ఈ సినిమా మిస్‌ అయినందుకు బాధగా ఉంది

స్కైలాబ్‌ ప్రీ రిలీజ్‌ వేడుకలో నాని

సత్యదేవ్‌, నిత్యామీనన్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘స్కైలాబ్‌’. విశ్వక్‌ ఖండేరావు దర్శకుడు. ఫృథ్వీ పిన్నమరాజు నిర్మాత. డిసెంబరు 4న విడుదల అవుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ‘స్కైలాబ్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి యువ కథానాయకుడు నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నానిమాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో హిట్‌ కొట్టేస్తున్నారన్న విషయం చిత్రబృందం మొహాలు చూస్తుంటే అర్థమైపోతోంది. సినిమా విడుదలకు ముందు ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. అదేం వీళ్లలో లేదు. నిజానికి ఈ కథ ముందు నాకు చెబుదామనుకున్నాడట దర్శకుడు. కానీ చెప్పలేదు. అలా ఈ సినిమాని మిస్‌ అయినందుకు బాధగా ఉన్నా, నిత్యమీనన్‌ - సత్యల చేతుల్లో పడినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాతో నిత్య నిర్మాతగా మారింది. చిత్ర నిర్మాణంలో ఓ దిల్‌ రాజులా, ఓరామానాయుడు గారిలా పేరు తెచ్చుకోవాల’’ని అభిలషించారు. సత్యదేవ్‌ మాట్లాడుతూ ‘‘నాని అన్న వచ్చాడంటే నా సినిమా హిట్‌. ‘తిమ్మరుసు’కి తానొచ్చాడు. ఆసినిమా బాగా ఆడింది. ఇప్పుడూ హిట్‌ కొడతామన్న నమ్మకం ఉంద’’న్నారు. ‘‘నిర్మాతగానే కాదు. నటిగానూ నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ఇది. నేను చూసిన ఉత్తమ దర్శకులలో విశ్వక్‌ ఒకరు. తనకు మంచి భవిష్యత్తు ఉంద’’ని నిత్యమీనన్‌ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నా 12 ఏళ్ల కల. నాలుగేళ్ల కష్టం. నిత్యమీనన్‌ లాంటి నటి ఈ కథకు దొరకడం అదృష్టం. నాకైతే ప్రతి సినిమా ఆమెతోనే చేయాలని ఉంద’’న్నారు. ఈ కార్యక్రమంలో వివేక్‌ ఆత్రేయ, మున్నా, వెంకటేష్‌ మహా తదితరులు పాల్గొన్నారు. 


Advertisement