కల్తీ కల్లుకు ఒకరి బలి

ABN , First Publish Date - 2021-01-10T07:53:49+05:30 IST

కల్తీ కల్లు మళ్లీ పడగ విప్పింది. వికారాబాద్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఒకరు చనిపోగా..

కల్తీ కల్లుకు ఒకరి బలి

  • మరొకరి పరిస్థితి విషమం.. 200 మందికి అస్వస్థత
  • కళ్లు తిరిగి, మూర్ఛ, రక్తపువాంతులతో ఆస్పత్రి పాలు
  • వికారాబాద్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో కలకలం
  • బాధ్యులపై చర్యలు: సబిత 
  • బాధితులకు ఆస్పత్రిలో 24 గంటల పర్యవేక్షణ
  • చికిత్స పొందుతున్నవారిని పరామర్శించిన మంత్రి 
  • పలు కల్లు డిపోలు, దుకాణాలు సీజ్‌
  • ల్యాబ్‌కు నమూనాలు పంపిన అధికారులు


వికారాబాద్‌, జనవరి 9(ఆంధ్రజ్యోతి): కల్తీ కల్లు మళ్లీ పడగ విప్పింది. వికారాబాద్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఒకరు చనిపోగా.. 200 మంది అస్వస్థతకు గురయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్‌, నవాబుపేట మండలాల్లోని 11 గ్రామాల్లో కల్లు తాగే అలవాటున్న కొందరు శుక్రవారం సాయంత్రం నుంచి నిల్చున్నచోటే కళ్లు తిరిగి పడిపోసాగారు. ఇంకొందరిలో మూర్ఛ లక్షణాలు కనిపించాయి. శనివారం ఉదయం నుంచి బాధితులు పెరగసాగారు. వికారాబాద్‌ మండలం ఎర్రవల్లిలో ఒకరు రక్తపు వాంతులు చేసుకున్నారు. నారాయణపూర్‌, పెండ్లిమడుగు, కొత్తగడి, పులుసుమామిడి గ్రామస్థులు కొందరు, నవాబుపేట మండలం చిట్టిగిద్ద, ఆర్కతల, వట్టిమీనపల్లి, నవాబుపేట, ఏక్మామిడి, మాదిరెడ్డిపల్లిలో పలువురు ఇదేతరహాలో అస్వస్థతకు గురయ్యారు. పెండ్లిమడుగుకు చెందిన కృష్ణారెడ్డి (58) మృతిచెందాడు. చిట్టిగిద్ద వాసి ప్యాట రాములును హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. మిగతావారు వికారాబాద్‌  ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రెండు మండలాల్లోని 18 గ్రామాలకు చిట్టిగిద్ద నుంచి కల్లు సరఫరా అవుతుంటే, 11 గ్రామాల్లోని 200 మంది అస్వస్థతకు గురయ్యారు.


పలు కల్లు డిపోలు, దుకాణాలు సీజ్‌

కల్తీ కల్లు కారణంగానే ప్రజలు అస్వస్థతకు గురయ్యారని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఖురేషీ స్పష్టం చేశారు. శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు పంపామని.. రిపోర్టులు సోమవారం వస్తాయన్నారు. మరోవైపు ఎక్సైజ్‌ అధికారులు చిట్టిగిద్దలోని కల్లు డిపోతో పాటు చిట్టిగిద్ద, ఎర్రవల్లి తదితర గ్రామాల్లోని 11 కల్లు దుకాణాలను సీజ్‌ చేశారు. నిల్వ ఉన్న కల్లును వెంటనే పారబోయాలని, అస్వస్థతకు గురైనవారు వెంటనే వైద్యం చేయించుకోవాలని చాటింపు వేయించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఈ గ్రామాల్లోని ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నచోట శిబిరాలు ఏర్పాటు చేశారు. కాగా, ప్రజలు అస్వస్థతకు గురైన సమాచారం తెలియగానే వికారాబాద్‌, చేవెళ్ల ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్యలు డీఎంహెచ్‌వో డాక్టర్‌ దశరథ్‌, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, ఎక్సైజ్‌ శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. గ్రామాల్లో పర్యటించి పర్యవేక్షించారు. డాక్టర్‌ అయిన ఎమ్మెల్యే ఆనంద్‌.. బాధితులను స్వయంగా పరీక్షించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఆస్పత్రిలో ఉన్నవారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధాకర్‌ సింధే తెలిపారు. ల్యాబ్‌ రిపోర్టు వచ్చిన తర్వాత కారణాలు తెలుస్తాయన్నారు. చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్‌ పౌసుమీ బసు.. ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. 


బాధితులకు మంత్రి సబిత పరామర్శ

వికారాబాద్‌ ఆస్పత్రిలో బాధితులను విద్యా శాఖ మంతిర సబిత, ఎమ్మెల్యేలు ఆనంద్‌, యాదయ్య, కలెక్టర్‌ పౌసుమిబసులతో కలిసి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాఽధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 12 గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని, సమీప అస్పత్రుల వైద్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని  చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అధికారులను కోరారు.

Updated Date - 2021-01-10T07:53:49+05:30 IST