8 నెలలుగా ఎదురు చూపులు

ABN , First Publish Date - 2021-08-02T05:20:39+05:30 IST

లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులు తాము సాగుచేస్తున్న భూములు తమరివే అయినా దాదాపు 70 నుంచి 90 శాతం మందికి ఈ భూముల స్వరూపం, క్రమబద్ధీకరణ కాకపోవడానికి కారణలు తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న పలు రకాల సౌకర్యాలు పొందలేకపోతున్నారు.

8 నెలలుగా ఎదురు చూపులు

సాదాబైనామాల క్రమబద్ధీకరణలో జాప్యం

ఉమ్మడి జిల్లాలో లక్షకుపైగా దరఖాస్తులు

జారీ కాని మార్గదర్శకాలు.. అయోమయంలో తహసీల్దార్లు

పట్టించుకోని ప్రభుత్వం.. ఆందోళనలో రైతులు

హన్మకొండ, ఆంధ్రజ్యోతి

లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులు తాము సాగుచేస్తున్న భూములు తమరివే అయినా దాదాపు 70 నుంచి 90 శాతం మందికి ఈ భూముల స్వరూపం, క్రమబద్ధీకరణ కాకపోవడానికి కారణలు తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న పలు రకాల సౌకర్యాలు పొందలేకపోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన సీఎం కేసీఆర్‌.. సాదాబైనామాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. కానీ ఆ నిర్ణయం ఆచరణలో కానరావడం లేదు. తెల్లకాగితంపై భూమి కొనుగోలు లేదా రిజస్టర్‌ కాని క్రయవిక్రయాలను సాదాబైనామాగా పరిగణిస్తారు. రిజిస్ట్రేషన్‌ కాని కొనుగోలుపై ఏదైనా పట్టా పొందాలంటే వాటిని రెగ్యులరైజ్‌ చేయించుకోవడం లేదా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం చేస్తేనే పట్టా వస్తుంది. అదే ప్రస్తుతం జరగడం లేదు. సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

మార్గదర్శకాలేవి?

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు గత ఏడాది నవంబరులో దరఖాస్తులను స్వీకరించారు. మొదట్లో గ్రామాల పరిధిలోని దరఖాస్తులకు అవకాశమివ్వగా ఆ తర్వాత పురపాలికల పరిధిలోని విలీన గ్రామాలకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాదా కాగితాలపై చేసుకున్న ఒప్పందాలకు రిజిస్ట్రేషన్లు చేస్తారా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. భూములతో పాట్లు కొన్ని చోట్ల పట్టణాల్లో ఇళ్ల స్థలాల ఒప్పందాలు సైతం సాదా కాగితాలపై జరిగాయి. సాదాబైనామా కోసం దరఖాస్తులు స్వీకరించి 8 నెలలు గడిచింది. ఇప్పటివరకు వీటి పరిష్కారానికి తహసీల్దార్లు ఏ రకంగా ముందుకు వెళ్లాలనేది ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడలేదు. ప్రభుత్వం సాదాబైనామాలకు అవకాశం కల్పించినా వాటిని ఏ విధంగా క్రమబద్ధీకరించాలనే విషయంపై కొత్త రెవెన్యూ చట్టంలోనూ స్పష్టత లేదు. దీంతో అధికారుల్లోనూ అయోమయం నెలకొంది. 

నిలిపివేసిన కోర్టు

ఇదివరకు పాత రెవెన్యూ చట్టం ప్రకారం తహసీల్దార్లు మ్యుటేషన్‌ చేసేవారు. సాదాబైనామాల విషయంలో మ్యుటేషన్‌ చేసే అధికారం కలెక్టర్లకు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాకపోవడంతో ప్రస్తుతం అధికారులు వాటి గురించి పట్టించుకోవడం లేదు. దరఖాస్తుదారులు మాత్రం ఎదురుచూస్తున్నారు. పాత రెవెన్యూ చట్టం రద్దయ్యాక దాని ఆధారంగా చేపట్టే సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం క్రమబద్ధీకరణ ప్రక్రియను నిలిపివేసింది. తొలిసారి 2016లో సాదాబైనామాతో ఒప్పందం చేసుకున్న కొందరు రైతులకు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఉచితంగా పట్టా మార్పిడి చేసి భూములపై హక్కులు కల్పించారు. రెండో పర్యాయం చట్టబద్ధతకు గత నవంబరులో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు.

ధరణిలో లేదు..

సాదాబైనామాల దరఖాస్తుల పరిశీలనలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే తప్ప వాటిని పట్టించుకునే అవకాశం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల స్వీకరణకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉందంటున్నారు. ప్రస్తుతం భూముల లావాదేవీలు పూర్తిగా ధరణి పోర్టల్‌ ద్వారానే జరుగుతున్నాయి. ఇందులో సాదాబైనామాల దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన ప్రత్యేక ఐచ్చికం లేదు. ఇది కల్పిస్తేనే ప్రయోజనం చేకూరుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

దరఖాస్తులుదరఖాస్తులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మొత్తం 1,09,193 దరఖాస్తులు వచ్చాయి. మహబూబాబాద్‌ జిల్లాలో అత్యధికంగా దాఖలయ్యాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోని ఏడు మండలాల నుంచి 17,642, గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 42విలీన గ్రామాల నుంచి 9,256, మునిసిపాలిటీలు కలుపుకొని వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 28,413, జనగామ జిల్లాలో 11,734, మహబూబాబాద్‌ జిల్లాలో 30,246, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 5621,  ములుగు జిల్లాలో 6291 దరఖాస్తులు అందాయి.

 

Updated Date - 2021-08-02T05:20:39+05:30 IST