సచివాలయాల నిర్మాణం వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-07-30T06:07:15+05:30 IST

గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారు.

సచివాలయాల నిర్మాణం వేగవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశం

గతంలోని బిల్లులు చెల్లించాలని సర్పంచ్‌ల విజ్ఞప్తి 


మద్దిపాడు, జూలై 29 : గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారు. గురువారం మద్దిపాడు మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే టీజేఆర్‌.సుధాకర్‌బాబు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, చీమకుర్తి, మద్దిపాడు మండలాల్లో కొన్ని గ్రామాల్లో రైతుభరోసా కేంద్రాలు మొదలుపెట్టలేదని, కొన్నిచోట్ల బేస్‌మెంట్‌లెవల్‌లో ఉన్నాయని చెప్పారు.  గ్రామ సర్పంచ్‌లు బాఽధ్యత తీసుకుని సెప్టెంబరు నాటికి అన్నింటిని పూర్తి చేయాలన్నారు. దీనిపై సర్పంచ్‌లు మాట్లాడుతూ గతంలో చేపట్టిన భవనాలకు బిల్లులు రాక తాము ఆర్ధికంగా దెబ్బతిన్నామని, కొన్నిచోట్ల నిర్మాణాలపై కోర్టులను ఆశ్రయించారని కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఉపాధి హామీ మ్యాచింగ్‌ గ్రాంట్‌ కింద భవనాలు నిర్మించామని, ఆ బిల్లులపై స్పష్టంత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పందిస్తూ సంబంధిత కమిషనర్‌తో చర్చించి నిర్మాణాలు చేపట్టిన వారందరికీ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చీమకుర్తి మండలం గోనుగుంట, మంచికలపాడు, ఆర్‌.ఎల్‌.పురం, చిన్నరావిపాడు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు నత్తనడక నడుస్తున్నాయని, అధికారులు, సర్పంచ్‌లు, నాయకులతో సమన్వయం చేసుకొని నిర్మాణాలు చేపట్టాలన్నారు. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూమి చూపించినా భవనాలు ఎందుకు కట్టలేదని అధికారులను ప్రశ్నించారు. పనితీరు మార్చుకోక పోతే చర్యలు తీసుకుంటామన్నారు. అనతరం ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మాట్లాడుతూ రైతులు అభ్యున్నతి కోసం వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రాఽధాన్యత ఇస్తుందన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, వెంటనే బిల్లులు చెల్లించడం జరుగుతుందన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ మాలకొండయ్య, ఆర్డీవో ప్రభాకరరెడ్డి, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో హనుమంతరావు, వైసీపీ మండల కన్వీనర్లు మండవ అప్పారావు, లక్ష్మీనారాయణ, నాయకులు ఓబుల్‌రెడ్డి, జడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, వాకా కోటిరెడ్డి, రావూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T06:07:15+05:30 IST