‘సదరం’ సర్టిఫికెట్ల జారీకి చర్యలు

ABN , First Publish Date - 2020-12-05T05:07:29+05:30 IST

జిల్లాలో వున్న దివ్యాంగులందరికీ సదరం సర్టిఫికెట్లు జారీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ అన్నారు.

‘సదరం’ సర్టిఫికెట్ల జారీకి చర్యలు

ఏలూరు క్రైం, డిసెంబరు 4 : జిల్లాలో వున్న దివ్యాంగులందరికీ సదరం సర్టిఫికెట్లు జారీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ అన్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న సదరం శిబిరాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోని ఒక ఆసుపత్రిలో సర్టిఫికెట్లు జారీ చేయడానికి సదరం క్యాంపులను నిర్వహి స్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 21 నుంచి సదరం శిబిరం నిలిచిపోయిందని నవంబరు 3 నుంచి మళ్లీ ప్రారంభించామన్నారు. 


ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి

సర్టిఫికెట్‌ పొందాలంటే ముందుగా సచివాలయంలో కాని, మీ సేవల్లో కాని సదరం స్లాట్‌ బుక్‌ చేయాలన్నారు. ఆ స్లాట్‌లో చూపిం చిన ఆసుపత్రి, తేదీలలో మాత్రమే వెళ్లాలన్నారు. ఎవరికి ఏ విభాగానికి సంబంధించి వైకల్యం ఉందో దానికి మాత్రమే స్లాట్‌ బుక్‌ చేయాలని స్పష్టం చేశారు. సర్టిఫికెట్‌లు మీ సేవ నుంచి రావడం లేదని ఫిర్యాదులు వచ్చాయని వీటన్నింటినీ సాఫ్ట్‌వేర్‌ టెక్నికల్‌ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని వారం రోజుల్లో పరిష్కారం అవుతాయన్నారు. మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ప్రజా సాధికారిత సర్వేలో మార్పులను సచివాలయంలో చేయించుకుని ఆ తరువాత దరఖాస్తు చేసుకోవాలన్నారు.  అంగవైకల్య నిర్ధారణ శాతం ఎంత ఉంటో అంతే వేస్తామని వైకల్య శాతాన్ని పెంచుకోవడానికి దళారుల మాటలు నమ్మవద్దని సూచించారు. అన్ని సేవలు ఉచితమేనని స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-05T05:07:29+05:30 IST