ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రాణాల బలి

ABN , First Publish Date - 2021-06-19T05:34:18+05:30 IST

కరోనా కట్టడిలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజలు చనిపోయారని, వీరి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రాణాల బలి
రాజంపేట సబ్‌కలెక్టర్‌ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేస్తున్న శ్రీనివాసులరెడ్డి, బత్యాల చెంగల్‌రాయులు

కరోనా మృతులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి

టీడీపీ నేతల డిమాండ్‌

కడప, జూన 18 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడిలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజలు చనిపోయారని, వీరి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆర్డీవో కార్యాలయాల్లో శుక్రవారం వినతిపత్రాలు ఇచ్చారు. కడప ఆర్డీవో కార్యాలయంలో సబ్‌కలెక్టర్‌ పృథ్వీతేజ్‌కు వినతిపత్రం ఇచ్చిన అనంతరం కార్యాలయం ఎదుట టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధనరెడ్డి, బి.హరిప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. కరోనా కుటుంబ పెద్దదిక్కు పోవడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వారిని ఆదుకునేందుకు రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించాలన్నారు. ఉద్యోగాల కల్పన పేరుతో వలంటీర్లను ఎంపిక చేసుకుని అవే పెద్ద ఉద్యోగాలంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతుగంటి పీరయ్య, జయచంద్ర, జిలానీబాషా, మల్లేషు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, అసెంబ్లీ ఇనచార్జి అమీర్‌బాబు సబ్‌ కలెక్టరుకు వినతిపత్రం అందించారు. రాజంపేటలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌రాయులు ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా బారిన పడిన వారికి ఆసుపత్రిలో ఆక్సిజన అందక మృతిచెంది ఉంటే, అది ప్రభుత్వ హత్యగా గుర్తించి వారి కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వాలని, కరోనాతో మృతిచెందిన ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు, బ్లాక్‌ ఫంగస్‌తో మృతి చెందిన కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పులివెందుల తహసీల్దార్‌ కార్యాలయంలో జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్నకు ఎమ్మెల్సీ బీటెక్‌ రవి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు సరిగా లేని కారణంగా కరోనాతో వేలాదిమంది మరణించారన్నారు. కరోనా కట్టడికి వ్యాక్సినే ఏకైక మార్గమని తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అంతటా గందరగోళం నెలకొందన్నారు. మొదటి డోసు వేసుకున్న వారికి సమయానికి రెండో డోసు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. రైతులను ఆదుకునే విధంగా వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారు నిజాముద్దీనకు టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి వినతిపత్రం అందజేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి తెల్లరేషనకార్డు ఉన్న కుటుంబానికి రూ.10 వేలు ఆర్థికసాయం అందించాలన్నారు. కరోనా వలన జీవనోపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు, భవన నిర్మాణ కార్మికులు, చిరువ్యాపారులకు ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-06-19T05:34:18+05:30 IST