‌ సేవలు అందించేందుకు సర్కారు మొదట ఎంపిక చేసింది. మారుమూల మండలాలు, అర్బన్‌ ప్రాంతాలకు దూరంగా ఉండే గ్రామాల్లోని సచివాలయాల్లో ఆధార్‌ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. సచివాలయాల్లో పనిచేసే డిజిటల్‌ అసిస్టెంట్లకు ఆ బాధ్యతను అప్పగించింది. జిల్లాలో ఇప్పటివరకు 37 సచివాలయాల్లో ఆధార్‌ కోసం అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లను సరఫరా చేసి నెట్‌ సౌకర్యం కల్పించారు. అయితే అందులో కొన్ని కేంద్రాల్లో ఆధార్‌ సేవలు ప్రారంభం కాగా, కొన్నింటిలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సాంకేతిక సమస్యలు ఉన్న ప్రాంతాల్లో త్వరగా ఆధార్‌ సేవలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

పది కేంద్రాల్లో నిలిచిన సేవలు

జిల్లాకు ప్రభుత్వం 47 ఆధార్‌ కేంద్రాలు మంజూరుచేయగా 37 కేంద్రాల్లో సేవలు ప్రారంభించారు. 10 కేంద్రాలకు ఇంతవరకు మెటీరియల్‌ సరఫరా చేయలేదు. ఆ పదిచోట్ల డిజిటల్‌ అసిస్టెంట్లు ఆధార్‌ సేవలు అందించేందుకు అర్హత సాధించకపోవడంతో వాటిలో నిలిచిపోయింది. అయితే ఆయా డిజిటల్‌ అసిస్టెంట్లకు అందుకు అవసరమైన శిక్షణను ఇస్తున్నారు. త్వరలో ఆ పదిచోట్ల కూడా ఆధార్‌ సేవలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 


Updated Date - 2021-08-02T05:43:07+05:30 IST