వ్యాక్సిన్‌ ఉత్పత్తి కాకుంటే.. మేం ఉరేసుకోవాలా..?

ABN , First Publish Date - 2021-05-14T07:53:56+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి కోర్టు ఆదేశాలు ఇస్తోందని అయితే అవసరమైన మేర ఉత్పత్తి జరగకుంటే ఉరి వేసుకోమంటారా? అని కేంద్ర మంత్రి డీవీ సదానందగౌడ వ్యాఖ్యానించారు...

వ్యాక్సిన్‌ ఉత్పత్తి కాకుంటే.. మేం ఉరేసుకోవాలా..?

కేంద్ర మంత్రి సదానందగౌడ వ్యాఖ్యలు

న్యాయమూర్తులు సర్వజ్ఞులు కాదు: సీటీ రవి


బెంగళూరు, మే 13(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి కోర్టు ఆదేశాలు ఇస్తోందని అయితే అవసరమైన మేర ఉత్పత్తి జరగకుంటే ఉరి వేసుకోమంటారా? అని కేంద్ర మంత్రి డీవీ సదానందగౌడ  వ్యాఖ్యానించారు. విధానసౌధలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం తాము ‘ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌’ చేయలేదని, నిష్పక్షపాతంగా యత్నిస్తున్నామని, అయినా డిమాండ్‌కు తగినంత ఉత్పత్తి లేదని అన్నారు. వ్యాక్సిన్‌ ప్రక్రియను ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 1.18 కోట్ల డోసులు టీకా వేశామన్నారు. మరో వారంరోజుల్లో వ్యాక్సిన్‌ సమస్య తీరనుందన్నారు. ప్రస్తుతానికి 18-44 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌ తాత్కాలికంగా నిలిపివేసి, 45 ఏళ్లు పైబడిన వారికి రెండో విడత టీకా వేయాలని నిర్ణయించామన్నారు. 17.22కోట్ల మేర దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి అయిందన్నారు. రష్యా నుంచి స్పుత్నిక్‌ 5 కోట్ల మేర దిగుమతికి ఒప్పందం కుదిరిందని, ఇందులో 75వేలు వచ్చాయన్నారు. 

 

జడ్జిలు ఆదేశిస్తే వెంటనే అయిపోదు

న్యాయమూర్తులు సర్వజ్ఞులు కారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి వ్యాఖ్యానించారు. వారు  ఆదేశించిన వెంటనే అమలు చేయాలంటే కష్టమన్నారు. కాగా, కేంద్రమంత్రి సదానందగౌడ, సీటీ రవిల వ్యాఖ్యలపై బెంగళూరు కర్ణాటక న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఏకే రంగనాథ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-05-14T07:53:56+05:30 IST