దిగులుబడి!

ABN , First Publish Date - 2021-01-13T05:16:34+05:30 IST

వరి దిగుబడి ఈ ఏడాది నిరాశాజనకంగా ఉంది. గత ఏడాది కంటే తగ్గింది. ముగిసిన ఖరీఫ్‌ సీజన్‌లో ఎకరాకు మూడు బస్తాలు చొప్పున తేడా నమోదైంది. పంట కోత ప్రయోగాల్లో ఎనిమిది చోట్ల సున్నా ఫలితాలు వచ్చాయి.

దిగులుబడి!
ఈదురుగాలులకు నేలవాలిన వరి పంట(ఫైల్‌)

ఈసారి ఎకరాకు మూడు బస్తాలు తగ్గుదల 

ఎనిమిది ‘కోత’ ప్రయోగాల్లో సున్నా ఫలితాలు

కలెక్టరేట్‌, జనవరి 12:

వరి దిగుబడి ఈ ఏడాది నిరాశాజనకంగా ఉంది. గత ఏడాది కంటే తగ్గింది. ముగిసిన ఖరీఫ్‌ సీజన్‌లో ఎకరాకు మూడు బస్తాలు చొప్పున తేడా నమోదైంది. పంట కోత ప్రయోగాల్లో ఎనిమిది చోట్ల సున్నా ఫలితాలు వచ్చాయి. మరికొన్ని చోట్ల పది కేజీల కంటే తక్కువగా నమోదైంది. జిల్లా అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో వరి విస్తీర్ణం లక్షా 20 వేల హెక్టార్లు కాగా సకాలంలో వర్షాలు కురవక గత ఏడాది 23 వేల హెక్టార్లలో వరి నాట్లు వేయలేదు. జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య వర్షాభావంతో మక్కువ, సాలూరు, ఆర్‌బీపురం, బొండపల్లి, పూసపాటిరేగ, డెంకాడ, గంట్యాడ, ఎస్‌.కోట, ఎల్‌.కోట, జామి, కొత్తవలస ఇలా చాలాచోట్ల నాట్లు వేయలేదు. చివరిలో కురిసిన వర్షాలకు ఆశ వదులుకోలేక కొంతమంది రైతులు నారు ముదురుపోయిన తరువాత నాట్లు వేసుకున్నారు. ఇటువంటి చోట కూడా వర్షాలు లేక వరి చాలా వరకూ దెబ్బతింది. పార్వతీపురం డివిజన్‌లో వరికి కాస్త అనుకూలంగా ఉన్నా.. విజయనగరం డివిజన్‌లో చాలా మండలాల్లో పండలేదు. గజపతినగరం నియోజకవర్గ పరిధిలో జామి తప్పా మిగిలిన నాలుగు మండలాల్లో కనీస స్థాయిలో వరి నాట్లు పడలేదు. దిగుబడిని తెలుసుకోవడానికి జిల్లాలో 2,884 యూనిట్లలో పంటకోత ప్రయోగాలు చేశారు. ఇందులో గంట్యాడ, ఎల్‌.కోటలో మూడేసి చోట్ల, బొండపల్లి, బొబ్బిలి మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున జీరో దిగుబడులు వచ్చాయి. ఒకటి నుంచి ఐదు కేజీల చొప్పున 96 యూనిట్లు, ఐదు నుంచి పది కేజీల మధ్య347 యూనిట్లలో ఫలితాలు వెలువడ్డాయి. మిగిలిన చోట పది కేజీలు పైబడి దిగుబడి నమోదైంది. ఈ ప్రకారం చూస్తే హెక్టారుకు 56 బస్తాల దిగుబడి రాగా,  ఎకరాకు 22 బస్తాల దిగుబడి నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయవచ్చని వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. గత ఏడాది హెక్టారుకు 63 బస్తాలు రాగా.. ఎకరాకు 25 బస్తాలు గా తేలాయి. ఈసారి దిగుబడి తగ్గడమే కాకుండా రైతులు ధాన్యం విక్రయించుకోవడానికి అనేక అవస్థలు పడుతున్నారు.


Updated Date - 2021-01-13T05:16:34+05:30 IST